పహల్గాం దారుణ హత్యలకు ప్రతిస్పందనే ఇది : అమిత్ షా
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదులు పాల్పడిన దారుణ హత్యలకు భారత్ స్పందనే ఈ ఆపరేషన్ అని అమిత్ షా తేల్చి చెప్పారు.
దేశ భద్రతా బలగాల చర్యలపై తనకెంతో గర్వంగా వుందని పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన దారుణ హత్యలకు ప్రతిస్పందనే ఈ ఆపరేషన్ అని ప్రకటించారు. భారత్ పై, దేశ ప్రజలపై జరిగే ఏ దాడికైనా తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో వుందని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి భారత్ కట్టుబడి వుందని అమిత్ షా తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ పై ప్రతీకార చర్యలు చేపట్టింది. అందరూ అనుకున్నదే జరిగి తీరుతుందని, మోదీపై విశ్వాసం వుంచాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన రెండు రోజులకే అత్యంత కీలక పరిణామం జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం అత్యంత మెరుపు దాడులు చేసింది.
భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లో ని ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను, వారికి ఉపయోగపడే ఇతర సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసేసింది. పూర్తి కచ్చితత్వంతోనే ఈ దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.