నిర్మాణ శిల్పనైపుణ్యం
దైవం-దేవాలయం-2
హింపి క్షేత్రంలో విరూపాక్ష మందిరంలో ఉన్న విశాల మంటపంలో 12 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలలో వరుసగా మేషాది ద్వాదశ రాశులను రాశి అధిపతులను రాతిలోనే రమ్యంగా మలిచారు. సూర్యుడు మేష రాశిలో ఉన్నపుడు సూర్యోదయ కాలంలో సూర్య కిరణాలు మేషరాశి గల స్తంభం మీదనే పడుతుంటాయి. మిగిలిన మాసాలలో కూడా ఆయా రాశులుగల స్తంభాల మీదనే కిరణాలు పడుతాయి. ఈ మందిర గాలిపోపురం ప్రొద్దున్న దేవాలయం వెనుక గోడపై నీడ తలకింద్రులుగా పడుతుంది. ఈ మందిర నిర్మాణం మంత్రశాస్త్ర, జ్యోతిష్యశాస్త్ర, వాస్తు శాస్త్ర, గణిత, శైవ, తంత్ర పురాణేతిహాస రహస్యాలను వెల్లడిరచేలా జరిగింది. తంజాపూరు బృహదీశ్వరాలయంలో 192 అడుగుల ఎత్తుల గోపురం నీడ పగలు`రాత్రి ఎప్పడూ నేలమీదపడదు. అజంతా ఎల్లోరా ఆలయాలు కొండను శిల్పకళతో మలచినట్లుం టాయి. పానగల్లులో ఛాయాసోమేశ్వరాలయంలో ఒక వస్తువుకు 2,3,6 నీడలు పడతాయి. సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉయ్యాల మండపమును ఆనుకున్న రాతిని ఊపితే ఉయాల్యలాగ ఊగుతుంది. 1213 సంవత్సరంలో నిర్మించబడిన రామప్ప దేవాలయంలో గర్భగుడిమీద విమానంలో ఉపయోగించిన ఇటుకలు చాల పెద్దవి. ఇవి నీటిలో తేలుతాయి. విజయవాడ గుంటూరు మార్గంలో ఉన్న మంగళగిరి క్షేత్రంలో ప్రతిరోజు వందలకొద్దీ కడవల బెల్లపు పానకము శ్రీ నరసింహ స్వామికి సమర్పిస్తారు. కాని ఆ ప్రాంతంలో చీమలు కాని, ఈగలు కానీ ఉండవు.
రాజమండ్రి దగ్గర ర్యాలిలో ఉన్న జగన్మోహిని కేశవస్వామి కాలిబొటనవేలు దగ్గర నీరు చెమ్మగిల్లి ధారగా వస్తుంటుంది. హలీబేడు పార్శ్వనాథా లయంలో స్తంభాలలో మన ప్రతి బింబములు కనబడతాయి. అంతేగాక కాన్‌కేవ్, కాన్‌వెక్సు అద్దంలో కనబడునట్లు మన నీడలు చిన్నవిగా, పెద్దవిగా తలక్రిందులుగా, ఇంకా పెక్కు రకాలుగా కనిపిస్తాయి. బేళూరు చెన్న కేశవ స్వామి విగ్రహం, సాలభంజికలని చెప్పబడే విగ్రహాలు, వాని శిల్పకళానైపుణ్యము గొప్పది. తిరువనంతపురం పద్మనాభ దేవాలయ ప్రాంగణంలో ఒక స్తంభముపై చిన్న శబ్దం చేస్తే 25 అడుగుల దూరంలో ఉండే మిగిలిన స్తంభాలలో వినిపిస్తుంది. అనంతపురం గుర్తి కోటలో ఉన్న రామాలయంలో సూర్యాస్తమయ వేళలో సూర్యుని కిరణాలు శ్రీరాముని పాదాలపై పడునట్లు వాస్తు శాస్త్రజ్ఞులు దేవాలయం రూపొందించారు.
అంతటాఉన్న దేవుడు వ్యక్తమయ్యే స్థానమే దేవాలయం. దేవాలయం సమాజానికి ప్రతిబిం బంగా ఉంటుంది. దేవాలయానికి అందరూ వెళ్తారు. మనశ్శాంతికి వెళతారు. గోవిందుడు అందరివాడు. గోవిందుడు అందరినీ కలిపినట్లే మనం కూడా అందనీ కలుపుకోవాలి. దేవాలయంలో మూలవిరాట్టు వద్ద రాగితో చేసిన యంత్రం ప్రతిష్ఠిస్తారు. అక్కడ శక్తి నెలకొంటుంది. ఆగమ శాస్త్రం అనుసరించి ముఖమంటపం, అర్థ మంటపం, అంతరాలయ దీపపు కాంతులతో భగవంతుని దర్శనం, ఇదంతా జరుగుతుంది. లోపల ఉన్న దీపమే గురువు. ఆ గురువు ప్రవచన కాంతిలో దేవుణ్ణి దర్శించుకోవాలి.బయట పరివారదేవతలుంటారు. ఎదురుగా వారి వాహనా లుంటాయి. ధ్వజస్తంభముంటుంది. ధ్వజము అంటే జెండా. జెండా స్థానంలో ధ్వజస్తంభముంటుంది. ధ్వజం కనబడితే మనకు ధైర్యమొస్తుంది. ధ్వజం కనబడితే దేవుడున్నట్లే. అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ ఆకాశదీపం ఉంటుంది. అక్కడ ఎగిరిన పతాకం ఉత్సవాలకు నాంది. ఆలయం అనేక మందికి పనికల్పిస్తుంది. ఒకరు వాయిద్యం వాయిస్తారు, ఒకరు పాడగలరు, నృత్యం చేయగలరు, ఒకరు వస్త్రాలను ఉతుకుతారు, ఒకరు గుడి శుభ్రం చేస్తారు, ఒకరు పాత్రలు తోముతారు, ఒకరు పల్లకీ పట్టుకుంటారు. ఒకరు స్వామికి కళారాధన చేస్తారు.
– హనుమత్ ప్రసాద్