‘చికెన్ నెక్ భారతదేశ భూభాగం: అమిత్ షా

చికెన్ నెక్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యంత కీలక ప్రకటన చేశారు. చికెన్ నెక్ అని పిలిచే సిలగురి కారిడార్ భారత్ భూభాగంలో విడదీయరాని భాగమని, దానిని ఎవరూ ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. కారిడార్ సమీపంలోని బాగ్డోగ్రాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే భూమిని తెంచేయాలని నినాదాలు చేసిన వ్యక్తులకు ఆ కూటమి నాయకులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘ఢిల్లీలో కూర్చున్న కొందరు చికెన్స్ నెక్ కారిడార్ ను కట్ చేస్తామని నినాదాలు చేస్తున్నారు. దీనిని ఎలా నరికేస్తారు? అదేమైనా మీ నాన్నకి సంబంధించిన భూమి అనుకుంటున్నారా? ఇది భారత దేశ భూమి. దీన్ని ఎవరూ తాకలేరు’’ అని అమిత్ షా తేల్చి చెప్పారు.
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి కారిడార్ యొక్క మరోపేరు చికెన్ నెక్. కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది. చికెన్‌ నెక్‌కు పశ్చిమాన నేపాల్, ఉత్తరాన్న భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్, తూర్పున ఈశాన్య రాష్ట్రాలుఉన్నాయి. ఈ ప్రాంతం డార్జిలింగ్, జల్పైగురి జిల్లాల్లో విస్తరించి ఉంది.
ఈ ప్రాంతం యొక్క భౌగోళిక ఆకృతి కారణంగ ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఇండియా మ్యాప్‌లో ఈ సన్నని భూభాగం కోడి మెడ లాంటి ఆకారంలో కనిపిస్తుంది. చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకోచ్చు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపును దేశంతో అనుసంధానిస్తుంది. రవాణా, వాణిజ్యం, సైనిక సరఫరాలు అన్నీ ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులతో ఉండటం వల్ల ఇది భౌగోళికంగా ప్రత్యేకమైనది. సిలిగురి నగరం వాణిజ్యం, రవాణా కేంద్రంగా ఉంది. ఇది భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లతో వాణిజ్యానికి ఒక గేట్‌వేగా పనిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *