ప్రపంచ పటంలో లేకుండా చేసేస్తాం : పాక్ కి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్… అతలా కుతలమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని స్పానర్స్ చేసే చర్యలను పాక్ మానుకోకుంటే ఆ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవడం మాత్రం ఖాయమని హెచ్చరించారు. భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ లో చూపించిన సంయమనాన్ని ప్రతిసారీ చూపించలేవని అన్నారు. ఈసారి నిర్ణయాత్మక, అత్యంత శక్తివంతమైన సమాధానం ఇస్తుందని చెప్పారు.
ప్రపంచ పటంలో పాక్ తన స్థానాన్ని నిలుపుకోవాలంటే ప్రాయోజిత ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని వెంటనే నిలిపేయాలని హెచ్చరికలు పంపారు. రాజస్థాన్‌లోని అనుప్‌గఢ్‌లోని ఒక ఆర్మీ పోస్ట్‌లో జనరల్ ద్వివేది మాట్లాడుతూ ‘‘ఈ సారి మాత్రం భారత భద్రతా దళాలు ఎలాంటి సంయమాన్ని పాటించవు. చూపించవు కూడా. ప్రపంచ పటంలో ఉండాలనుకుంటోందో, లేదో తేల్చుకునేలా ఈసారి పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఉంటుంది. ప్రపంచ పటంలో పాక్ ఉండదలిస్తే మాత్రం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం ఆపితీరాలి. లేదంటే ఆపరేషన్ సిందూర్ 2 వర్షన్ ఎంతో దూరంలో లేదు. భారత సైన్యం అంతా సిద్ధంగా వుండాలి. దేవుడు తలుచుకుంటూ అవకాశం దొరుకుతుంది. మీకు శుభాకాంక్షలు’’ అంటూ ఆర్మీ చీఫ్ ప్రకటించారు.