శక్తి స్వరూపమైన ప్రకృతి ఆరాధనకి ప్రతీక ‘‘తీజ్ పండుగ’’

హిందువులు శక్తి ఆరాధకులు. భిన్న జాతులు, సమాజాలు వున్నా.. వారి సంస్కృతులు, పద్ధతులు వేర్వేరుగా వున్నా… చివరికి అందరూ ఆరాధించేది శక్తిని. శక్తి రూపంలో వున్న ప్రకృతినే. ‘‘ఆత్మవత్ సర్వ భూతేషు’’ అన్నది గీతా వాక్యం. అందరిలోనూ, అన్నింటిలోనూ ఈశ్వరుడ్ని దర్శించడం మన ప్రధాన సారాంశం. ప్రతి పండుగ కూడా ప్రాచీన భారత అస్తిత్వపు మూలాలను మరింత దృఢం చేస్తూనే వుంటాయి.

శక్తి ఆరాధన చేసే పండుగల్లో ‘‘తీజ్ పండగ’’ కూడా ఒకటి. శ్రావణ మాసంలో దీనిని జరుపుకుంటారు.రాఖీ పౌర్ణమి మొదలు, కృష్ణాష్టమికి ముగుస్తుంది. ముఖ్యంగా లంబాడాలో పెళ్లికాని యువతులందరూ  ఈ పండుగను జరుపుకుంటారు. అష్టైశ్వర్యాలు, ఆయురోరాగ్యాలతో పాటు పంట పొలాలు,  మంచి భర్త లభించాలని పూజిస్తారు. ముఖ్యంగా బంజారాలు శక్తి ఆరాధకులు కాబట్టి, పార్వతీ దేవిని, సాతీ భవానీని ఈ తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ సాతీ భవానీ పార్వతీ దేవి అంశంగా బంజారాల నమ్మకం. పార్వతీ దేవి వీరిని సర్వదా కాపాడుతుందని కూడా బలంగా విశ్వసిస్తారు. ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో పెరిగి, ప్రకృతినే తమ ఆత్మల్లో నిక్షిప్తం చేసుకున్నవారు బంజారాలు వారు ప్రకృతి రూపంలోనే, ప్రకృతి నైవేద్యంతోనే తీజ్ పండగను జరుపుకుంటారు.దీనినే మొలకల పండగ కూడా అంటారు.ముఖ్యంగా తీజ్ అంటే త్రిగుణాలను ఆధీనంలో వుంచుకోవడం అని అర్థం.  ఇది బతుకమ్మను పోలి వుంటుంది. బతుకమ్మను ఎలాగైతే నిమజ్జనం చేస్తారో అదేవిధంగా బంజారాలు కూడా గోధుమ మొలకలను పూజించి, నిమజ్జనం చేస్తారు.

సంప్రదాయం.. అత్యంత మడితో…

కట్టుబాట్లు, శుచి, శుభ్రతతో తొమ్మిది రోజుల పాటు ఈ తీజ్ పండుగను జరుపుకుంటారు. మంగళవారాన్ని అత్యంత పవిత్రంగా భావించి, అదే రోజు ప్రారంభిస్తారు.ఈ తొమ్మిది రోజుల పాటు యువతులు ఓ రకంగా  దీన్ని దీక్షగా స్వీకరించి పూజ చేస్తారు. వర్షాలు బాగా కురవాలని, గ్రామ ప్రజలు సుభిక్షంగా వుండాలని, పంట పొలాలు పచ్చగా వుండాలని, పశుసంపదంతా  కూడా ఆరోగ్యంగా వుండాలని కూడా కోరుకుంటారు. సతీమాత, డోక్రీ, డోక్రా పూజలు చేస్తారు. ఏ పూజా కార్యక్రమం చేసినా.. సేవాలాల్ మహారాజ్ కి  నైవేద్యం పెట్టడం ఓ సంప్రదాయం.  ఈ తొమ్మిది రోజులు మాత్రం సాత్విక ఆహారమే స్వీకరిస్తారు. ఇందులో ఉప్పు,కారాలు, ఉల్లి, వెల్లులి, చింతపండును కూడా వాడరు.ఫీక్ దాల్, ఘీ (చప్పటి పప్పు, నెయ్యి),జారేరి బాటి, భాజీ,(జొన్నరొట్టె, ఏదైనా ఆకుకూర), దహీర్ ధాన్, ఘోళయా (పెరుగన్నం, మజ్జిగ)తో భోజనం చేస్తారు. మాంసాహారం తినరు.

పండగ ప్రారంభ విధానమిలా..

మొదట తండా నాయకుడి ఇంట్లో గ్రామ పెద్దలంతా సమావేశమవుతారు. ఇందులో ముఖ్యాంశాలుగా ఎన్ని బుట్టలు కావాలో వివరాలు సేకరిస్తారు. ప్రతి ఇంటికో బుట్ట, దానితో పాటు విదేశాల్లో, ఇతర ప్రదేశాల్లో వున్న వారు రాలేని పరిస్థితుల్లో వుంటే వారి పేరు మీద కూడా ఈ బుట్టను తీసుకుంటారు.ఈ బుట్టని తీజేర్ ఓల్డీ (తీజ్ బుట్ట) అంటారు. తర్వాత ఘంఉగాళేరో (గోధుమలు నానబెట్టడం)వుంటుంది. దీనిని తండా నాయకుల ఇంట్లో గోధుమలు నానబెట్టడం చేస్తారు. దీని తర్వాత తీజ్ బోరాయేరో (పండగ ప్రారంభం) నుంచి పండగ ప్రారంభం అవుతుంది. తెల్లవారు ఝామున ‘‘మకోడార్ బమోయ్ ర్ ధూడ్ (పుట్టమట్టి)  సేకరించడానికి బయల్దేరుతారు.ఎవరూ తొక్కని స్థలం నుంచే దీనిని సేకరిస్తారు. ఆట, పాటలు,డప్పు వాయిద్యాలు, నృత్యాలతో తీసుకొస్తారు.  ఈ లోపే అన్నదమ్ములు ‘‘ఢాకళో’’ (మంచె) నిర్మిస్తారు. వీటికి వర్షం నుంచి రక్షణ కోసం కప్పు నిర్మిస్తారు. దీనిని వరిగడ్డి మరియు ‘‘ఢాకడా డ్వాళీ (మోదుగు కొమ్మలతో నిర్మిస్తారు. మంచె మీద ఈ బుట్టలను పేరుస్తారు. అందులో పుట్ట మట్టిని నింపుతారు.ఈ విధానం అంతా పాటలతోనే సాగుతుంది.  ఢావళో (పాటలు) పాడుకుంటూ తండా నాయకుడి ఇంటికి వెళ్లి, నానబెట్టిన గోధుమలను తీసుకొచ్చి, ఈ బుట్టల్లో చల్లుతారు. వాటితో పాటు రూపాయి నాణెన్ని కూడా బుట్టలో వేస్తారు. పుట్ట మట్టిని సేకరించి, బుట్టలో పోయడం అంటే పంటతో పాటు భూదేవిని కూడా పూజించినట్లు భావిస్తారు.

ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మాయిలు ఉదయం, సాయంత్రం గోధుమ బుట్టలపై నీళ్లు చల్లుతారు. ఏ పని చేసినా… పాటలు పాడుకుంటూనే చేస్తారు. రోజూ సాయంత్రం ఊరంతా కలిసి, ఆటపాటలు, నృత్యాలు చేస్తూ, తీజ్ ని జరుపుకుంటారు. తొమ్మిది రోజు ‘‘తీజ్ వెరాయరో’’ చేస్తారు. అంటే.. తీజ్ నిమజ్జనం అని అర్థం. ఈ సమయంలో అన్నాదమ్ములందర్నీ సంప్రదాయ దుస్తుల్లో (పగిడీ, రుమాలు) వరుసగా కూర్చొబెడతారు. అమ్మాయిలందరూ తొమ్మిది రోజుల పాటు ఏపుగా పెరిగిన గోధుమాల చిగుర్లు తెంచి, అన్నాదమ్ములకు, పెద్దవారికి ఇచ్చిపుచ్చుకుంటారు. అన్నాదమ్ముల రుమాలులో గోధుమాల చిగుర్లను వుంచుతారు. తర్వాత అన్నాదమ్ములు అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి పెద్దవారి ఆశీర్వాదాలను తీసుకుంటారు. ఈ మొలకలను గుమ్మిలో వేస్తారు.  ఆట పాటలతో నిమజ్జనానికి చెరువు దగ్గరికి బయల్దేరుతారు. ఈ నిమజ్జన సమయంలో అమ్మాయిలు నెత్తిమీద ‘‘ఫులీయా గోణోను’’(తలపాగా) ధరించి, ఈ బుట్టలను నెత్తిన పెట్టుకొని వెళ్తారు.   నానబెట్టిన శనగలను రేగిముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడిఝుష్కేరో పేరుతో పిలుస్తారు. పెండ్లికాని అమ్మాయిలు రేగిముళ్లకు శనగలు గుచ్చుతుంటే వారికి బావ వరుస అయినవారు ముళ్లను కదిలిస్తారు. అయినా అమ్మాయిలు సహనంతో శనగలను ముళ్లకు గుచ్చాల్సి ఉంటుంది. తీజ్‌ ఎంత ఏపుగా, పచ్చగా పెరిగితే తమకు నచ్చిన జీవితభాగస్వామి వస్తారని విశ్వసిస్తారు. దీని తర్వాతే ‘‘ఢమోలీ ఆట’’ (సంప్రదాయ ఆట) ను ఆడతారు.

నిమజ్జనం తర్వాత  సాతీ భవానీకి, (దుర్గాదేవి అంశ) మేరామదేవికి పూజలు చేస్తారు. వారితో పాటు సేవాలాల్ మహారాజ్ కి కూడా పూజలు చేస్తారు. ఆయనకి గుర్తుగా ఆవు పేడతో అలికి, దానిపై బియ్యంపిండి, లేదా జొన్నపిండితో చ్వాకో (స్వస్తిక్ గుర్తు) వేసి, మధ్యలో ఇత్తడి చెంబు పెట్టి, అందులో జొన్నలు పోసి, తెల్లటి జెండాను పెడతారు. ఈ జెండాను సేవాలాల్ మహారాజ్ కి గుర్తుగా భావిస్తారు.  తరువాత  కడావ్ వండి, (బెల్లం పాయసం)  చూర్మొ (బియ్యపు పిండి రొట్టె, బెల్లం కలిపిన ముద్ద) సిద్దం చేసుకొని, వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత  ప్రసాదంగా  స్వీకరిస్తారు.

కొంత మందికి ఈ తీజ్ పండుగ వుండదు. వారు మాత్రం ‘‘ఛూటో కడావ్’’ అని చేస్తారు. (సంప్రదాయం మొత్తం వుంటుంది కానీ.. తీజ్ పేర్చరు).  చివరగా మేకపోతును బలిచ్చి, అందరూ సమానంగా పంచుకుంటారు.

తండా నాయకుడి ఆధ్వర్యంలో జరిగే ఈ పండుగ నాయకత్వానికి, సామూహిక జీవనానికి, ఐక్యతకు, సమగ్ర నాయకత్వ లక్షణాలకు, ప్రకృతి మీద నమ్మకం, సంఘటిత శక్తికి, భూదేవి పట్ల గౌరవం, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాలు, పెద్ద వారిపట్ల గౌరవం కలిగిన ప్రత్యేకలతో కూడిన  పండగ.

  • డా. శారద జి. – ఎం.ఫిల్. పీహెచ్ డీ, 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *