ధార్మిక జీవన సర్వస్వం – గురుపౌర్ణిమ

                                                                                                                                                                  -ఖండవల్లి ఆదిత్య భరద్వాజ

ప్రపంచంలోని జీవరాసులలో ముఖ్యంగా రెండు జాతులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి అవి పశువులు, మనుష్యులు. వీటిలో కూడా సారూప్యతలు(ఆహారం,నిద్ర,భయం,మైథునం) ఉండగా ఒకే ఒక్క విషయం భేదాన్ని సూచిస్తుంది,అదే ధర్మం. ధర్మ హీనుడైన మనిషి పశువౌతాడు.

||ఆహార నిద్రా భయం మైథునంచ మనుష్యయేభిర్ పశుభిః సమానాః
ధర్మొహి ఏకొ అధికా విశేషో ధర్మస్య హీనః పశుభిః సమానాః ||

ప్రతి జీవి యొక్క ప్రయత్నం మోక్షం,అనగా బ్రహ్మానందం, అలౌకికమైన పునర్జన్మ రహిత స్థితి. అందుకోసం ఏర్పరిచిన మార్గం పురుషార్ధ(ధర్మ,అర్ధ,కామ,మోక్ష) సాధన. ధారాయతే ఇతి ధర్మః అని వాక్యం అనగా ఏదైతే నిలబెట్టేదో అదే ధర్మము అని. ప్రతి మనిషి తన వ్యక్తిగత,సామాజిక,కౌటుంబిక,వ్యాపార జీవనంలో యుక్తాయుక్త విచక్షణ కలిగి, పాప భీతితో, ధర్మబద్ధమైన జీవనాన్ని సాగించాలి. అర్థ సంపాదన అంటే జీవనాన్ని సాగించడానికి అవసరమయ్యే వనరులను ఉదా,డబ్బు,శక్తి, ఆలోచనలు లాంటివి ధర్మ బద్ధంగా సంపాదించాలి తప్ప స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా అడ్డ దారులు తొక్కి కాదు. అలాగే లౌకికమైన కోరికలను కూడా సరియైన మార్గంలో తీర్చుకోవాలి. ఈ మూడూ జీవితంలో జరిగినప్పుడు ఆనందం లభిస్తుంది అదే తృప్తి, అలౌకికానందం. ఈ మార్గంలో వ్యక్తి ప్రయాణించేందుకు అవసరమైన సాధనం జ్ఞానం. ధర్మాధర్మ విచక్షణ,యోచన జ్ఞానం ద్వారానే సాధ్యం. ఆ జ్ఞాన సముపార్జనకు మూలం శ్రద్ధ. కనుక శ్రద్ధ అనే సంస్కారంతో పాటు జ్ఞాన సముపార్జనకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పరిచేది సంస్కృతి. ఆ సంస్కృతి హిందువుల ప్రత్యేకత.

 

ఆ సంస్కృతిలో భాగంగానే ఇక్కడి సమాజం ఆశ్రమ వ్యవస్థని ,గురు పరంపరను ఏర్పాటు చేసింది. జీవితంలో విషయాన్ని తెలుసుకోవలసిన స్థితిలో శ్రద్ధతో తెలుసుకోవడం అనేది బ్రహ్మచర్యంలో గురువు వద్ద జరుగుతుంది. గురువు, వ్యక్తి తాలూకు దోషాలను తొలగిస్తూ అతనికి, సమాజానికి అవసరమైన సంస్కారాలను అందిస్తాడు. తద్వారా ఆ వ్యక్తి సమాజంలో ఆదర్శ జీవనాన్ని గడిపేందుకు సాధనమవుతాడు. అలాగ మన దేశంలో సత్య హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు వంటి ఆదర్శ జీవితాలు కనిపిస్తాయి. వాటి వెనుక వారి గురువులైన వశిష్ఠుడు, సాందీపని అందించిన గుణాలు ఉన్నాయి. అలాగే జ్ఞానానికి మరో పేరు శ్రుతం అనగా వేదం నుండి వచ్చినది అని. వేదాన్ని కాలానుగుణంగా సమాజ స్థితి ప్రకారం నాలుగు భాగాలు చేసినవాడు కృష్ణద్వైపాయణుడు. ఆయన ఈ మహాయుగం లో వ్యాసుడు. వ్యాస అనేది ఒక పీఠం ప్రతి మహాయుగానికి ఒకరు ఆ పీఠాన్ని అధిష్ఠిస్తారు. ఈ మహాయుగంలో కృష్ణద్వైపాయణుడు వ్యాసుడు. ఆ వ్యాసుడు పుట్టినరోజు కనుక ఆషాఢ శుద్ధ పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ అయింది. వేదాన్ని విభజించి జ్ఞాన పథాన్ని అందించి గురు పరంపరను ముందుకు తీసుకువెళ్లాడు కనుక అది గురుపౌర్ణిమగా జరపడం ఆనవాయితీ.
||సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందేగురుపరంపరాం ||

||లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరామ్||

గురుపరంపరలో మొట్టమొదటి వాడు పరమశివుడు, ఆయన జ్ఞాన రూపమే దక్షిణామూర్తి. అలాగే శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు. అక్కడ నుంచి వ్యాసుడు నాథ మునులు. ఆ తరువాత సంప్రదాయానుగుణంగా ఆదిశంకర,మాధవ,రామనుజ ఆచార్యుల నుండి పరంపరగా కొనసాగుతోంది. జీవితంలో మనిషికి అవసరమైన దృష్టి కోణాన్ని ద్వైత,అద్వైత, విశిష్టాద్వైత సాంప్రదాయాలు ఇస్తాయి. అవి పరస్పర భిన్నాలుగా కనిపించినా వేదాన్ని ఆధారం చేసుకున్నవి గనుక ధర్మాన్ని మాత్రమే చెప్తాయి. ప్రస్థాన త్రయములు(భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు) వేద ఆచరణ విధానములు కనుక వాటి భాష్యం ద్వారా ఆలోచనను అందిస్తాయి. వాటి పద్ధతిలో పరుషార్ధ సాధన, సత్కర్మాచారణను అందించడం వీటి లక్ష్యం. ఎందుకంటే ఎవరైతే తెలియనిది తెలియజేస్తారో, అంధకారాన్ని తొలగించి దీపాన్ని అందిస్తారో వారే గురువు అని వాక్యం. (గుహ్యాత్ అంధకారాత్ తన్నిరోధ కస్య ఇతి గురుః, ఆసతోమా సద్గమయ)

అటువంటి గురుపరంపర మనకు హిందూ సంస్కృతిలో ఈ సంప్రదాయాలలో కనిపిస్తుంది. ఈ పరంపరలో వచ్చిన గురువులు తమ బాధ్యతను అత్యంత శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తూ వచ్చారు. సమాజానికి ఎటువంటి అవసరం వచ్చినా తమవంతు కృషి చేశారు. అవైదిక సిద్ధాంతాలు ప్రబలి ప్రజలలో వేదం పట్ల శ్రద్ధ తగ్గినప్పుడు ఆది శంకరులు తన జీవితం మొత్తాన్ని వేదోద్ధరణకు సమర్పించారు. సమాజంలో వేద వ్యాప్తి తగ్గినప్పుడు రామానుజులు తన జీవితాన్ని ఆ లక్ష్యానికి ఇచ్చారు. అలాగే మొగలాయి వంటి మ్లేచ్ఛ జాతులు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు చాణక్యుడు,విద్యారణ్యులు,సమర్థ రామదాస స్వామి వంటి వారు సమాజ పునరుత్థానం కోసం ప్రయత్నించారు, మగధ,విజయనగర, మరాఠా వంటి సామ్రాజ్యాల స్థాపన గావించారు. కనుక గురువులు ఈ దేశంలో అన్నీ ధర్మోద్ధరణ లక్ష్యంగా చేశారు. అందుకనే ప్రాతః స్మరణీయులు అయ్యారు. సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

 

అటువంటి పరంపరను స్మరించుకునే రోజు గురుపౌర్ణిమ. స్మరణ ద్వారా సాధనకు ఉపక్రమించేందుకు అవసరమైన ఆలోచనను సుదృఢం చేసుకునే అవకాశం ఇది. అందుకోసం జీవితంలో తను మన ధన పూర్వకమైన సమర్పణా భావన్ని కలిగి మెలగడం అత్యావశ్యకం. ఈ పరంపర ఆ సమర్పణా భావం ఆధారంగానే ఎదిగింది ఈనాటికీ నిలిచి ఉంది. ఆ గురు పరంపరకు సమాజంలో అధిక సందర్భాలలో గుర్తు గా కనిపించేది భగవాధ్వజం. ఎందుకటే కాషాయం త్యాగానికి, సమర్పణకి ప్రతీక. ప్రకృతి లోసూర్యోదయ,సూర్యాస్తమయాల్లో కనిపించేది ఇదే రంగు. సన్యాసాశ్రమంలో ఉండేవారు ధరించేదీ ఇదే రంగు. కనుక ఆ కాషాయ ధ్వజం ఒక తత్వానికి ప్రతీకగా సమాజంలో నిలిచి ఉంది. వ్యక్తి యొక్క లౌకిక జీవనంలో సమర్పణ, ధర్మాచారణను ఇది గుర్తు చేస్తుంది. కనుక ధర్మమే మూలమైన విలువగా జీవనాన్ని కొనసాగిస్తూ అందుకు అవసరమైన సంస్కారాలను సంస్కృతిలో భాగమైన గురు పరంపర నుండి పొంది, వినయ,శక్తి సంపన్నులమై దేశ ధర్మ రక్షణ పట్ల బాధ్యతనెరిగి జ్ఞాన సముపార్జన ద్వారా ఆనంద ప్రాప్తిని కలిగి ఉండాలని,అందుకు అవసరమైన అన్నింటిని మనకు ప్రథమ గురువైన పరమేశ్వరుడు ప్రసాదించాలని ఈ గురు పౌర్ణమి నాడు ప్రార్ధిద్దాం, తదనుగుణ ఆచరణ చేద్దాం. గురుపౌర్ణిమ శుభాకాంక్షలు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *