హిందూమందిరాల పునర్నిర్మాత మాతా అహల్యా బాయి హోల్కర్
అహల్యా బాయి రాజకుటుంబంలో జన్మించలేదు. సాధారణ రైతు కుటుంబంలో 31 మే 1725న మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ వద్ద చోండి గ్రామంలో జన్మించింది. ఆమె తల్లి సుశీలా షిండే, తండ్రి మంకోజీ షిండే. నేటి రాజకీయ భాషలో సంచార తెగలు / ఎస్సీ / ఎస్టీ కులానికి చెందిన కుటుంబంలో ఆమె జన్మించింది (నేడు వారి కులం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో జాబితాలో ఉంది). చిన్ననాటనే ఆమెకు గల భక్తి, నిర్భీకత చూసి మలహారరావు హోల్కర్ ఆమెను తన కుమారునికి ఖండేరావు హోల్కర్‌కు ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు ఆమె వయస్సు 10 సం.లు కాగా పెళ్లి కొడుకు వయస్సు 12 సం.లు.ఆమె అలా రాజ కుటుంబంలోకి ప్రవేశించింది. అయినా ఆమెలో అహంకారం ప్రవేశించలేదు. యుద్ధ విద్యలు, ప్రజాపాలనా విద్యలు నేర్చింది.
వరుసగా పిడుగుపాటు ఘటనలు
భర్త ఖండేరావు 1754లోను, తండ్రి వంటి మామ మలహరరావు 1766లోను, కుమారుడు మలేరావు 1766లోను, తరువాత కుమార్తె ముక్తా బాయి…. ఇలా ముఖ్యులందరూ ఆకాలంగా తనువు చాలించారు. ఈ పిడుగుపాటు ఘటనలతో అహల్యా బాయి కృంగి పోలేదు. 16 ఏండ్ల కుమారుణ్ణి కోల్పోయిన ఆమె 1767లో సింహాసనం ఎక్కింది. శివభక్తురాలుగా శివుని ప్రతినిధిగా పరిపాలన చేపట్టింది. ఉదార స్వభావం ఆమె ప్రవృత్తి. ఆమె మామ గారు పీష్వా ద్వారా మల్వా ప్రాంతానికి సుబేదార్‌గా ప్రకటింపబడ్డాడు. ఒక సమయంలో పీష్వా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ఆమె మామ గారితో, “మనం వారి వల్ల సుబేదార్ అయ్యాం. నేడు పీష్వాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారు అప్పుల్లో దిగబడితే మనం ఎలా బాగుంటాం?” అని వారి వద్ద గతంలో తీసుకున్న అప్పును తీర్చివేసింది. ఇదీ ఆమె ఉదారత!
గొప్ప సంస్కరణ వాది:
మహిళలకు విద్య, వితంతు మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాలు పట్ల ఆంక్షలు… ఇలా సాహసోపేత నిర్ణయాలు ఎన్నో చేసింది. సామాన్య ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ప్రజారంజకంగా పాలించింది. ఆమె కోట తలుపులు సామాన్యులు తమ గోడు చెప్పుకోడానికి ఎప్పుడూ తీసే ఉండేవి.
వీర రాణి:
తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తే గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణ రంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత అహల్యా బాయి. తమ మామ గారి వెంట అనేక యుద్ధాలకు వెళ్లి, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించింది. గెరిల్లా యుద్ధ విద్యలోనూ ఆరితేరింది. 1783లో జైపురు రాజ కుటుంబానికి చెందిన చంద్రావంత్‌ను అణిచి వేయడంలో ఆమె చూపిన యుద్ధ నైపుణ్యాన్ని నానా ఫడ్నవీస్ పొగుడుతూ ఆనాడు పూనాలో గాలిలో శతఘ్నులను పేల్చాడు.
హిందూధర్మ పునరజ్జీవనానికి కృషి
అహల్యా బాయి ప్రజాధనంతో కాక, తన మహిళా ధనంతో దేశవ్యాప్తంగా విదేశీ (ముస్లిం) పాలకుల వల్ల ధ్వంసమైన అనేక వందల మందిరాలను (సోమనాథ్, రామేశ్వరం, కాశీ, గయ, పూరి ఇలా…) అనేక మందిరాలను పునర్నిర్మాణం చేసింది. అన్నదాన సత్రాలను కట్టించింది. నదులపై ఘాట్‌లను నిర్మించింది. ఆమెది అఖిల భారత దృష్టి. ప్రజలకు నీటి వసతులు కల్పించింది. ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వస్త్ర పరిశ్రమ, వ్యాపార అవకాశాలు, ఇంకా అనేక విధాలుగా ముందు చూపుతో ప్రోత్సహించింది. ఆమె ముఖ్య పట్టణం మహేశ్వరం. మహేశ్వరం చీరలు అంటే ఇప్పటికి మంచి పేరే ఉంది!
గిరిజన తెగలతో స్నేహ హస్తం:
బిల్లులు, గోండులు వంటి గిరిజనులకు భూములను ఇచ్చిన అహల్యా బాయి. వారిని వ్యవసాయం వైపు మళ్లించి వారితో స్నేహం చేసింది. అటవీ ప్రాంతంలో ప్రజలకు దారి చూపుతూ ఉండే బిల్లులకు ప్రజల నుండి “భిల్ కావడి” వంటి పన్నును వారు సేకరించుకునేట్లు ప్రోత్సహించింది.
పొగడ్తలకు ఆమడ దూరంలో ఉంటూ ప్రజా రంజక పాలన చేసిన అహల్యా బాయి, రాజ కుటుంబంలో ఉన్నప్పటికీ అత్యంత నిరాడంబర జీవితం గడిపింది. సాధారణంగా కవులు రాజులను పొగిడి ధన సేకరణ చేసుకుంటూ ఉంటారు. పలువురు కవులు ఆమెను పొగుడుతూ కవిత్వం రాయడాన్ని ఆమె అంగీకరించేది కాదు. “నన్ను పొగుడుతూ కవిత్వం చెబితే మీకు ఆదాయం ఉండదు. ఆ శివుడిని పొగడండి లేదా దేశాన్ని కాపాడుతున్న సైనికులను పొగుడుతూ కవిత్వం రాయండి. మీకు ధనం ఇస్తాను” అనేది. ఇది ఆమె స్వభావం.
15 నూతన చట్టాలు:
పరిపాలనలో 15 నూతన చట్టాలను చేసింది అహల్యా బాయి. అడవుల నరికివేతను, త్రాగుడును, వరకట్నాన్ని నిషేధించింది. ఆమె పరిపాలనా వ్యవస్థలో అవినీతికి తావులేదు. న్యాయపాలనకు ప్రతీకగా అందరి పట్ల సమ భావంతో వ్యవహరించింది.
అహల్యా బాయి స్వయంగా గొప్ప భక్తురాలు. తన ముఖ్య పట్టణంగా ఉన్న ఇండోర్‌కు దూరంగా నర్మదా నదీ తీరాన గల మహేశ్వర్‌ను నూతన ముఖ్య పట్టణంగా నిర్మించింది. ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు ఆప్యాయంగా, గౌరవంగా పిలిచేవారు.
ధార్మిక ప్రవృత్తి కల్గిన పరిపాలకురాలిగా (philosophical princess) పాశ్చాత్య చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న అహల్యా బాయి 13 ఆగస్ట్ 1795న తన 70వ ఏట తనువు చాలించింది. ఆమెను భగవద్గీతలో పేర్కొన్నప్రకారం కర్మ యోగిగా పేర్కొనడం సముచితం. ఆమె జన్మించి 3 శతాబ్దాలు అయిన నేపథ్యంలో 300వ జయంతి ఉత్సవాలను మే 31, 2024 నుండి ఒక సంవత్సరం పాటు దేశమంతటా నిర్వహించుకుందాం! ఆమె జయంతి ఉత్సవాల ద్వారా మన దేశంలోని సాధారణ మహిళలలో దాగి ఉన్న అసాధారణ సామర్ధ్యాలను మన ప్రజానీకానికి, ప్రపంచానికి తెలియ చేద్దాం!
శ్యాం ప్రసాద్ జీ
అఖిల భారతీయ సామాజిక సమరసత ప్రముఖ