మూడు అవతారాలతో పెనవేసుకున్నది ‘‘అక్షయ తృతీయ’’

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన రోజులలో ‘అక్షయ తృతీయ’ ఒకటి. వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకునే ఈ పండుగకు ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతంలో ‘అక్షయ’ అంటే ‘క్షయం లేనిది’ లేదా ‘ఎన్నటికీ తరిగిపోనిది’ అని అర్థం. ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా, దానధర్మమైనా లేదా పెట్టే పెట్టుబడి అయినా అక్షయమైన ఫలితాలను ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలామంది ఈరోజు బంగారం కొనాలని అంటుంటారు అయితే ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలలోనూ రాయలేదు, అక్షయమైన పుణ్యాన్ని సొంతం చేసుకోవలని, దానధర్మాలు చేయాలని మన పురాణాలు చెబుతున్నాయి.

అదేవిధంగా సింహాచల క్షేత్రంలో స్వామివారు ఏడాది పొడవునా నిత్యం చందన లేపనంతో కప్పబడి ‘నిజరూపం’ కనిపించకుండా ఉంటారు. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే, అంటే అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆ చందనాన్ని తొలగించి, భక్తులకు స్వామి వారి ‘నిజరూప దర్శనం’ కల్పిస్తారు. ప్రహ్లాదుడిని రక్షించిన తర్వాత నరసింహ స్వామి ఉగ్రరూపంతో లోకాలను దహించివేస్తుంటే, ఆయన శాంతించడం కోసం దేవతలు చందన లేపనం చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ చల్లదనం కోసమే ఇప్పటికీ స్వామి వారు చందన కవచంలో ఉంటారు. అందుకే స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ అక్షయ తృతీయ రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా అని చెప్పనలవి కాదు. దీనికి ఒక యుగానితో సంబంధం ఉంది. మూడు అవతారాలతో సంబంధం ఉంది. అటు శక్తి ఆరాధనతో సంబంధం ఉంది. గంగావతరణంతో బంధం ఉంది.. ఈ రోజునే విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించాడు. అలాగే గంగానది భూమికి దిగివచ్చిన రోజు, త్రేతాయుగం ప్రారంభమైన రోజు కూడా ఇదే.. అ క్షిరాబ్ది కన్యను విష్ణుమూర్తి వరించింది అక్షయ తృతీయ నాడే.. పార్వతీదేవి అన్నపూర్ణగా తాను అవతరించింది ఈరోజే.. అందుకొరకే ఈరోజు చేసే అన్నదానం అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని పౌరాణిక వచనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *