ఈ 10 పనులతో మన భూగోళాన్ని రక్షించుకుందాం…
ఒకప్పుడు
సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’’
అంటూ భూమాతను పూజించే సంస్కారం, కీర్తి, కాంతా, కనకాలకు అతీతుడై నిరాడంబరంగా, ఉదాత్తమైన ఆలోచనలతో జీవనయానం, ఉమ్మడి కుటుంబం, పరిపూర్ణ ఆరోగ్యంతో సామాజిక జాతీయ పండుగలైన దసరా, ఉగాది, సంక్రాంతి, దీపావళి జరుపుకుంటూ సంఘటిత శక్తిని పొందడం. సకాలంలో వర్షాలు, చేతికందే పంటలు, పశుపోషణ, వృక్ష సంపద, అటవీ సంపద, ప్రకృతి వనరుల సద్వినియోగం. ప్రకృతి సిద్ధంగా జరిగే వాతావరణ మార్పులు, ప్రకృతి ఆరాధనే దైవారాధనగా పంచ భూతాలను పూజించే సంస్కృతి మనది.
ECO-NOMICS (ప్రకృతి సంతులన శాస్త్రం) అంటే మనిషి మరియు ప్రకృతి మధ్య సంబంధాల అమలును కచ్చితంగా పాటించే అమరిక, తరువాతి తరాలకు పదిలంగా భూమిని అప్పగించే సువ్యవస్థ వుండేది.
’’ఈశావాస్య మిదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథా: మాగృధ: కస్యస్విద్ధనం’’
అంతా ఈశ్వరమయం, ఈశ్వర ప్రసాదితం. అతను త్యజించిందే అనుభవించు, అన్యులధనం ఆశించకు. అనే ఉదాత్త వేద ఘోషను నరనరాన జీర్ణించుకున్న సంస్కృతితో ప్రకృతిని రక్షించే సంస్కారం మనది. ‘‘ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ్’’ దేశాన్ని పాలించే రాజులు ప్రకృతిని కాపాడే విధంగా రాజ్యపాలన చేస్తూ మానవ ప్రగతి ప్రకృతితో ముడిపడి వుండే విధంగా చట్టాలు రూపొందించిన వైనం. మానవుల మధ్య మమతానురాగాల హార్దిక సంబంధాలుండేవి.
మరి ఇప్పుడు..
పారిశ్రామికీకరణ పేరుతో సామాజిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. హైటెక్కు జీవనం, దేశ, కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా మనిషితో అక్షరాల రణం చేస్తున్న వాతావరణం అయ్యింది. రోహిణి రాకుండానే రోళ్లు పగిలే ఎండలు, శీతాకాలంలో ఎముకలు కొరికే చలి, దశాబ్దాల రికార్డుల్ని తుడిచి పెడుతూ కొత్త ధోరణులతో విలయాలు విరుచుకుపడుతున్నాయి. ప్రకృతిని వికృతి చేస్తున్న కత్రినా, ఖైమూర్, అగ్ని, సునామి, టోర్నెడో, హారికేన్లు వికృతిగా అవుతున్నాయి. సామాజిక సాంస్కృతిక పండుగల స్థానంలో పర్యావరణ, ధరిత్రి, జల, ఓజోన్, ఆరోగ్య దినోత్సవాలు జరపాలి.
365 పాటు ఏ ఒక్క రోజును కూడా వదలకుండా పర్యావరణ దినోత్సవాలు జరుపుకోవాలి. జ్వర పీడితగా మారిన ధోరణి, ప్రమాదకర స్థాయిలో భూతాపం పెరిగిపోతోంది. భూమండలాన్ని నిప్పుల కొలిమిలా మార్చేసి, సౌర కుటుంబంలో మండే అగ్ని గోళం సూర్యుడా? భూమా? అన్న చందంగా తయారైంది.
