భారతీయ కాలగణన – విశిష్టత
మన కాలగణనలో మన్వంతరము ,యుగాలు, సంవత్సరాలు, అయనం , మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి. అందులో 14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహా యుగాలు, ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల మొత్తం. నాలుగు యుగాలు 1] కృతయుగము 2 ] త్రేతాయుగము 3] ద్వాపరయుగము 4] కలియుగం. ఒక యుగంలో నాలుగు పాదాలు ఉంటాయి. మనము ఇప్పుడు వైవస్వత మన్వంతరం లోని మహా యుగం లో చివరిదైన కలియుగంలో మొదటి పాదం లో ఉన్నాం. ఈ కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5127 సంవత్సరాలు పూర్తి అయ్యి ఈ ఉగాదితో 5128 లోప్రవేశిస్తున్నది.
మన కాలగణనలో సంవత్సరాల ఆవర్తం ఉన్నది. ఒక ఆవర్తము అంటే 60 సంవత్సరాలు. ఆ 60 సంవత్సరాల ఆవర్తంలో 39 వ సంవత్సరమైనా విశ్వావసు నామ సంవత్సరం పూర్తయి 40వ సంవత్సరమైన పరాభవ నామ సంవత్సరం లో ఈ ఉగాది తో ప్రవేశిస్తున్నాము. .
కలియుగం ఎప్పుడు ప్రారంభమైనది
ఈ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది?ద్వాపర యుగ అంతం లో జరిగిన మహాభారత సంగ్రామం తరువాత 36 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమైంది అని చెప్పటానికి ప్రమాణం ఏంటి? కలి శకం గ్రహ గమనాల ఆధారంగా చెప్పారు. కలియుగం ప్రారంభం రోజు ఆకాశం లో ఏడు గ్రహాలు మేష రాశి లో ఉన్నాయి ఆ ఏడుగ్రహాల లో 1] శని 2] గురువు 3] కుజుడు 4] సూర్యుడు 5] శుక్రుడు 6] బుధుడు 7] చంద్రుడు . ఇప్పటి సాధారణ శకం కు పూర్వం 3101 సంవత్సరం, ఫిబ్రవరి 20వ తేదీ, అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాల 30 సెకన్లకు ప్రారంభమైంది, అంటే 3101 +2026 =5127 సంవత్సరాలు పూర్తిఅయి 5128 వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. కలియుగం ప్రారంభమైన రోజు అర్ధరాత్రి శ్రీకృష్ణుని చే నిర్మాణం చేయబడిన ద్వారకా పట్నం సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుండి ద్వాపరయుగము అంతమై , కలియుగం ప్రారంభమైంది. అందుకే మన కాలగణన ఎంతో శాస్త్రీయమైనది.
దేశ చరిత్ర లోని కొన్ని తిరుగులేని విజయాలే శకాలు
దేశ చరిత్ర లోని కొన్ని తిరుగులేని విజయాలను మనవాళ్ళు శకాలుగా వర్ణించారు.అవి చాల ఉన్నాయి , అందులో ప్రసిద్ధమైనవి 1] యుధిష్ఠిర శకము 2] విక్రమార్క శకము 3]శాలివాహన శకము. ద్వాపర యుగ అంతం లో యుధిష్ఠిర శకము ప్రారంభమైతే కలియుగంలో విక్రమార్క శకము , శాలివాహన శకములను గుర్తించారు . భారతదేశానికి ఉత్తర భాగంలో విశేషంగా విక్రమార్క శకం ప్రాచుర్యంలోఉంటే దక్షిణాపథం లో శాలివాహన శకము విశేషం గ వాడుకలో ఉన్నది. ఈ దేశ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనలో ధర్మ నిష్ఠ , పౌరుష పరాక్రమాలు , పెంపొందించుకోవడం ప్రధాన లక్ష్యం గా ఆ చరిత్రలను మననం చేసుకుంటాము. ఆ శకల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
.
యుధిష్ఠిర శకం
ద్వాపర యుగం అంతం లో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ధర్మరాజు సమ్రాట్ గా పట్టాభిషేకం జరిగిన రోజు నుండి యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. అది కలియుగానికి పూర్వం 36 సంవత్సరం లో అంటే ఇప్పటికి [ 5126+36=5162]5162సంవత్సరాలు పూర్తి అయి 5163 వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. యుధిష్టర శకం మనకిచ్చే సందేశం ఏమిటి ? ఎప్పుడైనా అంతిమ విజయం ధర్మానిదే , మహాభారత సంగ్రామం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం , అది ధర్మం జయించిన వేళ.
