‘‘సమ్యక్ క్రాంత దర్శనమే సంక్రాంతి’’
– సాగి కమలాకర శర్మ – తెలుగు శాఖాధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం
‘‘తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరిత:
సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశ: సంక్రాంతి:’’ (జయసింహ కల్పద్రుమం)
సూర్యుడు మేషాది రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది. క్రాంతి, క్రమణము అనే శబ్దాలకు తిరుగుట, మార్పు అని అర్థం. మంచి మార్పు, సరియైన విధంగా తిరగడం అనే అర్థాలలో సంక్రాంతి, సంక్రమణం అనే శబ్దాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు ప్రతి మాసం ఒక్కో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటాం. నిరయన పద్ధతి ప్రకారం సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం మకర సంక్రమణం అవుతుంది. ఈ సమయం ఖగోళపరమైన ఒక ప్రత్యేకతను పొంది వున్నందున ఈ ప్రత్యేక దినాన్ని పండగగా ఆచరించడం జరుగుతుంది. మన పండగలకు అన్నింటికీ ఖగోళమే మూలాధారం. ఆ ఖగోళాన్ని అనుసరించిన ప్రకృతి మనకు సంతోషాన్నిస్తే అది పండుగ. మానసిక, భౌతిక ఒత్తిడులకు గురి చేసే ఆ రోజున వ్రతాదులు నియమబద్ధంగా నిర్వర్తించాల్సి వుంటుంది.
ఉత్తమ కాలం – ఉత్తరాయణ కాలం :
సౌర కుటుంబంలో సూర్యుడు ఒక నక్షత్రం.భూమి ఒక గ్రహం. భూమి ఆత్మ భ్రమణ చేస్తూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడు మాత్రం స్థిరంగా వుంటాడు. కాని మనమంతా భూగ్రహంపై వున్న కారణంగా మనం స్థిరంగా వున్నట్లు, మిగిలిన ఖగోళ పదార్థాలన్నీ తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఆ విధంగా సూర్యుడు వేరు వేరు రాశులలో సంచరిస్తున్నట్లు మనకు కనిపిస్తుంటాడు. ద్వాదశ రాశుల్లో ప్రతి సంవత్సరం ఒకసారి సంచరించినప్పటికీ నాలుగు రాశుల్లో సంచారం మాత్రం మరింత విశిష్టమైనదిగా గుర్తింపబడింది. అవి మేష, కర్కాటక, తుల, మకర సంక్రమాలు. మేష, తుల సంక్రమణాలు మనకు విషువత్తులు (రాత్రి పగళ్లు సమానమైన రోజులు) కాగా, కర్కాటక సంక్రమణం సూర్యుని దక్షిణ అయనం (గమనం), మకర సంక్రమణం సూర్యుని ఉత్తర అయనం (గమనం) అవుతాయి. సూర్యుని దక్షిణ గమన సమయంలో భూ వాతావరణమంతా చల్లబడిపోయి, వర్షాలు కురిసి, పంటలకు అనువైన కాలమైనప్పటికీ సూక్ష్మజీవులు పెరిగి ప్రకృతి కొంత అస్తవ్యస్తంగా వుంటుంది.
ఆ సమయంలో సూక్ష్మజీవులు పెరిగి ప్రకృతి కొంత అస్తవ్యస్తంగా వుంటుంది. ఆ సమయంలో వ్యక్తులు తమను తాము ప్రకృతి ప్రభావాల నుంచి బాగా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే అనేక రకాల పూజలు, హోమలు, వ్రతాలు నిర్వహించే సమయంగా ఈ కాలం మనకు కనిపిస్తుంది. కానీ మకర సంక్రమణ కాలం నుంచి క్రమంగా సూర్యుడు భూమి మీద వుండే వారికి దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ సమయంలో భూమి పైన సానుకూల వాతావరణం ఏర్పడటం, భూమి ఎండిపోవడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ సమయంలో అనేక రకాల శుభకార్యాలు, పండగలు నిర్వహించుకోవడానికి అత్యంత అనువైన సమయం. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించిన నాడే నిర్వహించుకునే సూర్య సంబంధమైన ఉత్సవం ‘‘సంక్రాంతి’’.
సూర్యుని ఉత్తరాయణ రథాన్ని స్వాగతించే సంక్రాంతి :
‘‘సప్తలోక ప్రకాశాయ సప్త సప్తి ధరాయచ
సప్త ద్వీప ప్రకాశాయ భాస్కరాయ నమో నమ:’’
‘‘అయ గమనే’’ అనే ధాతువు ప్రకారం అయనం అంటే గమనం అని అర్థం. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు సంచరించే విధానానికి ‘‘ఉత్తరాయణం’’ అని పేరు. నిజానికి సూర్యుని గమనం అనే పదం సరైంది కాదు. భూమి సూర్యుని చుట్టూ సంచరిస్తూ వుండడం నిజం. కానీ భూమి మీద వున్న మనకు స్పష్టంగా తెలియదు. మన చుట్టూ వున్నవే తిరుగుతున్నాయని అనుకుంటాం. ఇదే భ్రమ. అదే భ్రమణం. అటువంటి నక్షత్ర చక్రానికే ‘‘భ్రాంతి చక్రం’’ అని కూడా పేరు వుంది. భూమి మీద వుండే వారికి సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు మార్పు చెందుతున్నట్లుగా కనిపించే సందర్భమే ‘‘ఉత్తరాయణ పుణ్యకాలం’’.
క్రాంతి అంటే మార్పు. మంచి మార్పుకు సంక్రాంతి అని అర్థం.ప్రతి నెల సూర్యుడు వేరు వేరు రాశులలో సంచరించే సందర్భంలో సంక్రమణం అనే పదాన్నే వినియోగిస్తున్నాం. పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు నాలుగు ప్రత్యేక రాశుల్లో సంచరించే సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వాటిని మాత్రం ప్రత్యేకంగా అనుసరిస్తున్నాం. ధ్రువ ప్రాంతాలలో వుండే వారికి ఉత్తర సంక్రమణ సమయం నుంచి సూర్యుని కిరణాల ప్రసారం మొదలవుతుంది. ఆరు నెలల కాలం తర్వాత వారికి దక్షిణాయన ప్రారంభం నుంచి చీకటి మొదలై ఆరు నెలల చీకటి కాలం ఉంటుంది. మన ప్రాంతాల్లో కూడా సూర్యుని కిరణాలు సూర్యుడు దక్షిణం వైపు వున్నప్పుడు భూమిపై అంతగా సూక్ష్మజీవి నాశకంగా వుండవు. అదే ఉత్తరం వైపుకు వెళ్తున్నప్పుడు అవే కిరణాలు సూక్ష్మజీవి నాశకాలు అవుతాయి. అందుకే దక్షిణాయన సంక్రమణం అంతా మనకు రోగకారకం అవుతుంటే, ఉత్తరాయణ సంక్రమణ కిరణాలు అన్నీ ఆనంద కారకాలు అవుతున్నాయి. ఈ ఆనంద కారకమైన మార్పుకు శ్రీకారం చుట్టే మకర సంక్రమణ దినాన్ని మనం ‘‘సంక్రాంతి’’ ఉత్సవంగా జరుపుకుంటున్నాం.
మూడు రోజుల ముచ్చటైన పండగ :
ఆనంద ప్రద సూర్యకిరణ మార్గ సంక్రాంతి మూడు రోజుల ముఖ్యమైన పండగగా జరుపుకోవడం తెలుగువారి సంప్రదాయం. పండుగ ముందరి రోజున ఎప్పుడైనా మనం ‘‘భోగి’’ శబ్దంగా వాడటం వుంటుంది. భోగభాగ్యాలను కలిగించే విధానమే ‘‘భోగి’’ పండగ విశేషం. అంతకు ముందు ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి మకరం వరకు ఒక ఆధ్యాత్మిక వాతావరణం వుండాలని భారతీయ ధర్మశాస్త్ం సూచిస్తుంది. సూర్యుడు మిథునంలో సంచరించే కాలంలో ప్రకృతిలో మైథున భావాలు సన్నగిల్లుతాయని, ధనుస్సులో సంచరించే కాలంలో మన్మథ భావాలు సన్నగిల్లుతాయని తెలియజేడం జరిగింది. అందుకే సౌరమానాలైన మిథున, ధనుర్మాసాలకు అనుగుణమైన చాంద్రమాసాలు ఆషాఢ, పుష్య మాసాలను శూన్యమాసాలుగా నిర్ణయించారు. ఈ సమయంలో వైవాహిక అనుబంధాలకు దూరంగా, దైవిక కార్యక్రమాలకు చేరువగా వ్యక్తులు వుండాలని ధర్మశాస్త్రకారులు నిర్ణయించడం జరిగింది. ధనుస్సు మాసాంతం, మకర ప్రారంభానికి సంకేతంగా ‘‘భోగి’’ పండుగ మన జరుపుకుంటున్నాం.
‘‘సంక్రాంతికి చలి చంకలెత్తనీయదు’’ అని సామెత. చలి కాలం కావడం వల్ల భోగి మంటలు వేసుకుంటాం. మనలోని అనవసరమైన కామభావనలన్నీ ఈ కాలంలో పెరగకుండా మండించే విధానమే ఈ భోగి మంటలు.భోగి పండుగ నాడు పిల్లలకు ఆశీ: పూర్వకంగా భోగిపండ్లు పోయడమూ మన సంప్రదాయమే. గోదా శ్రీరంగనాథుల కల్యాణమూ ఈ రోజున మనకు కనిపించే ప్రత్యేకతనే. అటు దైవికంగా, ఇటు లోకపరంగా భోగి పండగ మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది.
సూర్యుడు నిరయన మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం. నిజానికి అయన రహితమైన సాయన మకర రాశి ప్రవేశం ఇంతకు ముందే డిసెంబర్ 22 వ తేదీన జరుగుతుంది. కానీ పర్వదినాలన్నీ నిరయనానికి సంబంధించి వుండటం వల్ల మనం నిరయన సంక్రాంతి నాడు మాత్రమే ఈ పర్వాన్ని నిర్వహిస్తున్నాం. సూర్యునికి సంబంధించిన విశేషమైన నమస్కారాలు, పూజలు ఈ రోజు ప్రత్యేకత. హాయిగా బంధుమిత్రులతో కలిసి జరుగబోయే శుభానికి స్వాగతం పలికే ఆహ్వానంగా సంక్రాంతి పండుగ నిర్వహించబడుతుంది. రాబోయే ఆరు నెలల కాలంలో శారీరిక మానసిక ఉద్దీపనలతో, ఉత్తేజంతో అనేక శుభ కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఆనందమయంగా గడపడానికి శ్రీకారమే ఈ సంక్రాంతి.
మానవ జీవనమంతా ప్రకృతికి, పశుపక్ష్యాదులకు, సమాజానికి నిరంతరం ఉపకరిస్తూనే వుండాలి. ఈ మూడింటితో కలిసి నిరంతరం మనకు వ్యవసాయ జీవనంలో వినియోగడే పశువులకు ధన్యవాదాలను చెప్పుకోవడం, వాటిని సంతృప్తి పరచడం కూడా మానవ జీవన ధర్మమే కదా. అందుకే సంక్రాంతి తెల్లవారి కనుమ పండగ నాడు పశువులకు చేసే పూజలు కూడా ఈ రకమైనవే. వాటికి ఆనందం కలిగించే వ్యవహారాలన్నీ ఈ రోజున నిర్వహించడం మనకు సంప్రదాయంగా వస్తుంది. ముక్కనుమ అని కనుమ తరువాతి రోజును కూడా నిర్వహించడం కొన్ని ప్రాంతాలలో వుంది.
సంక్రాంతి – నువ్వుల విశేషం :
మనకు తిలలు (నువ్వులు) శరీరానికి బాగా వేడిని కలిగించే పదార్థాలు. నువ్వులతో అనేక రకాలైన పిండివంటలు చేస్తారు. ఆహార పదార్థంగా వినియోగిస్తారు. నువ్వుల నూనెను శరీరానికి గట్టిగా రాసుకొని, నలుగు పెట్టుకొని స్నానం చేస్తే సకల రోగాలకు విముక్తి కలగడమే కాకుండా శరీరానికి వేడి కూడా పెరుగుతుంది. చలి కాలం ఇది మరింత విశేషం. నువ్వుల నూనెతో దైవానికి దీపాలను వెలిగించడం ద్వారా గృహంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి సువాసనామయమైనది, ఆరోగ్యకరమైనది నువ్వుల నూనె. స్నాన సమయంలో నువ్వులను నీళ్లలో వేసుకొను సంప్రదాయం కూడా వుంది. పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని ‘‘షట్తిలైకాదశి’’ అని పేరుతో చెపుతుంటాయి. ఆ రోజును నువ్వులను ఆరు రకాలుగా వినియోగించాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
ప్రకృతికి అనుగుణంగా మనని తీర్చిదిద్దుకునే విధానమే మనకు ధర్మశాస్త్రం బోధన కావడం వల్ల సంక్రాంతి సందర్భంలో ఈ నువ్వుల వాడకాన్ని అధికంగా చేయడమే ధర్మం. నువ్వులు శ్రేష్టమైనవి కావడం వల్లనే పితృ తర్పణాలలోనూ ‘‘తిల తర్పణాలు’’ చేయడం సంప్రదాయం. అది కాల క్రమంలో మనలోని అజ్ఞానం వల్ల కేవలం పితృకార్యక్రమాల్లోనే వాడాలని, శని వంటి పూజలే దానితో చేయాలని మూఢంగా నమ్మేవారు ప్రారంభమైనారు. ఈ భావనకు ఎంత మాత్రమూ ఆధారం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఈ నువ్వులను వాయనంగా సంక్రాంతి నాడు ఇచ్చుకునే సంప్రదాయం వుంది. నలుగురి క్షేమాన్ని కోరుకుంటూ ఆ ధాన్యం అందరూ ఈ చలికాలంలో ఉపయోగించాలనే దీనిలోని అంతరార్థం. ఏది ఏమైనా మనలోని అజ్ఞానాన్ని ఒకింత వదులుకొని, నువ్వుల వాడకాన్ని బాగా పెంచుకునే కాలం ఈ సంక్రాంతి కాలం. శరీరపరమైన అనారోగ్యాలు తొలగి, శుద్ధి ప్రక్రియకు చాలా దోహదం చేసేవి ఈ తిలలు. ఆహారంలో, స్నానంలో, దీపానికి ఇలా అనేక ప్రదేశాలలో నువ్వుల వినియోగం ఈ కాలంలో తప్పనిసరిగా చేయాల్సి వుంటుంది.

సూర్యారాధన విశేషం :
మకర సంక్రాంతి సందర్భంగా సూర్యుని ఉత్తరాయణ పుణ్య కాలాన్ని పురస్కరించుకొని సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయడం, గాయత్రీ జపాన్ని అధికంగా చేయడం ఆచారంగా వుంది. అంతేకాకుండా సూర్య దేవాలయాల్లో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించడం, అరుణ పారాయణం, అరుణ హోమాలను నిర్వహిస్తారు. సూర్య నమస్కారాల ద్వారా అందరికీ ఆరోగ్యం సిద్ధించాలని కోరుకునే విధానం ఈ ప్రత్యేక ఆరాధనలో మనకు కనిపిస్తుంది.

పితృ తర్పణాలు :
ద్వాదశ రాశులలోకి సూర్యుడు ప్రవేశించడం సంక్రమణం అంటాం. ఇటువంటి సంక్రమణ కాలాల్లో పితృ తర్పణాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. వీనిలో ఉత్తరాయణ ప్రారంభం అయిన మకర సంక్రమణ కాలంలో చేసే తర్పణాలు ఇంకా విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ సందర్భంలో తొమ్మిది రకాల కూరగాయలను కలిపి కూరలు వండటం, బ్రాహ్మణులకు కూరగాయలనూ, ధాన్యాన్నీ, దక్షిణనూ ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నాయి. కేవలం తర్పణాలు విడవడమే కాకుండా పెద్దల పేరుతో ఎన్నో రూపాల్లో దాన ధర్మాలను చేయడం, శరీరానికి వేడిని అందించే నువ్వులు, నెయ్యి, కంబళ్లు పేదలకు దానం చేయడం పుణ్యప్రదం అవుతుంది.
పెరుగుదానం – సంతాన అభివృద్ధి :
సంక్రాంతి నాడు పెరుగును దానం చేయడం వల్ల సంతానం లేని వారికి ప్రాప్తిస్తుందనీ, ఉన్నవారికి అభివృద్ధి ప్రదమవుతుందని పురాణాలు మనకు చెబుతున్నాయి. యశోద చేసిన పెరుగు దానం వల్ల కృష్ణుడు వారికి కుమారుడుగా లభించాడనీ, కృపాచార్యుని భార్య కృపి దూర్వాసుని సలహా మేరకు పెరుగుదానం చేయడం వల్ల అశ్వత్థామ వంటి కుమారుడ్ని పొందగలిగిందనీ పూర్వ కథనాలు మనకు తెలుపుతున్నాయి.
సంక్రాంతి – రంగవల్లులు :
ముగ్గులు వేయడం భారతీయ సంప్రదాయం. అందులోనూ దక్షిణ భారతం వారి ప్రత్యేక సంప్రదాయం. ఆకాశంలోని నక్షత్రాలే ముగ్గులలోని చుక్కలు. ఈ చుక్కలను కలుపుతూ పూర్వీకులైన వారు వేరు వేరు రాశులను, రాశి మండలాలకు పేర్లను రూపొందించారు.ఆ భావనకు ప్రతీకగా చక్కని రంగుల ముగ్గులను పెడుతూ, ఆకాశాన్ని భూమి మీద చూపిస్తున్న విధానమే ఈ రంగవల్లులు. అనేక రకాల ముగ్గులను పెడుతూ అలంకారాలు చేసుకుంటూ, సూక్ష్మజీవి నాశకాలైన ద్రవ్యాలను వానిలో వినియోగించుకుంటూ, అందంగా ఆనందంగా కన్నులకు ఇంపుగా.. అందరికీ స్వాగతం పలికేటట్లు వుంటాయి ఇవి. వీనిలో సంక్రాంతి నుంచి రథం ముగ్గును తమ ఇంటిలోకి వేసుకుంటూ వుండటం ఒక సంప్రదాయం. ఇది మాఘ శుద్ధ సప్తమి – రథ సప్తమితో ముగుస్తుంది. ఆ రోజున బయటికి రథాన్ని వేస్తుంటారు. ఇది సూర్యుని రథం. సూర్యుని ఉత్తరాయణపు వెలుగులను ఆహ్వానించడమే ఈ ముగ్గులోని రహస్యం. రథ సప్తమి సమయానికి ఈ వెలుగులకు ఒక స్థిరత్వం చేకూరుతుంది. ఇక క్రమంగా వేసవి కాలం ప్రారంభం అవుతుంది. అందుకే ఈ ముగ్గు వెనుక ఈ భావన మనకు కనిపిస్తుంది. చూసే కన్నులుంటే భారతీయమైన సంప్రదాయాల వెనుక అన్నీ ఇలాంటి భావనలే కనిపిస్తాయి.
సంక్రాంతి – పతంగుల ఉత్సవం :
పతంగం అంటే పక్షి. ఎగిరే జీవులు. అన్ని కాలలలోనూ మనం ఆకాశ దర్శనం చేయలేం. ఎండాకాలం తీవ్రమైన ఎండలు, వర్షాకాలం తీవ్రమైన వర్షాలు, చలికాలం మంచుతో కప్పుకొని పోవడం. ఈ కాలాల మధ్యలోని సంధికాలాలలో మాత్రమే ఆకాశాన్ని నిర్మలంగా దర్శించడం సాధ్యమవుతుంది. పతంగులు ఎగరవేయడం వెనుక ఆకాశ దర్శనం ఒక భాగం. ఆకాశ దర్శనం చేస్తున్న వారికి క్రమంగా భావనా పరమైన వైశాల్యం ఏర్పడుతుంది. విశ్వంపై అవగాహన ఏర్పడుతుంది. గాలి కూడా అతి వేగంగా, అతి తక్కువగా కాకుండా సమంగా వుండే కాలం ఈ సంక్రాంతి కాలమే. అందుకే ఈ కాలంలో అన్ని ప్రాంతాలలో పతంగులను ఎగురవేస్తూ ఆనందాన్ని పంచుకుంటూ వుండటం సంప్రదాయం అయ్యింది. దీని వెనుక విశ్వ దర్శనం, విస్తరణ భావనలున్నాయన్న విషయాన్ని మాత్రం మనం మరిచిపోవద్దు. మన లక్ష్యాలను సాధించాలన్న ఒక సంకల్ప సిద్ధి కూడా ఈ పతంగులను ఎగురవేయడంలో కనిపిస్తుంది.

ఇక ఆనందంగా మనిషి వున్నప్పుడు అందరికీ పంచుకునే సంప్రదాయం వుంటుంది. తనలోని దైవత్వం మేల్కొంటుంది. కాబట్టి హరిదాసుల వారికి, గంగిరెద్దుల వారికి, ఇతరమైన వేర్వేరు వృత్తి జీవనులకు దాన ధర్మాలను పెంచుకుంటూ అందరికీ పంచి ఆనందాన్ని పెంచుకునే సంప్రదాయం ఈ సంక్రాంతి పండుగలో మనకు కనిపిస్తుంది. బొమ్మల కొలువులు, భోగి పండ్లు మొదలైన ఆనందానుభూతులన్నీ ఈ సందర్భంలో కనిపిస్తున్నవే.
తెలంగాణ – సంక్రాంతి పండుగ :
తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతిని పీడ పండుగగా చూడటం వుంది. దక్షిణాయనానికి ఇది చివరి రోజులు. అంటువ్యాధులు మొదలైనవి రాబోయే ఆరు మాసాల్లో సంక్రమించవు.ఈ చివరి కాలంలో తమ గృహాల్లో ఇబ్బందులు వుండకూడదనే భావంతో ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన వ్రతం చేసుకునే సంప్రదాయం వుంది. ఈ నోములో అందరికీ నువ్వులతో పాటు ఏదో ఒక వస్తువును దానం చేసుకుంటూ వుంటారు.
ఈ నోము వెనుక ఒక భావన ప్రచారంలో వుంది. యమ ధర్మరాజు భార్య కుండలతో నోము చేసుకుంటుందట.
ఒక కుండ వరుసలో తక్కువైతే అక్కడే వున్న ఒక పుర్రెను తీసుకొని కుండగా భావించి నోము పూర్తి చేసుకుందట. ఆమె చేసుకునే నోములో అవసరమైన పుర్రె మన ఇంటిది కాకూడదు అనే భావనతో ఈ నోమును నిర్వహిస్తుంటారు స్త్రీలు. ఈ నోము విధానంలోనూ వివాహం కాగానే మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10, మూడో సంవత్సరం 15, నాలుగో సంవత్సరం 20, ఐదో సంవత్సరం 25 కుండలతో నోము కొనసాగిస్తారు స్త్రీలు. ఆ తరువాత నుంచి ప్రతి సంవత్సరం 5 కుండలను మాత్రమే ఈ నోములో వినియోగిస్తారు. ప్రస్తుత కాలంలో కుండల స్థానంలో చిన్నగా అలంకరించబడిన గురుగులతో ఈ నోమును పూర్తి చేసి వానిలో రేగుపండ్లు, నువ్వులు, చక్కెర, బియ్యం మొదలైన ద్రవ్యాలను వేసి వాయన పూర్వకంగా దానం చేస్తుంటారు.
ఇంకా ఆధునికంగా వేర్వేరు వస్తు స్వరూపాలను కూడా ఈ నోము సందర్భంగా వాయన రూపంలో ఇవ్వడం, ఇంటిలో అకాల మరణాలు రాకుండా వుండాలని కోరుకోవడం తెలంగాణ ప్రాంత ఆచారాల్లో కనిపిస్తుంది.
ఈ విధంగా ఒక వైజ్ఞానిక ప్రతిపత్తితో ఆనందాత్మకంగా తీర్చిదిద్దబడినదీ సంక్రాంతి ఉత్సవం. ఆచరణ విధానాల్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నా.. మనిషి సుఖ సంతోషాలతో, రోగరహితంగా, తృప్తిగా, ప్రశాంతంగా గడపాలన్నదే ఈ పండుగలలోని అసలు రహస్యం.
(సంక్రాంతి పర్వదినం సందర్భంగా)