ఆమ్ల వర్షాలు, జల, వాయు, నేల, లోహ, మృత్తిక, ధ్వని, రేడియేషన్ కాలుష్యాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భూమండలంపై మానవ మనుగడనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. గ్రుక్కెడు త్రాగునీటి వెదుకులాటకు భవిష్యత్తులో శాటిలైట్ లను పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. మానవుడి తదుపరి మజిలీ కోసం అంగారక, చంద్రమండలాలపై మితిమీరన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. తరువాతి తరాలకు పదిలంగా భూమిని అందిచలేని దుస్థితికి చేరుకున్నాం. అలాగే భూగర్భ జలాలు అడుగంటడం, నీటికోసమే ప్రపంచ యుద్ధాలు జరిగే వైపరిత్య స్థితికి వచ్చేశాం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ కూడా పర్యావరణ ప్రమాణాలను అసలు పాటించడమే లేదు. ప్రకృతిని భక్షించే వ్యవస్థలే వున్నాయి.
ఆర్థిక వ్యవహారాల యజమాన్యం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆర్థికాభివృద్ధి కోసం ఒకేదాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది అంటే.. పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, జనాభా విస్ఫోటనం, భూతాపం ప్రమాదకర స్థాయిలో పెరగడం, సంపన్న అగ్రరాజ్యాల స్వార్థం పెరిగిపోవడం, కొందరు చేసే పాపాలకు అందరూ బలైపోయే దురవస్థ వచ్చేసింది.వేల సంవత్సరాల వ్యవధిలో ప్రకృతి సిద్ధంగా సాగాల్సిన వాతావరణ మార్పులను విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల విడుదల ద్వారా ప్రకృతి మరింత విధ్వంసం అవుతోంది.
60 ఏళ్ల కాల వ్యవధిలో అమెరికా కాలుష్య విసర్జకాలు సుమారు 5070 కోట్ల టన్నులు. అమెరికా కంటే నాలుగున్నర రేట్లు జనాభా వున్న చైనా ఉద్గారాలు 1570 కోట్ల టన్నులు. భారత్ వెదజల్లిన ఉద్గారాలు 420 కోట్ల టన్నులు.
వీటి పర్యావసనం ఏంటంటే 2040 నాటికి ఆర్కిటెక్ లో మంచులేని ఖండంగా మారుతుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. దానివల్ల అక్కడ నివసించే పోలార్ బేర్ జాతి అంతరిస్తుంది. ఆసియాలో పెద్ద నదులకు ఆలవాలమైన హిమాలయన్ గ్లేసియర్స్ చాలా వేగంగా కరిగిపోవడం వల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ లెక్కల ప్రకారం హిమాలయ హిందుకుష్ ప్రాంతంలో యాబైకోట్ల జనాభా ప్రమాదంలో పడిపోతుంది. 1880 నుంచి విస్తృత స్థాయిలో జరుగుతున్న శిలాజ ఇంధనాలను మండించడం వల్ల పారిశ్రామికీకరణ, మన భూ ఉష్ణోగ్రత 2 డిగ్రీలసెల్సియస్ దిగువకు వచ్చేస్తుంది. దీనిని కట్టడి చేయకుంటే తరువాత అంతరించే జీవి కచ్చితంగా మానవుడే. భూతాపం పెరగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోయి, భూమండలంపై తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం వుంది.
విలయానికి ప్రధాన హేతువు కార్బన్ డై యాక్సైడ్. GREEN HOUSES GASES అంటే కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ లు సూర్యకిరణాలను పట్టుకొని, మానవ మనుగడకు అవసరమైన, పరిసర భూ ఉష్ణోగ్రతను 14.44 డిగ్రీల సెల్సియస్ దగ్గర వుంచుతున్నాయి. ఈ వాయువుల శాతం వాతావరణంలో బాగా పెరగడం వల్ల అవసరమైన దాని కంటే భూ ఉష్ణోగ్రత పెరిగి భూతాపానికి కారణం అవుతోంది. ఇంతకీ ఈ వాయువులు వాతావరణంలో ఎలా పెరుగుతున్నాయి? రవాణా వ్యవస్థకు అవసరమైన విద్యుత్ శక్తి తయారీకి వాడే బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజాలను మండించడం ద్వారా విపరీతంగా వాతావరణంలోకి CO2 వచ్చేస్తుంది. ఇదే ప్రధాన కారణం.
దీనికి పరిష్కారం ఏంటంటే..?
పర్యావరణ పరిరక్షణ అనేది ఓ మహోద్యమంగా సాగాలి. అందరిలోనూ పర్యావరణ జాగృతి కలిగే స్థాయిలో కార్యక్రమాలు వుండాలి.ప్రతి మనిషీ తన ఇంటి నుంచే ఈ పర్యావరణ పరిరక్షణకై నడుం కట్టాలి. స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కార్యాలయాలు… ఇలా అందరూ భూమాతను రక్షించే దిశగా అడుగులు వేయాలి.
మనవంతుగా మనం ఏం చేయవచ్చు?
కాలుష్యానికి హేతువులు ఎన్నో.. కానీ భూతాపానికి పరిష్కారం మాత్రం పచ్చదనమే.
1. ప్రతి సంవత్సరం 120 కేజీల ఆక్సిజన్ ను ఇచ్చే ఓ చెట్టును నాటడం వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించవచ్చు.
2. ఇంటిలో కంప్యూటర్ టేబుల్స్ పై ఓ చిన్న మొక్క పెట్టడం వల్ల అది సహజ శోషణకారిగా పనిచేసి కంప్యూటర్ రేడియేషన్ ను అరికట్టడమే కాకుండా గదిలో ప్రాణవాయువు స్థాయిని నిలుపుతుంది.
3. దగ్గర దూరాలకు మోటార్ బైక్ లేదా కారును వాడకుండా నడవడం లేదా సార్వజనిక వాహనాలను వాడడం ద్వారా 1 కేజీ కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది.
4. ప్లాస్టిక్,పాలిథిన్ ను సాధ్యమైనంత వరకు వాడకుండా వుండాలి. వాడిన వాటిని రీ సైకిల్ బిన్స్ లో పడేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
5.ఇంటిలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులను తSTAND BY MODE లో వుంచకుండా వాడేటప్పుడు మాత్రమే మెయిన్ స్విచ్ వేయడం ద్వారా విద్యుత్ ను ఆదా చేయవచ్చు.
6. ఆరు విద్యుత్ బల్బులు వాడడం కంటే ఒక COMPACT FLOURESCENT LAMP ను వాడడం ద్వారా వేడిని నియంత్రించవచ్చు.
7.పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో లభించే ప్యాకింగు చేసిన ఆహార పదార్థాలు, పానీయాలు, కేకులు, బర్గర్లు, పిజ్జాలకు స్వస్తిచెప్పి, స్థానికంగా దొరికే కూరగాయలను కొనడం ద్వారా అటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా CO2 ఉద్గారాన్ని కూడా తగ్గించవచ్చు.
8.ఉచితంగా దొరికే సూర్యరశ్శిని వాడుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును నియంత్రించుకోవచ్చు. అంటే పగటిపూట ఫ్యాన్లు, లైట్లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఇళ్ల నిర్మాణాలు వుండాలి.
9. నీటిని, విద్యుత్ ను ధనం లాగా పొదుపు చేయాలి.
10. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడవేయకుండా దానికి కేటాయించిన బిన్స్ లోనే వేయాలి.
11. అందరూ సమష్టిగా బాధ్యతగా మొక్కలు నాటాలి. వ్యర్థాలను జాగ్రత్తగా పారేయాలి. వ్యర్థాల పునశ్శుద్ధి, సామాజిక అడవుల పెంపకం లాంటి కార్యక్రమాలను చేయాలి. సభలలో, పుట్టిన రోజులలో తులసి మొక్కలు కానుకగా ఇవ్వాలి.
12. చివరగా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి. యోగాభ్యాసం, ప్రార్థన, మితాహారంతో జీవన శైలిని మార్చుకోవాలి. అప్పుడే అందరం పర్యావరణ అనుకూలంగా మారి ఈ భూమిని తరువాత తరాల వారికి పదిలంగా అందించగలుగుతాం.