ఆయుధం పట్టకుండా కదనాన్ని నడిపించవచ్చని నిరూపించిన శ్రీకృష్ణ భగవానుడు

మహాభారతానికి నాయకుడు. దుష్టులకు ప్రళయకాలరుద్రుడు. సజ్జనులకు ఆశ్రయస్థానం.. మహాయశస్వి.. జ్ఞాని.. కూట నీతిజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు. సర్వగుణాలు మూర్తీభవించిన పూర్ణావతారుడు. ఆగర్భ శత్రువులు సైతం పులకాంకితులై వినమ్రతతో మోకరిల్లే సౌశీల్య సౌజన్యమూర్తి. చేపట్టిన కార్యం క్లిష్టతరమైనా, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మార్గాన్ని సుగమం చేసుకోగల వివేకి. కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు మానసిక ధైర్యంతో ముందడుగు వేసి, మానవాళికి దిశానిర్దేశం చేసిన ‘గీతా’చార్యుడు. గోపాలన నుంచి రాజసూయంలో అగ్రతాంబూలం అందుకునేవరకు, కుచేలుడితో మైత్రి నుంచి గీతోపదేశం వరకు షోడశకళా ప్రపూర్ణుడిగా సాక్షాత్కరిస్తాడు. పరమయోగులకే అంతుపట్టని దివ్యత్వం ఆయన సొంతం. ఆయన జీవితం ఆద్యంతం మానవాళిని ‘జాగృతి’ పరిచేదే. శ్రీకృష్ణలీలల గురించి అనేక గాథలు ఉన్నాయి. కానీ, ఆయన ప్రదర్శించిన సామాజిక ఆదర్శాలు మాత్రం అంతగా ప్రస్తావనకు రావు. ఆధునిక జీవితంలో సర్వ సంక్షోభ నివారణకు ‘కృష్ణతత్వమే’ సరైన జవాబు అని వ్యక్తిత్వ వికాస నిపుణులూ అంటున్నారు.

‘కృష్ణ’ అనే పదానికి గల అనేకార్థాలలో కష్టాలను పోగొట్టేవాడు, ఆకర్షించేవాడు అనేవీ ఉన్నాయి. ‘వస్తూని కోటి శస్సంతు పావనాని మహీతలే! నతాని తత్తులాం యాంతి కృష్ణ నామాను కీర్తనే!! (ధరాతలంపై గల పవిత్ర వస్తువులన్నింటినీ కలిపినా శ్రీకృష్ణనామ సంకీర్తనకు సాటిరావు) అని శ్రీకూర్మ పురాణం పేర్కొంటోంది. యదువంశంలో క్షత్రియ కుటుంబంలో చెరసాలలో పుట్టాడు. మేనమామ కంసుడి దురాగతాల వల్ల అక్కడి నుంచి మాయమై కన్నవారికి దూరంగా పెరిగాడు. అడుగడు గునా గండాలైనా ఎదిరీది నిలిచాడు. అయినా అందరివాడై ప్రేమానందాలు పంచాడు. ‘గోవిందుడు అందరి వాడు’ అనిపించుకున్నాడు. భాగవతంలోని కృష్ణయ్య అమాయక బాలుడు, సున్నిత స్వభావుడు. మహాభారత కృష్ణుడు దార్శనికుడు, రాజకీయ చతురుడు, వ్యూహకర్త.

మరోవంక, దుర్మార్గులను, దుర్మార్గాలను పెంచిపోషించే వారిని శిక్షించడంలో సామాన్య రక్షణ ధర్మాలు పాటించనవసరంలేదన్నది శ్రీకృష్ణ ‘మతం’. ‘ధర్మాత్ములైన వారు యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధనీతి, ధర్మాలు పాటించాలి తప్ప దుర్మార్గాలకు ప్రతినిధుల వంటి దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, జరాసంధ, శిశుపాల, సైంధవుడు వంటి వారి విషయంలో ఆ అవసరంలేదు. సహజ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారు జీవించే హక్కును కోల్పోతారు. అలాంటి వారిని ఏ మాయోపాయంతో సంహరించినా పాపకార్యం కాదు’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్లు ఆయన చర్యలు, వ్యూహాన్ని బట్టి అవగతమవుతుంది. అయినా అలాంటి వారిలో మార్పు కోసం అనేక అవకాశాలు ఇచ్చాడు. ‘తా పట్టిన కుందేటికి..’ సామెతలా వ్యవహరించేవారిని, కారణాంతరాల వల్ల వారిని బలపరిచేవారిని రణరంగంలో ఊచకోత కోయించాడు. ‘కృష్ణ పథం’ను అనుసరించి ధర్మ ప్రతిష్ఠాపన, స్వరాజ్య స్థాపనలో చంద్రగుప్త విక్రమాదిత్య, శివాజీ మహరాజ్‌ ‌లాంటి వారు కృతకృత్యులయ్యారు..

ప్రకృతి హితైషి

శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రియుడు. ప్రకృతి కోసమే పుట్టాడు. సమస్త ప్రాణులలో నివాసం ఉండడం, దేవతలు ఆయనలో కొలువుదీరడం వల్ల వాసుదేవ (వాసనాత్‌ ‌సర్వభూతానాం వసుత్వాత్‌ ‌దేవ యోనితః) అని పేరు వచ్చిందని వ్యాస భారతం పేర్కొంటోంది. గోవులను కాశాడు. లేగదూడలతో ఆడుకున్నాడు. కొండలు, గుట్టలు ఎక్కాడు. జతగాళ్లతో చల్దులు ఆరగించాడు. మన్ను తిన్నాడు. వనమాల, శిఖిపింఛంధరించి గ్రామాలలో (స్థానికంగా)దొరికే వస్తువులనే ఉపయోగించాలనే సందేశాన్ని ఇచ్చాడు. స్వావలంబనం ముఖ్యమని చాటిచెప్పేలా వెదురుతో మురళి తయారు చేశాడు… తన ఊరిలో దొరికిన వెన్న, మీగడ తిన్నాడు. పల్లెలోని జతగాళ్లకు పెడుతూ తానూ ఆరగించాడు. ఇలా ఆయన బాల్యం గ్రామత్వాన్ని చాటుతుంది. గోకులాన్ని వదిలి ద్వారకకు చేరినా ‘అటుకుల’ రుచిని మరువలేదు.

గ్రామంలోని పశుపక్ష్యాదులను, నదులను, పర్వతాలను ప్రేమించాడు. కళ్ల ముందున్న ప్రకృతిని కాదని ‘ఇంద్రపూజ’ చేయడాన్ని నిరసించాడు. ‘మన కోసం మన పక్కనే వెలసి, అన్నీ ఇచ్చే గోవర్ధనం ఉండగా ఎక్కడో ఉన్న ఇంద్రుడికి పూజలు ఎందుకు? ఈ ‘గిరి’ పశువులకు గ్రాసం, పక్ష్యాదులకు నీడ, మనిషికి ఫలపుష్పాలు, ఓషధులు వంటివి ఇస్తుంది. గోవు అమ్మలాంటిది. సమస్త దేవతలకు నిలయం. ఇంతకు మించిన ప్రత్యక్ష దైవాలు ఏముంటాయి? ఎక్కడ ఉంటాయి?’ అంటూ ఆనాదిగా వస్తున్న ‘ఇంద్రపూజ’కు స్వస్తి చెప్పి ‘గోవర్ధనపూజ’కు శ్రీకారం చుట్టాడు. అది ప్రకృతి ఆరాధనే కానీ దైవ ధిక్కారం కాదు. ఆధునిక కాలంలో ప్రకృతి విధ్వంసకులకు, గో హింసాత్మకులకు దేవదేవుడి సందేశం ఓ పాఠం లాంటిది.

నాయకత్వ లక్షణాలు

‘చిన్ని’ కృష్ణుడిగానే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాడు. నాయకుడు అంటే మార్గదర్శనం చేస్తూ, కడకంటూ పోరాడాలి తప్ప పలాయనం చిత్తగించకూడదని సూచించాడు. ఇంద్రుడి ప్రతాపాన్ని అడ్డుకుని గోకులాన్ని రక్షించేందుకు గోవర్ధన గిరిని చిటికెన వేలిపై నిలిపిన సంఘటనే అందుకు ప్రథమోదాహరణ. చక్కటి వ్యూహం ఉంటే ఆయుధం పట్టకుండా కదనాన్ని నడిపించవచ్చని కురుక్షేత్రంలో నిరూపించాడు. ‘వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి’ అన్నట్లు అధర్మాన్ని అవసరమైతే అధర్మయత్నాల తోనే జయించి (‘అశ్వత్థామ హతః కుంజరః’ లాంటిది) ధర్మాన్ని రక్షించడమే కృష్ణావతార ధ్యేయం. లోకరక్షణ, ధర్మం విషయంలో బంధువులు, స్నేహితులు, వృద్ధులు, గురువులు…లాంటి వ్యత్యాసాలు లేవు. లోక కల్యాణం కోసం వ్యక్తిగత ప్రేమానురాగాలను, మానవమానాలను, సుఖదుఃఖాలను, భయ క్రోధాలను లెక్కచేయకపోవడం కృష్ణతత్త్వం. శక్తి సామర్థ్యాలు ఉన్నా ఏలికల అత్యాచారా లను ప్రతిఘటించకుండా పరోక్షంగా బలపరిచిన వారందరి శిక్షలకు కారకుడయ్యాడు. వ్యక్తి/వృత్తిగతంగా ఎంతో సచ్ఛీలురు, పరాక్రమ వంతులైనా లోకధర్మ రక్షణకు ముందుకురాని వారినీ కురుక్షేత్ర సంగ్రామంలో వైరి రాజులతో పాటు సంహరించ నిశ్చయించాడు. మంచి మాటల• చెవికెక్కని దుర్మార్గులు వారు ‘వారి పాపాన వారే పోతారు’ అనే వాదనకు తావివ్వక వారిని సమూలంగా అంతమొందించి నాటి భారత్‌ను వారి రక్తంతోనే క్షాళన చేశాడు.

ఉత్తమ రాజనీతిజ్ఞుడు

మహాభారతాన్ని రాజకీయ కోణంలో పరిశీలిస్తే కృష్ణుడిదే కీలక పాత్ర. అక్రమ వర్తనులు, ప్రజాకంటకులు అయిన రాజులను అంతం చేసి, దేశాన్ని నిష్కంటకం చేసి ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించాడు. సమర్థ పాలకుల చేతిలోనే రాజ్యం ఉండాలనే భావనతో ధర్మరాజుతో రాజసూయ యాగం చేయించి ఏకచ్ఛత్రాధి పత్యాన్ని కల్పించాడు. ఎందరో రాజులు పాదాక్రాంతులయ్యారు. ఎన్నో సింహాసనాలు దక్కాయి. కానీ ఆది నుంచి ‘సమ్రాట్‌ ‌నిర్మాత’ (కింగ్‌ ‌మేకర్‌)‌గా ఉండాలనుకున్నాడే కాని రాజు కావాలని, రాజ్యాలు ఏలుతూ రాజభోగాలు అనుభవించా లని ఉవ్విళ్లూరలేదు. పదవుల కోసం పాకులాడకుండా, అన్యాయార్జితానికి పథకాలు వేయకుండా ధర్మరక్షణ, సుపరిపాలన కోసం రాజకీయాన్ని రసవత్తరంగా నడిపిన దురంధరుడు. కంస వధానంతరం, మగధ రాజ్యాధిపత్యం స్వీకరించవలసిందిగా వృద్ధుడైన ఉగ్రసేనుడు కోరాడు. ‘కంసవధతో విజేతగా రాజ్యం నీకు (కృష్ణుడి) సంక్రమించి నట్లే. పైగా వృద్ధాప్యంతో అశక్తుడైన నేను రాజ్యపాలనకు అనర్హుడిని’ అని తాత ఉగ్రసేనుడు పలికాడు. దానికి కృష్ణుడు ‘నహి రాజ్యేన మే కార్యం/నాప్యహం నృప కాంక్షితః/న చాపి రాజ్యలబ్ధేన/మయా కంసో నిపాతితః’ (నాకు రాజ్యకాంక్ష ఎన్నడూ లేదు. కంసుడిని చంపింది రాజ్య లోభంతో కాదు)అని బదులు ఇచ్చాడు. ‘అహం స ఏవ గోమధ్యే/గోపై స్సహ వనే తరః’ (నేను గోవుల మధ్య అడవుల్లో తిరిగేందుకు పోతాను) అని విన్నవించాడు. ఇలాంటి స్థిత ప్రజ్ఞత్వం, నిస్వార్థం వల్లనే, రాజ్య సింహాసనం ఎక్కకపోయినా ప్రజా హృదయ పీఠాన్ని అధిష్టించగలిగాడు.

ఎదిగినా ఒదిగొదిగి…

కృష్ణయ్య బాల్యం నుంచీ అహంభావత్వాన్ని త్యజించాడు. గోకులంలో ఎంత చిన్నవారితోనైనా ప్రేమగా మెలగేవాడు. భావికాలంలో నరుడు అర్జునుడి రథానికి ఈ నారాయణుడు ‘సారథి’గా మారాడు. తన అల్లుడు కంసుడిని వధించినందుకు మగధరాజు జరాసంధుడు కృష్ణుడిపై ప్రతీకారంతో మధురపై పదహారుసార్లు దాడిచేశాడు. తనపై గల వ్యక్తిగత కక్ష ప్రజలకు శాపంగా మారకూడదని, తనవల్ల వారు ఇక్కట్లపాలు కాకూడదనే భావనతో వేరే నగరాన్ని (ద్వారక) నిర్మించుకుని దూరంగా ఉన్నాడు. నరకాసురుడి చెరలోని పదహారు వేలమంది మహిళలను ఆదుకుని గౌరవ జీవితం ప్రసాదించాడు. ఈ వృత్తాంతంపై ‘16 వేలమంది భార్యలను పోషించిన అపర నిజాం’ అని కొందరు ఆధునిక మేధావులు వ్యాఖ్యానించారు. తార్కికంగా ఆలోచిస్తే… ఆ మహిళల (నరకుడి చెరలోని) యుక్తవయస్సు దాదాపు అక్కడే గడిచిపోయింది. విముక్తిపొందిన తమను కన్నవారు కానీ, ఇతరులుకానీ ఆదరించరని మొర పెట్టుకోగా వారికి ‘భర్త’గా ఉంటూ సమాజంలో గౌరవ ప్రతిపత్తులు కల్పించాడు. ఇక్కడ ‘భర్త’పాత్ర అంటే కేవలం అండదండలు ఇవ్వడమే కాని కురచ మనస్తత్వంతో ఆలోచించే సంసార సుఖం కాదని ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఏడున్నర దశాబ్దాల క్రితం దేశవిభజన నేపథ్యంలో ఎందరు మహిళలు విగత భర్తృకలై అవమానాల పాలయ్యారు? సమాజం ఎందరిని ఆదరించింది? అనే దానినిపై ఆత్మపరిశీలన చేసుకుంటే అలాంటి వ్యాఖ్యాలకు ఆస్కారం ఉండేది కాదు.

విశ్వశాస్త్రం ‘గీత’

మానవ మస్తిష్కాలపై చెరగని ముద్ర వేసిన భగవద్గీత విశ్వశాస్త్రంగా మన్ననలు అందు కుంటోంది. గీతోపదేశంతో శ్రీకృష్ణ స్వరూపం ఉన్నత శిఖరాన్ని అందుకుంది. ‘నాకు విజయంపై కోరికలేదు. విజయం సాధించడం నాకు పరమార్థం కాదు. రక్తసిక్తమైన విజయంతో భోగభాగ్యాలను అనుభవించ లేను’ (‘న కాంక్షే విజయం కృష్ణా…’)అని ఆత్మ స్థయిర్యం కోల్పోయిన అర్జునుడిలో మనోధైర్యం నింపాడు. ‘అధర్మం పెచ్చరిల్లి ధర్మం మసకబారి నప్పుడు ధర్మసంస్థాపన కోసం నన్ను నేనే సృష్టించు కుంటాను. నీవు నిమిత్త మాత్రుడివి. ‘చేసేది, చేయించేది నేనే’ అనిసర్వభారం తనపైనే వేసుకున్నాడు. యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండే చోట విజయం’ తథ్యమని (‘యత్రయోగీశ్వరః కృష్ణో….’) చెలికాడికీ సమాన కీర్తిని కట్టబెట్టాడు.

‘గీత’ భగవానుడు ప్రసాదించిన అద్భుత గ్రంథరాజమని, అదే లేకపోయి ఉంటే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణమయ్యేది కాదని జ్ఞానులు, మేధావులు శ్లాఘించారు. భగవద్గీత’లోని ఒక్క శ్లోకాన్నయినా గురు ముఖతః అధ్యయనం చేసిన వారుధన్యులవుతారని జగద్గురువు శంకర భగవత్పాదులు ఉద్బోధించారు.

కర్మకు, జీవితానికి ఉండే సంబంధం ఏమిటి? కర్మను ఏ విధంగా అచరిస్తే మానవుడు అంతిమ ధ్యేయం సాధించగలుగుతాడు? మొదలైన ప్రశ్నలకు పరిష్కార కావ్యమది. అది స్వదేశీయులను, విదేశీయులకు, తత్వజ్ఞులకు, మాతృదేశ విముక్తి పరులకు కర్తవ్యబోధ చేసింది

స్థితప్రజ్ఞతకు ప్రతీక

జననం నుంచి అవతార పరిసమాప్తి వరకు పలు సందర్భాలలో మానవాతీతుడిలా లీలలు ప్రదర్శిస్తూనే, సామాన్యుల మాదిరిగా కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే, స్థితప్ర్ఞత ప్రదర్శించాడు. తాను ఆచరించిన దానిని మానవాళికి ‘గీత’రూపంలో సందేశం ఇచ్చారు. అధర్మవర్తనులైన దుర్యోధనాది ధార్తరాష్ట్రు లను పట్టించుకోకుండా, ధర్మమార్గాన్ని అనుసరించే కౌంతేయులవైపు మొగ్గి పాండవ ‘పక్షపాతి’అనే నిందను ఆనందగానే భరించాడు. రాజసూయ సభలో అగ్రతాంబూలం స్వీకరణ సందర్భంబంగా అవమానాలు ఎదుర్కొన్నా, ఇష్టంగా నిర్మించుకున్న ద్వారకానగరం సాగరగర్భంలో కలిసిపోతున్నా అదే స్థితప్ర్ఞత. ‘మునుల, పతివ్రతా శిరోమణి గాంధారి శాపాల కారణంగా ముసలం పుట్టి యదుక్షయానికి కారణమవుతుంది. నేటికి ఏడవ రోజున సముద్రుడు ద్వారకను ముంచేస్తాడు. యుగసంధి ఆసన్నమైంది. కలియుగం ఆరంభమవు తుంది’ అని ఉద్దవునికి బోధిస్తాడు. అన్న బలరాము డిని మహాప్రస్థానానికి సిద్ధం చేసి, తాను అడవిలో విశ్రమించిన వేళ బోయ వాడి శరాఘాతంతో మహానిర్యాణంతో వైకుంఠ ధామం చేరాడు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్‌

జాగృతి సౌజ‌న్యంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *