బంజరును ‘బంగారం’గా మార్చే అమృత్‌ మిట్టి

బంజరు భూమిని బంగారంగా మార్చే ప్రక్రియను కనిపెట్టింది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అల్కా లహొటి. బిజ్నూర్‌కు చెందిన అల్కాకు  నాగినా గ్రామంలో పెద్ద గోశాల ఉంది. అక్కడి గోవుల మూత్రం, పేడ ఉపయోగించి భూమిని సారవంతం చేసే ప్రత్యేకమైన ‘అమృత్‌ మిట్టి’ని తయారు చేసింది అల్కా. ఈ అమృత్‌ మిట్టి నిస్సారమైన నేలను కూడా సారవంతంగా తయారు చేస్తుందని ఆమె అంటోంది.

ఇండోనేషియాలో స్థిరపడ్డ అల్కా లహొటి కొంత కాలం క్రితం బిజ్నూర్‌లోని తన తాతలనాటి ఇంటికి వచ్చింది. అక్కడి గ్రామీణ వాతావరణానికి ఆకర్షితురాలైన ఆమె అక్కడే ఒక స్థలం కొని అందులో గోశాల ప్రారంభించింది. ఆ తరువాత గోశాలను సరిగా నిర్వహించే పద్దతులను తెలుసుకోవడం కోసం ఆమె నాగపూర్‌లోని దేవల్‌ పార్‌లోని ‘గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం’ లో శిక్షణ పొందింది. అక్కడే గో మూత్రం, పేడతో ప్రత్యేకమైన ఎరువును తయారుచేయడం ఎలాగో కూడా నేర్చుకుంది.

ఈ అమృత్‌ మిట్టిని పొలాల్లో చల్లితే రైతులకు వేరే ఎరువు వాడే అవసరం ఉండదు. ఆ విధంగా సేంద్రీయ వ్యవసాయానికి మారే అవకాశం ఉంటుంది. అడ్డు అదుపు లేకుండా రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం క్రమంగా క్షీణించిపోతుందని, ఇది మనుషులతో పాటు జంతువులకు కూడా నష్టమని అల్కా అంటున్నారు. రసాయన ఎరువుల వల్ల జిల్లాలోని వ్యవసాయ భూముల్లో లవణ శాతం పెరిగిపోయిందని దీనివల్ల భూములన్నీ క్రమంగా నిస్సారమై బంజరుగా మారుతున్నాయని ఆమె వెల్లడిరచారు. మట్టిలో లవణ శాతం పెరిగిపోవడం వల్ల బయట నుంచి ఎరువుల వంటి పదార్ధాలను ఉపయోగించి నెలలో పోషక విలువలను పెంచే వీలు ఉండదని, దీనివల్ల పంటలు సరిగా పెరగవని ఆమె వివరించారు. అమృత్‌ మిట్టిని ఉపయోగించడం వల్ల ఈ లోపాన్ని సరిచేయవచ్చని ఆమె అన్నారు.

దేశీ ఆవు పేడలో అత్యధిక మోతాదులో కార్బన్‌, యూరిక్‌ ఆమ్లం, యూరియా ఉంటాయి. వీటివల్ల ఏర్పడే క్రిములు, బాక్టీరియా విత్తనాలు, ఎండు ఆకులు మట్టిలో కలిసేందుకు దోహదం చేస్తాయి. అమృత్‌ మిట్టిని పొలాల్లో జల్లడం వల్ల ఈ ప్రక్రియ జరిగి మట్టిలో కార్బన్‌ మూలకాలు పెరిగి సారం వృద్ధి చెందుతుంది.

అమృత్‌ మిట్టిని తయారుచేయడంలో బిజ్నూర్‌ రైతులకు శిక్షణ ఇవ్వాలని అల్కా అనుకుంటున్నారు. దానివల్ల ఎవరికి వారు తమ పొలాలకు అవసరమైన అమృత్‌ మిట్టిని తయారుచేసుకోగలుగుతారు.

అమృత్‌ మిట్టి తయారు చేసుకునే విధానం

2.5 అడుగుల వరకు మట్టిలో ఎండు ఆకులు చల్లాలి. గో మూత్రం, పేడతో కలిపిన ద్రవాన్ని ఆ మట్టిపై జల్లాలి. అందులోనే విత్తనాలను కలపాలి. ఈ ప్రక్రియను 21 రోజుల్లో రెండు సార్లు చేయాలి. 21 రోజులు పూర్తయిన తరువాత అమృత్‌ మిట్టి తయారవుతుంది. 30 క్వింటాళ్ళ అమృత్‌ మిట్టి దాదాపు ఆరు ఎకరాల భూమిని సారవంతంగా మారుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *