అమృతోత్సవాల దిశగా కళ్యాణ ఆశ్రమం

భారతదేశం వైవిధ్యభరితమైన ప్రకృతిని మరియు సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి. ఇది వందలాది గిరిజనులు లేదా ‘వనవాసుల’ భూమి కూడా. మన దేశంలోని అన్ని ప్రాచీన గ్రంథాలు/ సాహిత్యంలో వనవాసుల ప్రస్తావన కనిపిస్తుంది.భగవాన్‌ బిర్సా ముండా వంటి ఎందరో గిరిజన వీరులు స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. మహారాష్ట్రలో కన్హోజీ భంగారే, కేరళలో తలక్కల్‌ చందు, ఒరిస్సాలో విషోయ్‌, మేఘాలయలో తిరోట్‌ సింగ్‌, బీహార్‌లోని సంథాల్‌ నాయకులు (సిద్దో, కానూ మరియు తిల్కా మాంరీa), రాణి గైడిన్ల్యూ మరియు మణిపూర్‌కు చెందిన షాహిద్‌ జదోనాంగ్‌, రాజస్థాన్‌లోని పుంజాభిల్‌. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న గిరిజన వీరులతో పాటు, చాలా మంది గిరిజన స్వాతంత్య్ర వీరుల గాధలు అజ్ఞాతంలో ఉండి పోయాయి.
దుస్తులు, సాంప్రదాయ అలంకారాలు, మాండలికం, జానపద మరియు ఆచారాలు, జీవన విధానం, సంప్రదాయాలు, దేవతలు మొదలైనవి వనవాసులను ఇతరులకంటే ప్రత్యేకంగా చూపుతాయి. వారు ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడి ఉన్నారు. దురదృష్టవశాత్తూ దేశంలోని నగర వాసులలోని కొన్ని వర్గాలలో వనవాసుల గురించి తప్పుడు అభిప్రాయాలు ఉండిపోయాయి. వనవాసులను, వారి గొప్ప సంస్కృతిని సమాజం గౌరవించడం నేటి అవసరం.
క్రైస్తవ మిషనరీలు విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని రకరకాల ప్రలోభాలతో గిరిజనులను మతం మార్చి భారతీయ జీవన స్రవంతి నుండి వేరుచేసే ప్రయత్నాలు ఆంగ్లేయులు కాలం నుండి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. విదేశీ విష సంస్కృతుల నుండి వీరిని కాపాడి చైతన్యవంతులను చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.శ్రీ ఠక్కర్‌ బప్పా, పూజ్య గురూజీల ప్రేరణతో, స్వ॥రమాకాంత్‌ కేశవ్‌ దేశ్‌పాండే (వనయోగి బాలాసాహెబ్‌ దేశ్‌పాండే) 26 డిసెంబర్‌ 1952న మధ్యప్రదేశ్‌లోని జష్‌పూర్‌లో (ప్రస్తుత ఛతీస్‌గఢ్‌లో) వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగినది. మొదటగా 13 మంది స్థానిక వనవాసీ విద్యార్థులతో విద్యార్థినిలయ ప్రకల్పాన్ని ప్రారంభించారు.
వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమం 1978 నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలలో వివిధ ప్రకల్పాల ద్వారా విస్తరించింది. వనవాసీ కళ్యాణ ఆశ్రమ కార్యకర్తలలో దాదాపు సగం మంది గిరిజనులే. వీరితో పాటు అనేక మంది విద్యార్థులు, ఉద్యోగ, వృత్తి నిపుణులు, పదవీ విరమణ పొందిన వారు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమం 14 అయామ్‌లు (మూడు శ్రేణుల) ద్వారా వివిధ ప్రకల్పా (ప్రాజెక్ట్‌)లను నిర్వహిస్తున్నది. వాటిలో ముఖ్యమైనవి ఫార్మల్‌ అండ్‌ నాన్‌ ఫార్మల్‌ విద్యాలయాలు, విద్యావిహార్‌ పాఠశాలలు, క్రీడా కేంద్రాలు, క్రీడా పోటీలు, విద్యార్థి నిలయాలు, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సమ్మేళనాలు, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామ వికాస్‌ మొదలైనవి.
 vanavasi
వనవాసీల అంతర్గత సంఘటన శక్తిని ఉద్దీపింపజేయుట, వారి వారసత్వపు విలువలను జాగృతం చేయుట, జాతీయ భావాలతో నిస్వార్ధమైన సామాజిక స్పృహ కలిగి ఉండే విధంగా వారిని తయారు చేయడం వనవాసీ కళ్యాణాశ్రమం యొక్క ప్రధాన లక్ష్యం. గిరిజనులనుండే నాయకత్వాన్ని నిర్మాణం చేసి వారి ద్వారానే పనులు జరిగేలా చూడటం కూడా ఒక ముఖ్యమైన విషయమే.
1977 సంవత్సరంలో తూర్పు కనుమలలోని, ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలో మఠం కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ వనవాసీ కల్యాణాశ్రమం స్వ॥కొయ్యడ శ్రీధర్‌జీ ప్రారంభించడం జరిగినది. కళ్యాణ్‌ ఆశ్రమం ప్రకల్పాలు శాఖోపశాఖలుగా విస్తరించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వేర్వేలు సంస్థలుగా పనిచేస్తున్నది.
అఖిల భారత స్థాయిలో 1988లో క్రీడావిభాగం ప్రారంభమైనది. 1989లో మొదటిసారి ముంబాయిలో అ.భా. క్రీడాపోటీలు నిర్వహించడం జరిగింది. అప్పటినుండి నాలుగు సం॥లకొకసారి అఖిల భారత క్రీడలు నిర్వహించడం జరుగుతున్నది. వివిధ సేవా విభాగాలకు సంవత్సరంలో ఒకసారి శిక్షణ నిర్వహిస్తుంది. ఈ ప్రకల్పాలన్నీ ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోకుండా నిర్వహింప బడుతున్నాయి.2005వ సం॥ంలో విజయవంతంగా శబరి కుంభమేళా నిర్వహించడం జరిగింది. ఎంతో యోజన బద్ధంగా మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చికిత్స విభాగాన్ని తీసుకున్నట్లయితే రెండు రాష్ట్రాల్లో అంబులెన్సులు వైద్య సేవలందిస్తున్నాయి. ఇవేకాక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి అనేకమంది వైద్యుల సహాయ సహకారాలతో గిరిజనులకు సేవ చేయడం జరుగుతున్నది.
వనవాసీ కళ్యాణాశ్రమంలో వివిధ రకాల ఆయాములలో నూతనంగా యువ అయామ్‌ ప్రారంభించడం జరిగినది. యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలలో వారు ఎంపిక అయ్యే విధంగా తయారు చేస్తున్నారు. స్వ॥శ్రీధర్‌జీ కృషివల్ల రెండు రాష్ట్రాలలో వందలాది గ్రామాలలో భజన మండలి / బాల సంస్కార కేంద్రాలు ప్రారంభించబడి విజయవంతంగా నడుస్తున్నాయి.డిసెంబర్‌ 26న వనయోగి శ్రీ రమాకాంత్‌ దేశ్‌పాండే గారి జన్మదినం కూడా. 75 సం॥రాల అమృతోత్సవాల దిశగా నడుస్తున్న వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమం యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సంవత్సరం మనందరం ఉత్సాహంగా జరుపుకుందాం.
`శోభనాచలపతి, 7680022143
తెలంగాణ ప్రచార ప్రసార ప్రముఖ్‌
(వనవాణి పత్రిక సౌజన్యంతో) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *