పీఓకే విదేశీ భూభాగమే… ”ఉన్నమాట” ఒప్పేసుకున్న పాక్
కొన్ని సంవత్సరాలుగా పీఓకే భారత అంతర్భాగమంటూ కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్న మాటే నిజమైంది. పీఓకే విదేశీ భూభాగమని పాక్ తేల్చి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగమేనని పాక్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపింది. పీఓకేలో పాకిస్తాన్కి ఎలాంటి అధికారం లేదని, పాక్ చట్టాలు కూడా అక్కడ చెల్లవని కుండబద్దలు కొట్టింది. కశ్మీర్ జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసు విచారణ సందర్భంగా పాక్ అదనపు ఏజీ ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మద్ ఫర్హాద్ షా ప్రస్తుతం పీఓకేలో పోలీస్ కస్టడీలో వున్నట్లు అదనపు అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. అది విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు వుంటాయని, పాక్ చట్టాలు మాత్రం అక్కడ చెల్లవంటూ వ్యాఖ్యానించారు. ఈ కారణాల రీత్యానే ఆయన్ను కోర్టు ముందు ప్రవేశపెట్టడం కుదిరే వ్యవహారం కాదని అన్నారు. దీంతో జస్టిస్ కయానీ స్పందించారు. ఒక వేళ పీఓకే విదేశీ భూభాగమైతే.. పాక్ సైన్యం, రేంజర్లు ఎందుకు ఆ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడుతున్నారంటూ ఎదురు ప్రశ్న వేశారు. సామాన్యులను విచారణ పేరుతో నిఘా సంస్థలు బలవంతంగా నిర్బంధిస్తున్నారంటూ జస్టిస్ మండిపడ్డారు.
రావల్పిండిలో తన ఇంట్లో వున్న అహ్మద్ ఫర్హద్ షా అనే పాత్రికేయుడ్ని పాక్ నిఘా సంస్థ మే 15న కిడ్నాప్ చేసేసింది. దీనిపై ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టుకెక్కారు. ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జస్టిస్ మోసిన్ అక్తర్ కయాని నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. అహ్మద్ ను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం పక్షాన అదనపు అటార్నీ వాదనలు వినిపించారు. అహ్మద్ ఫర్హాద్ షా ప్రస్తుతం పీఓకేలో పోలీస్ కస్టడీలో వున్నట్లు అదనపు అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. అది విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు వుంటాయని, పాక్ చట్టాలు మాత్రం అక్కడ చెల్లవంటూ వ్యాఖ్యానించారు. ఈ కారణాల రీత్యానే ఆయన్ను కోర్టు ముందు ప్రవేశపెట్టడం కుదిరే వ్యవహారం కాదని అన్నారు.