అమృతకలశం శ్రీ వెంకటేశ తాపిన్యుపనిషత్ ఈ ఉపనిషత్తుపై తొలి ప్రత్యేక ప్రవచనంలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
– గుండు వళ్ళీశ్వర్, సీనియర్ పాత్రికేయులు
“శ్రీనివాసుడి భక్తుల పాలిటి అమృతకలశం శ్రీ వెంకటేశ తాపిన్యుపనిషత్… ఈ అంశం మీద నేను ప్రత్యేకంగా ప్రవచనం చెప్పటం ఇదే మొదటిసారి ” అన్నారు ప్రముఖ ప్రవచన కర్త శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ.
ఆయన చెప్పిన ఈ ఉపనిషత్ పూర్వాపరాలు ఇలా ఉన్నాయి:
ఇలాంటి ఉపనిషత్ ఒకటి ఉన్నది అన్న విషయం ఎంతోమంది పండితులకు కూడా తెలియదు. కొంత కాలం క్రితం తిరుపతిలో నేను ప్రవచనాలు చెప్పేటప్పుడు డా॥ కె. వి. రాఘవాచార్య గారు శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయము ద్వారా ప్రచురించిన ‘శ్రీ వేంకటేశ్వర సాహిత్య సర్వస్వము’ అనే బృహత్ గ్రంథాన్ని బహూకరించారు. అది అప్పటికె చాలాకాలం క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ప్రచురించిన గ్రంథం. అందులో చివర్లో ఈ ఉపనిషత్ గురించి ప్రస్తావన ఉంది. నాటి ప్రవచనాలలో కూడా ఈ ఉపనిషత్ గురించి నేను ఉటంకించి చెప్పడం జరిగింది. ఆ తరువాత రోజుల్లో నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఈ ఉపనిషత్ 1904 లోనే ఉత్తరాదిన దేవనాగరి లిపిలో ప్రచురితమై ఉంది. అధర్వణ వేద మంత్ర రహస్యాలే ఈ గ్రంథం. ఇది ఉపాసనకు ఉపకరించే గ్రంథం. అయితే ఈ ఉపనిషత్ కు తెలుగులో అనువాదం కానీ వ్యాఖ్య కానీ లేదు…
మే 6 న హైదరాబాద్ కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ‘శ్రీ వెంకటేశ తాపిన్యుపనిషత్ ‘ తెలుగు గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ ఆయన ఇంకా ఇలా చెప్పారు:
శ్రీ వేంకటేశ్వరుని ఉపాసనకి సంబంధించిన ఈ తాపిన్యుపనిషత్ గురించి విని, శ్రీనివాసుడి పరమ భక్తుడైన పోస్ట్ మాస్టర్ జనరల్ (హైదరాబాద్) డాక్టర్ విద్యాసాగర రెడ్డి గారు దీని సంస్కృత మూలాన్ని సేకరించి, ఎంతో శ్రమ తీసుకొని తెలుగులోకి అనువదింపజేశారు. నన్ను కలిసినప్పుడు ఆయన ఈ ఉపనిషత్ పట్ల ఎంతో ఆరాటం, ఆరాధన వ్యక్తం చేశారు. ఈ గ్రంథాన్ని ఆయన ఎందరో మహా పండితులకు, పీఠాధిపతులకు చూపించి, వాళ్ళ ఆశీర్వాదంతో ముద్రింపజేశారు. నిజం చెప్పాలంటే, శ్రీ వేంకటేశ్వరుడి భక్తులకు ఇది ఒక అమృతకలశం…
విదేహరాజు అయిన జనక మహారాజు ఒక దశలో రాజ్యభారాన్ని తన తమ్ముళ్ళకి అప్పగించేసి, తపోవనాలకి వెళ్ళిపోయాడు. అక్కడ సూర్యకిరణాల శక్తిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తున్న అనేకమంది మునుల మధ్య అపారమైన సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న మహర్షి శాఖాయన్యుడు దర్శనమిచ్చారు. జనక మహారాజు స్తుతితో సంతసించి, ఆయన ఏదైనా వరం కోరుకోమన్నాడు.
“కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలనే అరిషద్వర్గాలకు బానిసైన ఈ శరీరంతో కామోపభోగాలు అనుభవించాలనే కోరిక లేదు. ద్యుమ్న, ప్రద్యుమ్న, ఉగ్రసేన, అంబరీష, ఇంద్రద్యుమ్న తదితర చక్రవర్తులే అన్ని భోగాలనూ వదిలేసి వెళ్ళిపోయారు కదా! ఆ భోగాల మీద ఆసక్తి నాకూ లేదు. చీకటి నూతిలో కప్పలా సంసారబంధంలో కొట్టుమిట్టాడుతున్నాను. నన్ను ఈ బంధం నుంచి విముక్తుడిని చేయండి…” అని జనకుడు ప్రార్ధించాడు.
ఇందుకు భగవద్భక్తి యోగం తప్ప మరో మార్గం లేదని అంటూ, శాఖాయన్యుడు అపార కరుణతో జనకుడికి బోధించిన భక్తిసాధనా మార్గం శ్రీ వెంకటేశ తాపిన్యుపనిషత్ లోని సారం.
పూర్వ తాపిన్యుపనిషత్ గురించి శ్రీ షణ్ముఖ శర్మ సమగ్రంగా వివరించారు.
సర్వ సులభుడైన వేంకటేశుడుగా సగుణబ్రహ్మమై వేంకటాచలంలో ఉన్నాడు. ఏది వైకుంఠమో అదే వేంకటాచలం. శిలా రూపంలో దర్శనమిస్తున్న ఆ వేంకటేశుడే, ఆయనను బ్రహ్మ అన్న భావనతో ఉపాసిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడే ఆయన్ని చూడాలి అన్నంత తపనతో, ఆర్తితో, ఆరాధనతో ఉపాసిస్తే ముక్తి లభిస్తుంది…
పుష్కరిణీ తీరంలో, వక్షస్థలంలో రమా సమేతుడై స్వయం వ్యక్తమైన స్వామి ఇవ్వాళ కూడా మనకి కనుపిస్తున్నాడు. స్కంద, బ్రహ్మాండ, నృసింహ పురాణాలు ఇదే విషయం చెప్పాయి. ఉపాసనతో ఆయన భక్తులకు సర్వ సులభుడు. ఆ ఉపాసనా మంత్రాన్ని జనకుడికి శాఖాయన్య మహర్షి బోధించాడు. ఇక్కడివరకూ పూర్వ తాపిన్యుపనిషత్.
ఉత్తరతాపిన్యుపనిషత్ ఉపాసనా విధానాన్ని వివరిస్తుంది:
మొట్టమొదట ‘వేంకటేశ ‘ అన్న మంత్ర శబ్దం వెలువడగానే విన్నవాడు బ్రహ్మ. ఆ తరువాత ఆయన విన్న శబ్దం ‘శ్రీ’… స్కాంద పురాణం ఏం చెబుతుందంటే ఎవరి నోట భక్తిభావంతో ‘శ్రీ వేంకటేశ వినబడుతుందో వాళ్ళకి దేవతలు నమస్కరిస్తారు. గురూపదేశంతో ఈ మంత్రాన్ని ఉపాసించాలి. ఈ ఉపాసనలో మంత్రం, యంత్రం, తంత్రం ఉన్నాయి. ‘వేంకటేశ’ అంటే పాపాలను దహించేవాడు.
‘శ్రీ ‘ని రమగా వక్షస్థలంలో ధరించేవాడు కనుక ‘శ్రీనివాసుడు ‘… వేద వేద్యుడు కనుక ‘గోవింద ‘… గురు ముఖతః స్వీకరించిన మంత్రంతో ఉపాసన చేయగా చేయగా స్వామి సాక్షాత్కరిస్తాడు.
అలా మొట్టమొదట బ్రహ్మకి సాక్షాత్కరించినవాడు – వేయి శిరస్సులతో ప్రకాశించే విరాట్ పురుషుడు.
ఆ మంత్ర జపం వల్ల బ్రహ్మకి సృష్టి చేసే శక్తి లభించింది. ఈ మంత్ర జపంతోనే – చతుర్భుజాలు, కటివరద శంఖ చక్ర హస్తాలతో పీతాంబరధారియైన వేంకటేశుడిని దర్శించాడు బ్రహ్మ. అలా వ్యక్తమైన స్వామే బ్రహ్మకి ఈ అష్టాక్షరి మంత్రాన్ని ‘శ్రీ వేంకటేశాయ నమః’ ఉపదేశించాడు.
ఉపాసనకి మహా చక్రవిధానాన్ని బోధించాడు. వృత్తాకారంలోని సుదర్శన చక్ర రూపంలో నాభి స్థానం నుండి ఒక్కో చక్రంలో ఈ మంత్రాక్షరాలు ఎలా ఉంటాయంటే – షడక్షరాల దళాలు, అష్టాక్షర
దళాలు, ద్వాదశాక్షర దళాలు, షోడశాక్షర దళాలు, చతుర్వింశాక్షర దళాలు, చివరగా 32 అక్షరాల దళాలు. బ్రహ్మ మొదట తెలుసుకొని వేంకటాచలంలో ఈ ఉపాసన చేశాడు.
ఎలా స్తోత్రం చేయాలో కూడా స్వామి బోధించాడు.
‘ఓం భూర్భువస్సువః …
భూనభోంతరాళాలు ఆవరించి ఉన్నవాడు. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు…ఆయనే లక్ష్మి, సరస్వతి, గౌరి. వేదములుగా, వేద శాఖలుగా, ఏకాదశ రుద్రులుగా, ద్వాదశ ఆదిత్యులుగా కనుపించే సర్వదేవతాత్మకుడైన ఆ నారాయణుడే ‘వేంకటేశుడు.’
నారాయణోపనిషత్ లో మంత్రాలు లాగా, ఈ ఉపనిషత్ లో కూడా మంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ తాపిన్యుపనిషత్తుని అధ్యయనం చేసి, ఈ ఉపాసనా విధానాన్ని సాధన చేస్తే, సూర్య, వాయు, చంద్రాదులు కూడా పొందలేని ‘మహోన్నత స్థితి ‘ని భక్తుడు పొందగలడు…
ఇలా శ్రీ తాపిన్యుపనిషత్ పూర్వ, ఉత్తర భాగాలపై భక్తిరసభరితమైన తొలి ప్రత్యేక ప్రవచనం చేయటమే కాక, ఈ మంత్రోపాసనా విధి ఒక గ్రంథంగా, పండితులందరి అభిప్రాయాలు మరో గ్రంథంగా శ్రోతలకు పరిచయం చేశారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. వారిని ఈ గ్రంథాల వ్యాఖ్యాతని ముద్రాపకులు పూతలపట్టు అనసూయ, డాక్టర్ విద్యాసాగర రెడ్డి దంపతులు సత్కరించారు.
(ఈ గ్రంధము ఉచితముగా లభిస్తుంది. ప్రతులకై svtp.anasuya@gmail.com ను సంప్రదించగలరు)