భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం : చైనా ప్రకటన

ఇరుదేశాల ఉమ్మడి అవగాహనలను అమలు చేయడానికి, ద్వైపాక్షిక సంబంధాలను వీలైనంత త్వరగా గాడిన పెట్టడానికి భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చైనా తెలిపింది. రెండు దేశాల ప్రధాన ఆందోళనలను గౌరవించుకోవడం, చర్చల ద్వారా పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వివరించారు.

చిత్తశుద్ధితో విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరముందని తద్వారా స్థిరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బుధవారం బీజింగ్‌లో ప్రత్యేక ప్రతినిధుల 23వ సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగశాఖ ఈ ప్రకటన చేసింది.డిసెంబర్ 2019 తర్వాత ఇలాంటి ఉన్నత స్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. సరిహద్దుల్లో శాంతి కోసం ఇరుదేశాలకు న్యాయమైన సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఈ చర్చల్లో అన్వేషిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరోవైపు, ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భారత్-చైనా సంబంధాలపై మాట్లాడుతూ చైనా చర్యల వల్ల 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతలకు భంగం వాటిల్లిందని చెప్పారు. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు.లాజిస్టికల్ సవాళ్లు, కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ మన బలగాలు చైనాను కట్టడి చేశాయని చెప్పారు. అయితే, నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని జైశంకర్ వివరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం కోసం పొరుగుదేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతకుముందు గాల్వాన్‌ లోయ ప్రతిష్టంభన తర్వాత సరిహద్దు నుంచి భారత్‌, చైనా బలగాలు వెనక్కితగ్గాయి. ఈనేపథ్యంలో ఇరుదేశాల మధ్య చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *