భారత చట్టాలను పాటించండి.. లేదా వెళ్లిపోవచ్చు : సుప్రీం కోర్టు
వినియోగ దారుల గోప్యత, ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ మాతృసంస్థ మెటా పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ కి సంబంధించిన ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్ లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ చట్టాలను పాటించకపోతే భారత్ ను వీడి వెళ్లొచ్చని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. 2021 లో వాట్సాప్ గోప్యత విధానానికి సంబంధించిన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది.
భారత పౌరుల గోప్యతతో ఏ కంపెనీ కూడా ఆటలు ఆడుకోవడాన్ని ఏమాత్రం అనుమతించబోమని సీజేఐ తేల్చి చెప్పారు. ‘మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతించం. ఈ సందేశం మీ వాట్సాప్ లో కూడా స్పష్టంగా తెలపాలి’’ అని మెటాకి సీజేఐ తేల్చి చెప్పారు. అలాగే కొన్ని సార్లు మెటా విధానాలను అర్ధం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బందిపడ్డామని వెల్లడించారు. ఓ సారి తనకు ఓ వైద్యుడు వాట్సాప్ లో మందుల చీటీ పంపితే.. దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్ లో కనిపించాయన్నారు. ఇక దేశంలోని లక్షలాది మంది పేదలు, నిరక్షరాస్యులు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు.
అంతేకాకుండా అప్పీలుదారులందర్నీ త్రిసభ్య ధర్మాసనం ముందు తుది విచారణ కోసం జాబితా తయారు తయారు చేయాలని, అలాగే నాలుగు వారాల్లోగా కౌంటర్ ను కూడా దాఖలు చేయాలని ఆదేశించారు. మరో వైపు ప్రభుత్వం పక్షాన సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సాప్ వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని, ఇది అచ్చు దోపిడీ కిందికే వస్తుందని వాదించారు.
ఇక.. విచారణ సందర్భంగా మెటా పక్షాన ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. వినియోగదారులకు ఈ సేవల నుంచి వైదొలగే అవకాశాలు కూడా వున్నాయని, అలాగే కోర్టు ప్రస్తావించిన ఆదేశాలు నవంబర్ 15 నాటి ఉత్తర్వుకు సంబంధించినవి అని పేర్కొన్నారు. ఈ కేసు ఇప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు విచారణకు రానుంది, ఇక్కడ డేటా గోప్యత మరియు టెక్ కంపెనీల బాధ్యతపై ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ విచారణ వచ్చే సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీన సుప్రీం కోర్టులో జరగనుంది.
2021 జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం యూజర్లు వాట్సాప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్ బుక్ తో పంచుకొనేందుకు అనుమతి లభిస్తుంది. కొత్త పాలసీని అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లేనని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో కేంద్రం జోక్యం చేసుకుంది. పాలసీ అమలును నిలిపేయాలని ఆదేశించింది.