విక్రమార్క శకం
విక్రమార్క శకం కలియుగంలో 3044 సంవత్సరంలో ప్రారంభమైంది ,అంటే 5126 -3044=2082. 2082 సంవత్సరాలు పూర్తి 2083 లో ప్రవేశిస్తున్నది దానిని బట్టి సాధారణ శకం కి పూర్వం 57లోవిక్రమార్క శకం ప్రారంభమైంది, ఆ లెక్క ప్రకారం 2026 +57=2083 2082పూర్తి అయి 2083 లో ప్రవేశిస్తున్నది. 2082 సంవత్సరాల పూర్వం ఉన్న విక్రమార్కుని కాలం లో భారతదేశం మీద శకులు దండయాత్రలు జరుగుతుండేవి, చిన్న వయసులోనే విక్రమార్కుడు ఆ దాడులను తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభం చేశాడు. ఐదు సంవత్సరాల వయస్సు లో విక్రమార్కుడు అరణ్యంలోకి వెళ్లి 12 సంవత్సరాల పాటు సుదీర్ఘ సాధన చేసే అద్భుత శక్తులు సంపాదించాడు. అతను మాళవ ప్రాంతంలోని ఉజ్జయని ని రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు, ఉజ్జయిని మహాకాలుని దేవాలయం ఉన్నది అది జ్యోతిర్లింగాల లో ఒకటి. విక్రమాదిత్యుడు శకులు , హుణులను జయించటానికి భయంకరమైన యుద్ధాలు చేశాడు.
శాలివాహన శకం
శాలివాహన శకం ఇది కలియుగంలో 3179 లో ప్రారంభమైంది. అంటే [5126 -3179=1947] ఇప్పడు 1947సంవత్సరాలు పూర్తి అయ్యి 1948 లో ప్రవేశించింది. సాధారణ శకం లెక్కప్రకారంచూద్దాము , సాధారణశకం 78 లో శాలివాహన శకం ప్రారంభమైనది, అంటే [2026 -78=1948 ] 1948 లో ప్రవేశిస్తుంది. శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనవడు. శాలివాహనుడు శకులను ,చీనులను ,తా ర్తారులను ,బాహ్లికులను , కామరూపాదేశీయులగు కిరాతాది మ్లేచ్చులను రోమనులను, శట్లైన ఖోరాసదేశస్తులను జయించి వారుదోచుకొనిపోయిన ధనరాశులను తిరిగి స్వాధీనం చేసుకొని వారిని దండించాడు.సింధునది కి తూర్పునగల భారత దేశమును ఆర్యస్థానమని సింధునదికి పశ్చిమాన గల దేశమును మ్లేచ్ఛ దేశమని హద్దులు ఏర్పరచి దిగ్విజయంగా విజయం సాధించిన వేళానుండి శాలివాహన శకం ప్రారంభమైనది. శాలివాహన శకం విక్రమశకం తరువాత 135 సంవత్సరాలకు ప్రారంభమైనది. శాలివాహనుడు ఈ దేశం లో మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుని ఒకే ఛత్రం కింద ఈ దేశాన్ని పాలించినవాడు. ఈ విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన కాలంలో ఈ దేశంపై దాడి చేసిన విదేశీయులను సంపూర్ణంగా నాశనం చేసి భారతదేశాన్ని శక్తివంతం చేశాడు.
ఇటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకునేందుకు యుధిష్టర , విక్రమార్క , శాలివాహన శకలు ఏర్పడ్డాయి. అవి ఇప్పుడు మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే 1000 సంవత్సరాలు భావ దాస్యాన్ని వదిలించుకుని హిందుత్వ జాగరణతో జాతీయ పునరుజ్జీవనం తో స్వాభిమానంతో ఈ దేశం ప్రపంచంలో నిలబడి, ప్రపంచానికి శాంతిబాటలు వేసే మరో కొత్త శకం ప్రారంభించు కోవాలని పిలుపు నిస్తున్నది . ఈపరాభవ నామ సంవత్సరం అందరికీ అటువంటి ప్రేరణ ఇవ్వాలని కోరుకొంటూ అందరికి ఉగాది శుభాకాంక్షలు.