తేనెటీగల దాడి నుంచి 25 మంది చిన్నారులను కాపాడి.. ప్రాణాలు కోల్పోయిన అంగన్వాడీ కార్యకర్త

మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో అంగన్వాడీకి చెందిన వంట మనిషి ధైర్యం, ప్రేమ అందరికీ స్ఫూర్తినింపింది. తేనెటీగల దాడి నుంచి 20 మంది చిన్నారులను రక్షించి, తన ప్రాణాలు కోల్పోయింది. మడవాడ పంచాయతీలోని అంగన్‌వాడీ కేంద్రంలో తేనెటీగల గుంపు అకస్మాత్తుగా ఆ ప్రాంగణంలో ఆడుకుంటున్న పిల్లలపైకి రావడంతో ఈ ఘటన జరిగింది.

ఈ సమయంలోనే అంగన్వాడీ కేంద్రంలో వంట మనిషిగా వున్న కాంచన్ బాయి మేఘ్వాల్ తన జీవితం గురించి గానీ, తన ప్రాణాల గురించి కానీ ఏమాత్రం ఆలోచించకుండా.. సమీపంలో వున్న టార్పాలిన్లు, చాపలను పట్టుకుని, పిల్లలకు చుడుతూ… వారి శరీరాన్ని పూర్తిగా కప్పేసి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సమయంలో తేనెటీగలు ఆమెపై దాడి చేశాయి. వందలాది తేనెటీగలు ఆమెను కుట్టాయి. అయినప్పటికీ, అందరి చిన్నారులనూ క్షేమంగా కాపాడేంత వరకూ కాంచన్ బాయి.. పోరాడుతూనే వుంది.

అయితే.. కాంచన్ బాయి పోరాటాన్ని, ధైర్యాన్ని చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడటానికి ప్రయత్నాలు చేసే సమయానికే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే పోలీసులు, గ్రామస్థులు స్థానిక హెల్త్ సెంటర్ కి తరలించారు. కానీ.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ప్రకటించారు. ఆమె శరీరంలో లెక్కలేనన్ని తేనెటీగలు కుట్టిన దాఖలు స్పష్టంగా కనిపించింది. పోస్ట్ మార్టం తర్వాత ఆమె మృతదేహాన్ని ఆమె గ్రామానికి తరలించారు. ఈ సమయంలో ప్రజలు భారీ సంఖ్యలో ఇంటికి చేరుకొని, ఆమెకి, ఆమె ధైర్య సాహసాలకు, ఆమె పోరాట స్ఫూర్తికి నివాళులు అర్పించారు.

ఇక.. ఈ ఘటనపై గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్ష్యులు కూడా స్పందించారు. కాంచన్ బాయి అంగన్‌వాడీ పిల్లలను భోజనం పెట్టి, మంచి నీటి కోసం దగ్గరలో వున్న చేతి పంపు వద్దకు వారందర్నీ తీసుకెళ్లిందని, ఆ సమయంలోనే చెట్టుపై వున్న తేనె టీగలు ఒక్కసారిగా, అకస్మాత్తుగా దాడి చేశాయని పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన కాంచన్ బాయి… టార్పాలిన్లు, చాపలతో పాటు తన చీరతో కూడా ఆ పిల్లలను కాపాడిందని పేర్కొన్నారు.

కాంచన్ బాయి కేవలం అంగన్వాడీ కార్యకర్త మాత్రమే కాదు.. గ్రామీణ పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టేది. జై మాతాదీ అనే స్వయం సహాయ సంఘానికి అధ్యక్షురాలు కూడా. కుటుంబానికి ఆమే ఏకైక ఆధారం. ఆమె భర్త శివలాల్ పక్షవాతంతో బాధపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *