ఇక మహిళలే ‘‘డ్రోన్ పైలెట్లు’’.. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకమిదీ…
మహిళలకు ఒక్కొక్కరికి 8 లక్షల లబ్ధి చేకూరేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ పథకం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ‘‘నమో డ్రోన్ దీదీ’’ పథకం. ఈ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన 300 మంది మహిళా స్వయంసహాయక బృందాలకు ఈ సంవత్సరం డ్రోన్లను కేంద్రం ఇవ్వనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 14500 స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందజేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ జరిగాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ డ్రోన్ల సరఫరా ద్వారా వ్యవసాయ రంగంలో మహిళ ప్రాధాన్యత మరింత పెరిగింది. వారే ఇప్పుడు డ్రోన్ పైలెట్లుగా మారిపోతున్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) ఈ పథకం ద్వారా డ్రోన్‌లు, శిక్షణ, వాటిని ఆపరేట్ చేయడానికి అవసరమైన లైసెన్స్‌లను అందిస్తుంది. ఇది వారిని నైపుణ్యం కలిగిన డ్రోన్ వ్యవస్థాపకులుగా మారుస్తుంది.
2024-25 నుంచి 2025-26 వరకు దాదాపు 15 వేల డ్వాక్రా మహిళలకు డ్రోన్‌లను అందించడం, వ్యవసాయ అవసరాల కోసం రైతులకు అద్దె సేవలను అందించడం ఈ పథకం లక్ష్యం. మహిళా స్వయం సహాయక సంఘాలు డ్రోన్ ధరలో 80 శాతం సబ్సిడీ(అంటే రూ. 8 లక్షల వరకు) పొందొచ్చు. అంటే ఈ డబ్బు చెల్లింయవల్సిన అవసరం లేదు. మిగిలిన 20 శాతం నేషనల్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (AIF) వంటి సంస్థల నుంచి అతి తక్కువ 3 శాతం వడ్డీతో రుణాల ద్వారా పొందొచ్చు.
ఈ మహిళా డ్రోన్ పైలట్లను ‘డ్రోన్ దీదీలు’ అని అంటారు. వీరు పురుగుమందులు, ఎరువులు చల్లడం, పంటల పర్యవేక్షణ, రైతులకు ఏరియల్ సర్వేలు వంటి కీలకమైన సేవలను అందిస్తారు. వ్యవసాయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల వ్యవసాయంలో ఉత్పత్తి పెంచడం, ఖర్చులను తగ్గించడం, అంతిమంగా పంట దిగుబడిని పెంచడం జరుగుతుంది. తద్వారా మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారుతారు. పీక్ సీజన్‌లలో రోజుకు రూ. 5 వేల వరకు సంపాదించవచ్చు. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళ వార్షిక ఆదాయం రూ. 1 లక్ష వరకు పెరుగడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించారు.
నమో డ్రోన్ దీదీ స్కీమ్‌లోని మరో విశేషం ఏమంటే.. రిమోట్, యాక్సెస్ చేయలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్ డెలివరీని చేసే సామర్థ్యం ఉంటుంది. పర్వత ప్రాంతాలు, మైదానాలు, మారుమూల గ్రామాలకు కూడా డ్రోన్ సర్వీసులు అందిస్తాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ 2023 అధ్యయనం ప్రకారం నీటిపారుదల సదుపాయం ఉన్న భూములలో ప్రతి హెక్టారు ప్రాతిపదికన పంట ఇన్‌పుట్‌ల సామర్థ్యాన్ని 40 శాతం వరకు డ్రోన్‌ల వినియోగం ద్వారా పెంచవచ్చని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ఏ కొంతమంది మహిళలకు డ్రోన్‌లను అందజేయడం మాత్రమే కాదు.. ఇంటర్నెట్ కనెక్టివిటీకి కూడా ఇవి ఉపయోగపడతాయి. మహిళలకు పైలట్‌లుగా శిక్షణ ఇవ్వడం మొత్తం పథకంలో ఒక భాగం మాత్రమే. నిర్వహణ,అప్లికేషన్లలో వారికి శిక్షణ ఇవ్వడానికి 15-రోజుల సమగ్ర శిక్షణ ఇస్తారు. ఇందులో 5 రోజులు డ్రోన్ పైలట్ శిక్షణ, మిగిలిన 10 రోజులు డ్రోన్ సాంకేతికత, వ్యవసాయ అనువర్తనాలపై శిక్షణ అందిస్తారు.