అబల కాదు సకలకళా వల్లభ: హిందూ మహిళా శక్తి ప్రస్థానం!

భారతీయ మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు. సహనం, శక్తి , సంస్కృతికి మారుపేరు స్త్రీ. వేదకాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు భారతీయ మహిళలు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశారు. అసలు భారత సమాజంలో మహిళలను గౌరవించలేదనీ, వారిని చులకనగా చూశారనీ, చదివించలేదనీ, కనీసం పెళ్లికూడా ఇష్టప్రకారం చేయలేదంటూ రకరకాల అవాకులు చవాకులు పేలుస్తూ చాలామంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు.
Indian women
కానీ, మన భారతీయ చరిత్రను కనుక పరిశీలిస్తే వేదకాలంలో స్త్రీలకు సమాజంలో అత్యంత ఉన్నతమైన స్థానం, గౌరవం, స్వేచ్ఛ ఉండేవి. పురుషులతో సమానంగా వారు అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వేదకాలంలో బాలికలకు కూడా ఉపనయన సంస్కారం జరిగేది. వారు గురుకులాల్లో విద్యనభ్యసించేవారు. వారిని రుషికులు అని పిలిచేవారు. విద్యనభ్యసించే స్త్రీలను రెండు రకాలుగా వర్గీకరించేవారు: సద్యోవధులు అంటే వివాహం అయ్యే వరకు చదువుకునేవారు. మరొకరు బ్రహ్మవాదినులు. వీరు జీవితాంతం వివాహం చేసుకోకుండా వేదాధ్యయనం, తపస్సు చేసేవారు. మన చరిత్రలో గార్గి, మైత్రేయి వంటి మహిళలు వేద కాలంలోనే పురుషులతో సమానంగా మేధోపరమైన చర్చలు చేసేవారు. వారు విద్యకు, జ్ఞానానికి మహిళలు అతీతం కాదని ఆ కాలంలోనే నిరూపించారు. లోపాముద్ర, విశ్వవార: వీరు స్వయంగా ఋగ్వేదంలోని శ్లోకాలను (రుక్కులను) రచించిన మంత్రద్రష్టలు. అందుకే మనం సావిత్రి దేవిని, గాయత్రిదేవిని జ్ఞానానికి ఆనవాలంగా చెబుతుంటాం.
Indian women
అంతేకాదు ఆ కాలంలో మహిళలకు పెళ్లిపై పూర్తి స్వేచ్ఛ ఉండేది. స్వయంవర పద్ధతి ద్వారా తమకు నచ్చిన పురుషుడ్ని వివాహమాడేవారు. ఋగ్వేద కాలంలో బాల్య వివాహాలు ఉండేవి కావు; అమ్మాయిలు 16-17 ఏళ్ల వయస్సు వచ్చాకే వివాహం చేసుకునేవారు. భార్యను ‘అర్ధాంగి’ (పురుషునిలో సగభాగం)గాను, ‘గృహిణి’ (ఇంటికి యజమానురాలు)గాను గౌరవించేవారు. భర్త మరణిస్తే వితంతువులకు పునర్వివాహం చేసుకునే హక్కు ఉండేది. అంతేకానీ సతీసహగమనం అనే దురాచారం అసలు లేదు. యజ్ఞ యాగాదులు, ఇతర ధార్మిక కార్యక్రమాలలో భర్తతో సమానంగా భార్య పాల్గొనడం తప్పనిసరిగా ఉండేది. స్త్రీలకు ఆస్తి హక్కులు ఉండేవి. ముఖ్యంగా పెళ్లికాని కుమార్తెలకు తండ్రి ఆస్తిలో 1/4 వంతు వాటా లభించేది. వారు కూడా తమకు తోచిన పనిచేసి ఆర్థిక స్వతంత్రాన్ని అనుభవించేవారు.
Indian women
భారతదేశంలో మధ్యయుగ (మహ్మదీయుల) కాలం , ఆధునిక (బ్రిటిష్) కాలం మహిళల స్థితిగతుల్లో ఎన్నో ఒడిదుడుకులను, మార్పులను తీసుకువచ్చాయి. మహ్మదీయుల కాలంలో నిరంతర యుద్ధాలు , సామాజిక అభద్రత కారణంగా మహిళల స్వేచ్ఛ గణనీయంగా తగ్గింది. అయితే, ఇదే కాలంలో అసాధారణ మహిళా శక్తి కూడా ఉద్భవించింది. బ్రిటిష్ కాలం భారతీయ మహిళా చరిత్రలో ఒక ‘పునరుజ్జీవన కాలం’. పాశ్చాత్య విద్య , సంఘ సంస్కరణలు మహిళా సాధికారతకు పునాది వేశాయి.
భారతీయ మహిళ కేవలం జ్ఞానానికి ప్రతీక మాత్రమే కాదు. పరిపాలనలోనూ, ధైర్యానికి కూడా మారుపేరు. ఝాన్సీరాణి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి రుద్రమ ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటల్లో ఎందరెందరో వీర నారీమణులు ఉన్నారు. ఉదాహరణకు భారతదేశాన్ని పాలించిన రాణి అహల్యాబాయి హోల్కర్ కేవలం పాలకురాలిగానే కాకుండా, దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాలను పునరుద్ధరించిన గొప్ప ధర్మకర్తగా పేరుగాంచారు. ఆమె పాలనను “రామరాజ్యం”గా అభివర్ణిస్తారు. మీరాబాయి, అక్కమహాదేవి వంటి వారు కవిత్వం , భక్తి ద్వారా కుల, లింగ వివక్షలను బద్దలు కొట్టారు. మహ్మదీయుల కాలంలో మహిళ తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడితే, బ్రిటిష్ కాలంలో తన హక్కుల కోసం పోరాడింది. ఈ క్రమ పరిణామమే నేటి స్వతంత్ర భారతదేశంలో మహిళల ఉన్నత స్థానానికి మార్గం సుగమం చేసింది.
Indian women
ఇక నేటి ఆధునిక భారతీయ సమాజంలో మహిళ కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కుటుంబాన్ని చక్కదిద్దడంలో, విలువలను తర్వాతి తరానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” (ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అన్నది మన సంస్కృతిలో భాగం. ఆధునిక భారతంలో కూడా ఎందరోమంది మగువలు తమ తెగువను ప్రదర్శించారు. సైన్స్‌లో చూస్తే మంగళయాన్, చంద్రయాన్ తదితర అంతరిక్ష ప్రయోగాల్లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ‘రాకెట్ విమెన్’గా కీర్తిని అందుకున్నారు. ఇక క్రీడల్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి ఎందరో ప్రపంచ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. రక్షణరంగంలో సైతం ఎందరో మహిళలు దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. ఈ విషయంలో ఆపరేషన్ సిందూర్ గురించి మనందరికీ తెలిసిందే.
Indian women
ఇలా వేదకాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు.. భారతీయ మహిళ ప్రయాణం ఒక అజేయమైన శక్తికి నిదర్శనం. ఆమె అబల కాదు, సకల కళా వల్లభ.. అనాదిగా వెలుగుతున్న అఖండ జ్యోతి!
లతాకమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *