వాళ్లు పాకిస్తాన్ ఉగ్రవాదులే : పార్లమెంట్ లో ప్రకటించిన అమిత్ షా
పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. హర్వాన్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ధ్రువీకరించారు. పహల్గాం ఉగ్రదాడిలో కీలక నిందితుడు సులేమాన్ ను కూడా భద్రత బలగాలు హతమార్చాయని పేర్కొన్నారు.మంగళవారం లోక్ సభలో జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా ఈ విషయాలను ధ్రువీకరించారు.
ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఈ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారని, ఈ సందర్భంగా భద్రతా బలగాలను, జమ్మూ కశ్మీర్ పోలీసుకు అభినందనలు తెలిపారు. అయితే ఈ ముగ్గురూ పాక్ నుంచే వచ్చారని, దీనికి తగ్గ ఆధారాలు కూడా తమవద్ద వున్నాయని ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి అత్యంత అమానుష ఘటన అని, మతం పేరు అడిగీ మరీ పర్యాటకులను చంపారని మండిపడ్డారు. ఆ దాడి జరిగిన ప్రాంతానికి తాను వెళ్లానని, బాధితులను కూడా కలుసుకొని, వారి బాధలను విన్నానన్నారు. తాజాగా భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయని, పహల్గాం ఉగ్రదాడి కీలక నిందితుడు సులేమాన్ హతమయ్యాడని ప్రకటించారు.
ఇక.. ప్రతిపక్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి విషయంలో ఫోరెన్సిక్ ద్వారా తమకు కొన్ని విషయాలు తెలిశాయన్నారు. అమాయక పౌరులపై దాడులు చేస్తే తమ ప్రభుత్వం గట్టి స్పందననే ఇస్తుందని తేల్చి చెప్పారు. ‘‘మరోవైపు ఇలాంటి సమయంలో విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా వున్నాయి. వారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఆలోచించుకోవాలి. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు ఆధారాలున్నాయా? అని కాంగ్రెస్ నేత చిదంబరం అడుగుతున్నారు. మీరు పాక్ కు మద్దతుగా మాట్లాడుతున్నారా? కేంద్ర హోంశాఖా మంత్రగా పనిచేసిన ఓ వ్యక్తి ఇలా మాట్లాడటం తగదు. వారు పాక్ నుంచే వచ్చారనేందుకు మా వద్ద ఆధారాలున్నాయి. వారి నుంచి పాక్ లో తయారైన పత్రాలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నాం’’ అని అమిత్ షా ప్రకటించారు.