భారతీయత ఆధారిత ఆర్థికనమూనా
ఇటీవల జరిగిన ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో, దేశంలోని బహుసంఖ్యాక ప్రజలకు నూతన ఉద్యోగావకాశాలు, మరియు జీవనోపాధి అవకాశాలు అన్వేషించాలని తీర్మానించారు. ఈ మధ్య సంభవించిన కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వలన అతలాకుతలమైన జీవనోపాధి రంగంలో, భారతీయత ఆధారంగా ఒక నూతన ఆర్థిక నమూనాను ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నదని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నమూనా ఎలా ఉండాలంటే, పెరుగుతున్న ఉద్యోగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయం, ఎగుమతులు, పరిశ్రమలు మరియు సేవా, సహాయ రంగాలలో భారతదేశ స్వావలంబన ఆధారంగా తయారుచేయాలి. ఆర్.ఎస్.ఎస్.లోని మేధావి వర్గం, మనదేశంలోని మానవవనరులను నిరంతరం విస్తరిస్తూ, లాభసాటి అయిన ఉపాధి కల్పించటంలో, మన స్వంత, స్థిరమైన పరిష్కారాలను సూచిస్తూ వస్తున్నది. ఇంకా, భారతీయత ఆధారంగా జరిగే దేశాభివృద్ధి, ఇక్కడ సమృద్ధిగా ఉన్న సహజమైన, మానవవనరులను ఒక న్యాయమైన, స్థిరమైన పద్ధతిలో వినియోగించుకుంటే, సులభం అవుతుంది. ఆర్.ఎస్.ఎస్. కొన్ని దశాబ్దాలుగా, యువతలో క్రమశిక్షణ, దేశభక్తి మొదలైన సుగుణాలను పెంపొదించుతూ వస్తున్నది. ఈ రెండు జాతి నిర్మాణ సుగుణాలే, భారతీయత ఆధారంగా జరిగే దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
భారత్‌లోని సహజరంగం ఇక్కడి ప్రజలకు నిత్యజీవనోపాధి ద్వారా ఒక స్థిరమైన ఆదాయం కల్పించేందుకు అపారమైన అవకాశాలను కల్పిస్తు న్నది. భారతదేశంలోని పర్యావరణ సంబంధమైన చేతివృత్తులు, హస్తకళలు, నేతపని సంప్రదాయాలే ఒకప్పుడు భారత్ ను సంపన్న దేశంగా నిలబెట్టాయి. క్రీ.శ.23 నుండి 79 వరకు ఉన్న ఒక రోమన్ అధికారి, గ్రంథకర్త అయిన Pliny ‘భారతీయవ్యాపారులు తమ చేతివృత్తుల, హస్తకళల వస్తువులను విక్రయించి, అందుకు ప్రతిగా బంగారం తీసుకెళ్ళేవారు’ అని వ్రాశారు. వాస్తవంగా, భారతదేశంలోని కుటీరపరిశ్రమలలో తయారైన నాణ్యమైన హస్తకళల వస్తువులు, చేనేత వస్త్రాలు, బంగారం కంటే అత్యంత విలువైనవి అని చెప్పవచ్చు. కానీ దురదృష్టవ శాత్తూ, ఛత్తీస్‌గఢ్‌లోని వామపక్ష తీవ్రవాద (నక్సలైట్) ఉద్యమం గిరిజనులలో అటువంటి అమూల్యమైన హస్తకళల నైపుణ్యాన్ని నాశనం చేసింది. భోపాల్ కు చెందిన బటువా కళానైపుణ్యం కానీ, గుజరాత్‌లోని బంధని పూసలతో చేతివృత్తులు కానీ, ఆదిలాబాద్, ఒడిషాలలో ధోక్రా హస్తకళలు, బీదర్ కు చెందిన బిద్రీవేర్, కాశ్మీర్‌లోని కాగితపు గుజ్జుతో తయారైన వస్తువులు, మరియు తివాచీల ప్రదర్శన, రాజస్థాన్ లోని కొయ్య, దంతపు వస్తువులు, అస్సాం, తమిళనాడు, తెలంగాణ, ఆంధప్రదేశ్, మహారాష్ట్ర, ఒడీషాలలోని నేతవస్త్రాలు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు.
ప్రపంచమంతటా ఇప్పుడు పర్యావరణంతో మమేకమయ్యే చేతివృత్తుల, హస్తకళల తయారీకి ప్రాధాన్యం పెరుగుతూనే ఉన్నది. ఐసిఎంఏ ఆర్.సి. నివేదిక ప్రకారం ఇప్పుడు విశ్వవిపణిలో చేతివృత్తుల, హస్తకళల అమ్మకాల ప్రాధాన్యం 680.10 అ.డాలర్ల నుండి 1252 బిలియన్ డాలర్ల వరకూ పెరిగింది. భారతదేశం ఇప్పుడు ఇటువంటి చేతివృత్తుల, హస్తకళల కళాత్మకత, నైపుణ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నట్లయితే, దానికి తగిన ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చు కోగలుగుతుంది. ఒక ఒడిస్సీ చిత్రకారుడు, ఇంకా ఒడిస్సీ రాతిశిల్పాలను చేసే కళాకారులు, తమతమ శిల్పాలలో అనురాగం, క్రోధం, కరుణ వంటి గుణాలను అబ్బురపరచేవిధంగా తయారుచేయ గలరు. అతివిలువైన చిత్తూరు గ్రానైట్ రాతిశిలలను తీసుకువెళ్లి, అరబ్బు దేశాలలోని హోటళ్లు, కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఇటువంటి శిలలు ఆయా దేశాలలో అక్కడి కళాత్మకతను ఇనుమడింప జేస్తాయి. భారతీయ కళాకారులు భారత్ లోని రాతిశిలలను అద్భుతంగా మలిచి, దేశ, విదేశాలలో ఎక్కువ ధర పలికేటట్లు చేస్తున్నారు. ప్రాచీనకాలంలో భారత్‌ను బంగారుబాతు అనేవాళ్లు, ఎందుకంటే, ప్రకృతిలో దొరికే అనేక సాధారణ వస్తువులకు సైతం, ఎక్కడైనా అధికధర లభ్యం అయ్యేది.
భారతదేశంలోని చేతివృత్తుల వలెనే, అన్యదేశాల స్థానిక ఆహారాలకు కూడా ఇది బంగారుగని వంటి నిలయమని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో ఏకసంస్కృతి మరియు అధిక సబ్సిడీ ఆధారిత – నిలకడలేని సాగు పద్ధతుల వత్తిళ్ల వలన, ఆహారసమృద్ధి, నిల్వలు తగ్గుముఖం పడుతున్నది. కానీ, భారతదేశం, తమ స్థానిక ఆహారపంటలలో తగినంత విస్తృతమైన జన్యుస్వచ్ఛత వలన, ఇంకా పైచేయి కలిగి ఉన్నది.
ఇటీవల ప్రచురింపబడిన ఒక ఐక్యరాజ్యసమితి నివేదికలో ఏమి చెప్పారంటే, నేడు అరుదైన, అమూల్యమైన, జన్యువైవిధ్యం కలిగిన, ప్రియమైన జీవజాతులు అంతరిస్తున్నా, మానవాళికి అవసరమైన ఆహారసరఫరా, ఆరోగ్యం, భద్రత మొదలైన విషయాల్లో జీవవైవిధ్య విపత్తులను నియంత్రించటంలోనూ, ప్రపంచం విఫలమౌ తున్నది, భారతదేశంలోని ప్రియమైన సస్యవైవిధ్యం (పంటల మార్పు) ప్రజల ఆహారసమృద్ధి మరియు పోషకావసరాలు తీర్చేందుకు వినియోగించవచ్చు.
భారతదేశంలోని సుమారు 15 కోట్ల మంది రైతులు, 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు, కలిపి సంయుక్తంగా కృషి చేసినట్లయితే, స్థూల జాతీయోత్పత్తిలో 72% సహకారం అందించ వచ్చు. 2018 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం, స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం 19.9%, అసంఘటిత కార్మికరంగం 52% సహకారం అందించాయి. దీర్ఘకాలం వ్యాపించిన కోవిడ్ మహమ్మారి ఈ అసంఘటితరంగాన్ని బాగా దెబ్బతీసింది. నిజానికి ఈ అసంఘటిత రంగంలోని కార్మికులకు ఎటువంటి సహాయమూ అవసరం లేదు, వాళ్ళకు కావలసినది ఏమంటే, ఒక ఆరోగ్యకరమైన సామాజిక సాంస్కృతిక పర్యావరణం. ఒక పారదర్శకమైన న్యాయవ్యవస్థ, పరిపాలనారంగంలో స్నేహపూర్వక సిబ్బంది వంటి సౌకర్యాలను కల్పించినట్లయితే, అసంఘటిత కార్మికరంగం కూడా భారత్‌ను ‘ఈజ్ ఆఫ్ బిజినెస్’లో అగ్రస్థానంలో నిలబెడుతుంది.
అసంఘటిత రంగంలోని కార్మికులు, రకరకాల తినుబండారాలు, జీవవ్యర్థాలు అధోకరణం చెందే ఉపకరణాలు, పట్టణీకరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మత్స్యసంపదను పెంపొందించే కార్యాచరణలు, కిరాణా దుకాణాలు నడపటం, రెస్టారెంట్లు, ధాబాలు నిర్వహించటం, వందలకొద్దీ అటవీఉత్పత్తుల విక్రయం మొదలగునవి అనేకరకాల కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తారు. వారిలో చాలామంది పేదవారు, నిరక్షరాస్యులు అయినప్పటికీ, వారి మెరుగైన పనితనం, అనుభవం, నైపుణ్యత, సృజనాత్మకతలతో మర్యాదగా, చక్కగా జీవించగలరు. భారతదేశం వ్యవసాయం, ఇంకా అసంఘటిత కార్మికరంగాలే కాకుండా, ఒక చైతన్యవంతమైన యాత్రికుల రంగం, పర్యాటక రంగం, వన్యప్రాణుల విహార/పర్యాటక రంగం, అటవీ రంగం, పశుసంవర్ధక రంగం, ఉద్యానవన రంగం మొదలైన విషయాలలో విజయవంతమైన భారీ ఉపాధి అవకాశాలను సృష్టించగలదు.