వనవాసుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర
వనవాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర. ఈ జాతరను వారు ఘనంగా జరుపుకుంటారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా నాగోబా జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం నాగోబా జాతర మంగళవారం రాత్రి నుంచి ప్రారంభం అవుతుంది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు.
ఏటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మహా పూజలతో మెస్రం వంశస్థులు ఈ జాతరను ప్రారంభిస్తారు. అంతకు పూర్వం గోదావరి నదితో పాటు ఏడు నదుల జలాల్ని తీసుకొస్తారు. వాటితో సహా అక్కడే వుండే వుంటారు. అమావాస్య కి ఒక రోజు ముందు ఆ నీటితో సహా… వార్ని ఎదుర్కొంటారు. అర్ధరాత్రి మహా పూజలతో మెస్రం వంశస్థులు ఈ జాతరను ప్రారంభిస్తారు. నాగోబా మహా పూజలకు నెలవంకతో శ్రీకారం చుడతారు. నాగోబా మహా పూజలకు అవసరమయ్యే పవిత్ర జలాల కోసం పాదయాత్రగా వెళ్లారు. జిన్నారం మండలం కలమడుగు గోదావరిలోని పవిత్ర గంగాజలాన్ని సేకరించారు.
మహా పూజలకు నాలుగు రోజుల ముందు ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్టు వద్దకు చేరుకుంటరు. నాగోబా దేవుడికి మండగాజిలతో పూజలు చేస్తారు. గ్రామ పొలిమేరల్లో వుండే మర్రి చెట్టుపై వుంచుతారు. నేలజారి పడకుండా పూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తాడు. శ్యాంపూర్ లో బుడుందేవ్ కి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడే జాతరను ప్రారంభిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈరోజు రాత్రి ప్రారంభమయ్యే ఈ జాతర ఫిబ్రవరి 4 వరకు జరుగుతుంది.
అమావాస్య రోజున పవిత్ర గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. నాగోబాకి జలాభిషేకంతో పూజలను ప్రారంభిస్తారు. ఈ పూజలకు మాత్రం ఇతరులకు ప్రవేశం వుండదు. అధికారులు, ఇతర ప్రముఖులకే ప్రవేశం. నాగోబా మహాపూజ అనంతరం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మెస్రం వంశములో ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని కోడళ్లను కుటుంబ సభ్యులు వంశ పెద్దలకు పరిచయం చేస్తారు. వారి ఆశీస్సులు పొందుతారు. దీనిని మెస్రం వారు ‘‘భేటింగ్ అని పిలుచుకుంటారు. అలాగే మెస్రం వంశీయులు ప్రత్యేకంగా 22 కితాలుగా (వర్గాలుగా) పొయ్యిలు పెట్టుకొని, వంటలు చేసుకుంటారు. వీటితోనే నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం సహపంక్తి భోజనాలు వుంటాయి. అయితే ఈ పొయ్యిలను ఎక్కడపడితే అక్కడ పెట్టరు. ఆలయ ప్రాంగణంలోని గోడ లోపల వెలిగే దీపాల వెలుగుల్లో మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తారు. వంట పాత్రలు, వాటి మీద కప్పడానికి మూతలను సిరికొండలోని గుగ్గిల్ల వంశస్థులు తయారు చేస్తారు.
నాగోబా పూజ అనంతరం రెండో రోజు ఆలయం వెనుక వున్న పెర్సాపేన్ దేవతకు పూజలు చేస్తారు. ఈ పూజను కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. భాన్ దేవతకు పూజలు… మూడో రోజున భేటింగ్ లో పాల్గొన్న మెస్రం కోడళ్లు మర్రిచెట్టు వద్ద వున్న కోనేరు నుంచి మట్టి కుండల్లో తెచ్చిన నీటితో భాన్ దేవతకు సమర్పిస్తారు.
31 న అధికారిక ప్రజా దర్బార్
నాగోబా ప్రజా దర్బార్ అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ దర్బారుకు దాదాపు 79 వసంతాలు నిండుతోంది. 1940 లో కెరిమెరి జోడేఘాట్ లో కుమురం భీం నిజాం సైనిక తూటాలకు బలయ్యారు. ఆ తరువాత హైమాన్ డార్ఫ్ అనే శాస్త్రవేత్త 1946 నుంచి ఈ దర్బారును ప్రారంభించారు. ఈ దర్బార్ వేదికలో ఆదివాసుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అప్పటి నుంచి ఈ దర్బార్ కొనసాగుతోంది.
బేతల్ పూజలు, నృత్యాలు
నాగోబా జాతర చివరి ఘట్టం ఇది. దర్బార్ పూర్తైన తర్వాత మెస్రం వంశీయులు గోవాడ్ పక్కనే బేతల్ (కర్రసాము) ఆట, నృత్యాలతో ముగింపు పలుకుతారు.