అభివృద్ధిబాటలో ఆనందపూర్‌

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధికి నిలయంగా మారింది. హర్యానాలోని రోహ్తక్‌ జిల్లాలోని భాలి ఆనంద్‌ పూర్‌ అనే చిన్నగ్రామం ఉంది. ఆనంద్‌పూర్‌ అంటే ‘సంతోషకరమైన ప్రదేశం అని అర్థం, కానీ ఒకప్పుడు ఆ గ్రామంలో ఆ పరిస్థితులు ఉండేవి కావు. నిత్యం ఎదో ఒక గొడవల వల్ల పోలీస్‌ స్టేషన్‌, జైలుకు వెళ్లడం ఆ గ్రామ యువకులకు సర్వసాధారణమైన విషయం. నిరంతరం పోలీసుల జోక్యం అవసరమయ్యే చోట గందరగోళం పరిస్థితులు ఉండేవి. బస్‌ కండక్టర్లు కూడా ఆ గ్రామస్థులను బస్సులో ఎక్కించుకునే వారు కాదు. ఎందుకంటే బస్‌ చార్జీలు అడిగితే బస్సులో గందరగోళం సృష్టించేవారు. ఇంతటి భయకంర పరిస్థితులు ఉన్న ఆ గ్రామం కొంత మంది సామాజిక కార్యకర్తల సహకారంతో, సేవాభారతి మద్ధతుతో ‘చంద్రశేఖర్‌ ఆజాద్‌ సేవా సమితి’ పేరుతో అభివృద్ధి బాట పట్టింది. గ్రామ యువతలో మార్పు మొదలై గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుచడానికి ఉద్యమాన్ని చేపట్టారు.

గ్రామంలోని ఒక కమ్యూనిటీ సెంటర్‌లో యువకులు, వృద్ధుల కోసం వార్తాపత్రికలు ఏర్పాటు చేయడంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ చిన్న కార్యక్రమం ‘షాహిద్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ సేవా సమితి’  పురోగతికి శాంతియుత విప్లవానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ సమితి రాష్ట్రీయ సేవా భారతితో కలిసి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టంది.

గ్రామంలోని యువత కోసం గ్రామ నడి బొడ్డను ‘‘కేశవ్‌ భవన్‌’’ అనే పేరుతో మూడంతస్తుల భవనం నిర్మాణాన్ని చేపట్టారు. అందులో మొదటి అంతస్తు తక్షశిల విద్యా మందిర్‌, రెండో అంతస్తు ఆర్యభట్‌ అధ్యయన కేంద్రం, సబ్‌ లెఫ్టినెంట్‌ అతుల్‌ కుమార్‌ కంప్యూటర్‌ కేంద్రం, షాహిద్‌ పైలట్‌ సందీప్‌ పలద్వాల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. వివిధ పోటీ పరీక్షల కోసం తక్షశిల విద్యా కేంద్రంలో చదువుతున్న 48 మంది విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు కావడాన్ని బట్టి సమితి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలుస్తుంది. దీనికంతటికి కారణం హర్యానా గ్రామాభివృద్ధికి శాఖ  ప్రాంతీయ డిప్యూటీ హెడ్‌ అనూప్‌ సింగ్‌, అతని సహచరుల సంకల్పమే. వీరు సంఘం నుంచి ప్రేరణ పొంది సేవాభారతి మద్దతుతో  గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు.

హర్యానా ప్రాంత సేవా ప్రముఖ్‌ శ్రీ కృష్ణ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో 3 నుండి 12వ తరగతి విద్యార్థులకు మంచి అలవాట్లు పెంపొందించేందుకు ఆరు సంవత్సరాల క్రితం స్థాపించిన వివేకానంద సంస్కార్‌ కేంద్రం, సమీప గ్రామాలైన గడ్డి, ఖేడి, బనియాని, దోభ్‌ విద్యార్థులను కూడా  ఆకర్షిస్తున్నది. షాహిద్‌ పైలట్‌ సందీప్‌ పలాడ్వాల్‌ గ్రంథాలయంలో 5000 పుస్తకాలు, చందాలతో కూడిన వివిధ మ్యాగజైన్‌లు, వార్తాపత్రికల వంటి సమాచార నిధి విద్యార్థులకు ఎంతో దోహదపడుతున్నది. ఈ గ్రంథాలయం పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు జ్ఞాననిధిగా పనిచేస్తుంది. మోను రోజ్‌ ప్రస్తుతం బరేలీలో స్టేషన్‌ మాస్టర్‌, జ.I.ఖీ. సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ సుమిత్‌ రోజ్‌ ఈ గ్రంథాలయంలో చదువుకున్న వారే.

హర్యానా అమ్మాయిలు అథ్లెటిక్స్‌ నుండి రెజ్లింగ్‌ వరకు వివిధ క్రీడలలో విజయం సాధించారు. భలి ఆనంద్‌పూర్‌లో ఏర్పాటు చేసిన దుర్గా క్రీడా కేంద్రంలో ఇస్తున్న కోచింగ్‌ వల్ల బాలికలు ఫుట్‌బాల్‌, ఇతర క్రీడలపై పట్టును సాధిస్తున్నారు. గ్రామానికి చెందిన నిషు, మంజు, కాజల్‌తో సహా 5 మంది అమ్మాయిలు జాతీయ స్థాయిలో పోటీల్లో తమ ప్రతిభను చాటారు. మరోవైపు మహిళల కోసం రాణి లక్ష్మీబాయి కుట్టు మిషన్‌ కేంద్రాన్ని ప్రారంభించి వారిని స్వయంగా ఆధారపడేలా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ఒక బ్యాచ్‌ ముగిసిన తర్వాత గ్రామంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కుట్టు మిషన్‌ కేంద్రం మారుతుంది. దీనివల్ల గ్రామంలోని అందరూ మహిళలు స్వయంగా ఉపాధి పొందుతారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు బలరామ్‌ కిసాన్‌ సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభిం చారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ సేంద్రియ ఎరువు తయారీపై శిక్షణ ఇస్తున్నారు.

కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ సమితి కార్యక్రమాలు గ్రామంలోని యువకులు, వృద్ధులు మహిళలకు సహాయం చేయడమే కాకుండా వారిని పరోపకారం చేసేలా ప్రేరేపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *