వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదు.. కొందరు భయపెడుతున్నారు : అమిత్ షా

వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగం విరుద్ధం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. కొంత మంది రాజకీయం కోసం అపోహలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కూడా ఈ అపోహలను ప్రచారం చేడయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీనిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
కొందరు మైనారిటీలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.మత వ్యవహారాలలో ముస్లిమేతరులను చేర్చే అంశం బిల్లులో ఏదీ లేదు. వారి పాత్ర మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి కాదు. చట్టప్రకారం నిర్వహణ జరిగేలా, వచ్చే విరాళాలు నిర్దేశించిన వాటికి మాత్రమే ఉపయోగించేలా చూడటం వారి పని… అని అమిత్ షా స్పష్టం చేశారు.వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతరులు మతపరమైన విషయాల్లోకి రారని, పరిపాలనా ప్రయజనాల కోసం బోర్డులు, కౌన్సిల్ లో ముస్లిమేతరులను నియమించవచ్చని తేల్చి చెప్పారు. హిందూ, జైన లేదా సిక్కు ఛారిటీ కమిషన్ వేరే మతానికి చెందినవారు లేరా? అంటూ ప్రశ్నించారు. మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారానికి దిగుతోందని, ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ఎలాంటి జోక్యమూ వుండదని తెలిపారు. యూపీఏ హయాంలో 2013 లో వక్ఫ్ బిల్లును మార్చిన సమయంలో ఆ తప్పును సరిదిద్దేందుకే వక్ఫ్ సవరణ బిల్లు 2024 ని తెచ్చామని తెలిపారు.
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేవలం ఓటు బ్యాంకు భయాల వల్లే ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో, విరాళాలుగా వచ్చిన ఆస్తుల విషయంలో వక్ఫ్ బిల్లు జోక్యం చేసుకుంటుందనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.ముస్లింలను భయపెట్టడంతో పాటు ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వక్ఫ్‌ బిల్లును మార్చే చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత 21 లక్షల హెక్టార్ల అదనపు భూమిపై క్లెయిమ్‌లు వచ్చాయి. అయితే, క్లెయిమ్ చేసిన మొత్తం భూమి 30 లక్షల హెక్టార్లకు పైగానే వుందన్నారు. ఈ బిల్లుతో ఒక్క ముస్లిం హక్కును కూడా హరించమని తేల్చి చెప్పారు. వక్ఫ్ పరిపాలనా నిర్వహణలో మాత్రం ఎవరైనా పాల్గొనవచ్చు గానీ… మతపరమైన నిర్వహణలో మాత్రం కేవలం ముస్లింలే వుంటారని ప్రకటించారు.
మైనారిటీలు ఈ చట్టాన్ని అంగీకరించరంటూ గతంలో ఓ ఎంపీ బెదిరింపులకు దిగారని అమిత్ షా చర్చ సందర్భంగా గుర్తు చేశారు. ఇది భారత ప్రభుత్వం, పార్లమెంటు చేసిన చట్టమని, దీనిని అందరూ అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. వక్ఫ్ సంస్థల మతపరమైన స్వయంప్రతిపత్తిలో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేషమాత్రమైనా లేదన్నారు. ఈ మేరకు తాము భరోసా ఇస్తున్నామన్నారు. సభ్యుల మనస్సులలో చాలా అపోహలున్నాయని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
వక్ఫ్ అనేది అరబిక్ పదమని, దీని చరిత్ర కొన్ని హదీసులతో ముడిపడి వుందన్నారు. దీని అర్థం అల్లాహ్ పేరిట దానం చేయడమని అన్నారు. ఈ అర్థం ఇస్లాం రెండో ఖలిఫా ఉమర్ కాలంలో ఉనికిలోకి వచ్చిందని, వక్ఫ్ అనేది ఓ రకమైన ధార్మిక దానమన్నారు. ముస్లిం సభ్యులు తమ సొంత సంపాదన మాత్రమే దానం చేస్తారని, ప్రభుత్వ ఆస్తి లేదా ఇతరుల ఆస్తి దానం చేయరని అమిత్ షా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *