మార్పు కోసం మరో అడుగు

ఒక మనదేశం తప్ప ప్రపంచ దేశాలన్నీ పితృస్వామ్య దేశాలే. మనదేశంలో భార్యలో కూడా తల్లిని చూడగలం. కానీ విదేశీయులు భార్య అంటే భోగవస్తువు మాత్రమే అనుకుంటారు. మనది మాతృ స్వామ్య వ్యవస్థ. చరిత్ర చూసుకుంటే ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోనూ మహిళల్ని అణచివేయడం మనం గమనించవచ్చు. సంఘపరంగా అనేక వివక్షతలను వారు ఎదుర్కుంటారు. కానీ భారత దేశంలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ, గౌరవం లభిస్తుంది. అదేంటీ దేశంలో మహిళలపై ఎన్ని జరగట్లేదు ఇంకా మనదేశంలో మహిళలకి రక్షణ ఎక్కడుంది అని వాదించేవారూ లేకపోలేదు. కానీ మహిళలపై ఇవాళ జరుగుతున్న అక్రమాలకు కారకులు కుటుంబమూ, సమాజమే.

పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి, స్త్రీని భోగవస్తువుగా చూస్తున్నారు నేటి ఆధునికులు. నిజమైన సంప్రదాయవాదాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించ లేరు. అదే మన భారతీయ సంస్కృతి విశిష్టత. ఆధ్యాత్మిక పరంగా చూసినా స్త్రీది విశిష్టత స్థానమే. రాముడు, శివుడు, కృష్ణుడులాంటి దేవుళ్లెం దరున్నా వారందరినీ ఆ ఆదిపరాశక్తి అంశంగా చూపిస్తాం. జగన్మాత నుంచే సర్వజగత్తూ వచ్చిందని భావిస్తాం. స్త్రీని శక్తి స్వరూపిణిగా, పరాశక్తిగా, సృష్టి, స్థితి లయాలకు కారకులైనవారికి కూడా తల్లిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. విశ్వానికి అంతటికీ ఆధారభూతమైన, కారణమైన ఆ మహాశక్తి పురుష రూపంలో ఉండే అవకాశం లేదని ఋషుల భావన. ఇంతటి మహా విశ్వాన్ని సృజించి పెంచి పోషించి మరలా తనలోనే లయింపచేసుకునే అన్ని శక్తుల మూలకారణం స్త్రీ స్వరూపమే. కుటుంబంలో కూడా తండ్రి కన్నా తల్లిదే అగ్రస్థానం. దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాదించేవారు ఉన్నారు. అయినా ఉన్నాడో లేడో అనే వాదన అనవసరం. దేవుడినే తలుచుకుంటూ మిగతావారిని నిర్లక్ష్యం చేయమని మన సంస్కృతి ఎప్పుడూ బోధించ లేదు. కంటికి కనిపించే తల్లి, తండ్రి, గురువునే ప్రత్యక్ష దైవంగా భావించమంది. అందుకే దేవుడి కన్నా ముందు మాతృదేవోభవ అంటూ తల్లికి నమస్కరించిన తర్వాతే పితృదేవోభవ అని చెప్తోంది వేదం. ఇక పూజల విషయానికొస్తే యజ్ఞయాగాదు లైనా, వ్రతాలైనా నోములైనా ఏదైనా సరే అలాంటి క్రతువుల్లో పాల్గొనడానికి వివాహితుడు కానివారికి, భార్యావియోగం పొందిన వారికి అర్హత లేదు. భార్యతో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తేనే పూర్తి ఫలం దక్కుతుంది. అదీ మన సంస్కృతిలో స్త్రీకి ఉన్న ప్రాధాన్యత. ఇవన్నీ ఒక ఎత్తయితే పరాయి స్త్రీని కూడా తల్లిలా, సోదరిలా భావించి పూజించ మని చెప్తోంది వేదం. పృధ్వీరాజ్‌ ‌చౌహాన్‌, ‌రాణాప్రతాప్‌, ‌శివాజీ లాంటి ఎందరో మహోన్నత వీరులు తాము జయించిన రాజ్యంలోని పాలకుల భార్య లను సోదరి, తల్లి సమానంగా భావించి సకల లాంఛనాలతో వారి రాజ్యాలకు సాగ నంపారు. ‘కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండ నొల్లదు’ అనే భావన కూడా మహిళకు భారతీయ సంప్రదాయంలో ఉన్న విశిష్టతను తెలియచేస్తుంది. మనం భూమి మీదకి రావడానికి ఎంతో కష్టపడి, మనకు జన్మనిచ్చి తన చల్లని ఒడిలో లాలించి పాలించి తల్లి ప్రేమను పంచే ఆ మహాశక్తి ముమ్మాటికీ అమ్మ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రేమను పంచి, అనురాగాన్ని కురిపించగలగడం తల్లికి మాత్రమే సాధ్యం.

స్త్రీని గౌరవించని, ఆమెకు ప్రాధాన్యమివ్వని ఏ నాగరికతైనా, సమాజమైనా మనుగడ సాగించలేదు. ఆమె సహకారం లేకుండా ఏ క్షిష్టమైన పనీ సాధ్యం కాదు. ప్రతి ఇంటిలోను ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిగా పిల్లల్ని సంస్కార వంతులుగా, ఉన్నత పౌరులుగా తీర్చే గురుతరమైన బాధ్యత స్త్రీదే. ఏ ఇంటిలో స్త్రీ మానసిక, శారీరక వ్యధ అనుభవిస్తుందో ఆ కుటుంబం నుంచి వచ్చే సంతానం నేరస్తులుగా మారే ప్రమాదం అంత ఎక్కువగా ఉందనేది ముమ్మాటికీ నిజం.

నిజమైన ప్రేమ రుచి చూడాలంటే అమ్మాయిని మాతృసమానంగా, సోదరి సమానంగా చూస్తే చాలు, అప్పుడే ఆమె నిజమైన ప్రేమను కురిపిస్తుంది. ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినప్పుడు ఆమే పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి లోకరక్షణ చేస్తుందనే సందేశాన్ని తెలుపగలగాలి. అందుకు మాతృమూర్తులు కూడా నడుం బిగించాలి. అప్పుడే మహిళలపై అక్రమాలు కొనసాగిస్తున్న దుర్మార్గుల్ని అణిచివేయగలం. ఈ మార్పు ప్రతి ఇంటినుంచిమొదలుకావాలి.

 – లతాకమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *