దేవాలయాలను హైందవ జాతికే అప్పగించాలి : అలోక్ కుమార్
హిందూ జాతి గొప్పతనం మొత్తం దేవాలయంలోనే వుందని విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. మందిరాలు సామాజిక, సాంస్కృతిక, న్యాయ కేంద్రాలుగా వుండేవన్నారు. గ్రామాల్లో వివాదాలు జరిగినా.. మందిరం కేంద్రంగానే అవి పరిష్కారం అయ్యేవని పేర్కొన్నారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మొదటగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆదివారం హైందవ శంఖారావం నిర్వహించింది.
ఈ సందర్భంగా అలోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నిర్ణయమే నడుస్తుందన్నారు. ఆంగ్లేయుల పాలనలో దేవాలయాలను తమ చేతుల్లోకి తీసుకొని, నాశనం చేసిందన్నారు. జాతి గొప్పదనం అంతా దేవాలయంలోనే వుందని వారికి అర్థమై, ఇలా చేసిందన్నారు. దక్షిణ భారతంలో వున్న ఐదు రాష్ట్రాల్లో ఐదు లక్షల ఎకరాల దేవాలయ భూములున్నాయని, వీటన్నింటినీ ఆంగ్లేయులు గమనించి, దేవాలయాలను తమ చేతుల్లోకి తీసుకున్నారన్నారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలను మాత్రం ముట్టుకోలేదని, ఇదంతా ఓ కుట్ర అన్నారు. మరో వైపు పెద్ద పెద్ద ఆలయాలకి వచ్చే ధనాన్ని ధర్మ రక్షణ కోసమే వినియోగించాలన్నారు.
తిరుమల తిరపతి దేవస్థానికి సంబంధించిన ధనాన్ని 12 శాతం ఆడిట్ కోసం, కామన్ గుడ్ ఫండ్,నిర్వహణ.. ఇలా వివిధ పనుల కోసం మందిరాల ధనాన్ని వినియోగిస్తున్నారని మండిపడ్డారు. ఇది తీవ్ర అన్యాయమని ఆక్షేపించారు. దీనిని హిందువులమైన తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వాలు వివిధ చట్టాలను చేసి దేవాలయాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. దేవాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు, ఇతరత్రా ఉద్యోగులు నియామకం, బదిలీలు.. ఇలా కీలకమైనవన్నింటి అధికారం దేవాలయ కమిటీకి లేకుండా.. ప్రభుత్వాలు తమ చేతుల్లోకి తీసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అన్న పేరుతో ప్రభుత్వాలు ఇవన్నీ తమ చేతుల్లోకి తీసుకున్నాయన్నారు. నిజానికి ఈ పనులు చేయాల్సింది దేవాలయ ధర్మకర్తల మండలి, ధర్మాచార్యులు, భక్త సమాజమని అన్నారు. ఈ అధికారాలన్నింటినీ తిరిగి హిందువుల చేతికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ అధికారాలు ఏ సంస్థకో అప్పగిస్తున్నట్లు వార్తలు వచ్చాయని, ఆ వార్త తప్పని స్పష్టం చేశారు. దీనిని హైందవ సమాజం చేతికే అప్పగించాలన్నారు.దేవాయ నిర్వహణ మొత్తం హిందూ సమాజం ఏకమై చేసుకోవాలని అలోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఇందులో అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యం వుండాలన్నారు. వీరి ద్వారా స్వతంత్రంగా నిర్వహణ చేసుకునేలా వుండాలని, ప్రతిదీ పారదర్శకంగా వుండాలన్నారు. డబ్బుల ఖర్చు విషయంలోనూ పారదర్శకంగా వుండాలన్నారు. వీటన్నింటినీ భక్తులే నిర్వహించుకోవాలన్నారు. దేవాలయాలకి సంబంధించిన ధనం రోడ్ల నిర్మాణానికో, ఇతరత్రా పనులకో ఖర్చు చేయడానికి వీల్లేదన్నారు. హిందూ సమాజం పనులకు మాత్రమే ఖర్చు చేయాలన్నారు. దేవాలయ ట్రస్టుల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వ పెత్తనం వుండొద్దని, దేవాయల నిర్వహణ కిందే వుండాలన్నారు.
అలాగే భక్తుల సౌకర్యాలకు లోపం వుండకూడదని, అర్చకులకు గౌరవం ఇవ్వాలన్నారు. 200 సంవత్సరాలుగా హిందువులకు ఈ అన్యాయం జరుగుతోందని, దేవాలయాల విషయంలో హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. హిందువులు తమ దేవాలయాల విషయంలో చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వాలన్నీ శ్రద్ధతో గమనించాలని, వెంటనే దేవాలయాలను తమ చేతుల నుంచి విముక్తం చేయాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారు.