కేంద్ర బడ్జెట్ 2026-2027 : రైతులకు సమాచారం కోసం ఏఐ టూల్… ప్రధాన పంటలకు గుర్తింపు
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్ లో 2026-2027 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించుకుండా, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, ముందుకు సాగుతోందని ప్రకటించారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవిన్యూ వసూళ్లను 35,33,150 కోట్లుగా అంచనా వేశారు.
అయితే ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. తుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో, ప్రభుత్వ లక్ష్యం ధాన్యం ఉత్పత్తికే పరిమితం కాదని, వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమేనని ఆమె స్పష్టం చేశారు. పాడి, కోళ్ల పెంపకం, ఉద్యానవన, ప్రత్యేక పంటల ద్వారా రైతులకు ఆదాయ అవకాశాలను పెంచుతామని కేంద్ర మంత్రి నిర్మలా పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను వైవిధ్యపరచడం వల్ల రైతుల ఆదాయాలు పెరగడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని ఆర్థిక మంత్రి వివరించారు. ఇందుకు అనుగుణంగా, బడ్జెట్ 2026 సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, కొత్త ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.
వ్యవసాయంలో ‘‘AI’’ ఆధారిత వ్యవసాయ టూల్…
ఈ బడ్జెట్ సందర్భంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు మల్టీలింగ్వల్ ఏఐ ఆధారిత వ్యవసాయ టూల్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పంట ఎంపిక, సాగు ప్రణాళిక, వాతావరణ హెచ్చరికలు, పురుగుల నియంత్రణ, మార్కెట్ ధరల సమాచారం వంటి అంశాల్లో ఏఐ టూల్ రైతులకు ప్రాంతీయ భాషల్లో మార్గనిర్దేశనం చేస్తుందని మంత్రి ప్రకటించారు.
పాడి – కోళ్ల పెంపకంపై ప్రధాన దృష్టి
పాడి – కోళ్ల పెంపకాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ఆమె పేర్కొన్నారు. లక్షలాది మంది రైతులు, చిన్న కుటుంబాలకు ఈ రంగాలు లాభసాటిగా ఉంటాయన్నారు. రైతులు పాలు, గుడ్లు సంబంధిత ఉత్పత్తుల నుండి స్థిరమైన ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీనిని సాధించడానికి, మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, మార్కెట్ ప్రాప్యతను పెంచాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
జీడిపప్పు – కొబ్బరి పంటకు కొత్త గుర్తింపు :
2026 వ్యవసాయ బడ్జెట్‌లో జీడిపప్పు – కొబ్బరికి కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. ఎగుమతులను పెంచడంపై కూడా ప్రాధాన్యత ఇచ్చారు. జీడిపప్పు, కొబ్బరి సంబంధిత ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవడానికి రైతులు, వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గంధపు సాగును తిరిగి ఉత్తేజపరుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2026 వ్యవసాయ బడ్జెట్‌లో ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో బాదం, వేరుశెనగ వంటి పంటలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
భారతదేశం ప్రపంచంలోనే కొబ్బరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దేశంలో దాదాపు 30 మిలియన్ల మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా కొబ్బరి సాగు సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో, కొబ్బరి రంగానికి ప్రభుత్వం నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. కొబ్బరి ఉత్పత్తి చేసే కీలకమైన రాష్ట్రాల్లో ప్రభుత్వం కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని ఆమె అన్నారు. ఇది కొబ్బరి రైతులకు మెరుగైన మద్దతును అందిస్తుంది. కొబ్బరి సంబంధిత ఉత్పత్తుల నాణ్యత, అమ్మకాలు రెండింటినీ మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనె, ఫైబర్ వంటి ఇతర ఉత్పత్తులతో సహా కొబ్బరి విలువ పెంచి ప్రోత్సహిస్తుందని ఆమె వెల్లడించారు. అలాగే చందనం, వాల్ నట్ వంటి పంటలకు కూడా మద్దతు ప్రకటించారు. చందనానికి సంబంధించిన ఎకో సిస్టమ్న్ ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.