భూమాతకు చేయాల్సిన దోహదం లభిస్తే… భూమాత ఊహకందని ఫలసాయం చేస్తుంది

(నేడు ధరిత్రి దినోత్సవం)

మానవుని మనుగడకు, సుఖప్రదమైన జీవనానికి ప్రధానమైన ఆధారం భూమి. మనం నివసిస్తున్నద భూమండలం మీదనే. మన కాళ్లు భూమి మీద లేకుండా మరెక్కడో వుంటే ఏమవుతుందో అందరికీ తెలిసిందే. మన శరీర పోషణకు, శరీర రక్షణకు , సుఖమయమైన లేదా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమయ్యే వస్తువులన్నీ భూమిలో నుంచి లభిస్తున్నవి.

అయితే ఓ ఆంగ్ల కవి చమత్కరించినట్లుగా బంగారం భూగర్భంలో వుంటుంది. దానిని కనిపెట్టి, తీయాలి. శుద్ధి చేసుకొని, ఆభరణాలుగా తీర్చిదిద్దుకొని ఉపయోగించాల్సి వుంటుంది. అంతేగానీ తీసుకుపోండయ్యా నన్ను అంటూ కొండ కొమ్ముల మీద మెరుస్తూ దర్శనమివ్వదు. అలాగే మానవుని జీవిత పోషణకు అవసరమయ్యే వస్తువులు ఏవీ రెడీమేడ్ గా ప్రకృతిలో విస్తారంగా లభించవు. అవి మనకు లభించాలంటే మానవుడు ఎంతో శ్రమించాల్సి వుంటుంది. భగవంతుడు మనకై కురిపించే దయామృతాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మానవ ప్రయత్నం అనివార్యం. ఈ మాత్రమైన షరతు కూడా విధించకపోతే ఈలోకం సోమరిపోతులతో నిండిపోతుంది.

చిన్న పిల్లలు రెండు పక్షాలుగా ఎదురెదురుగా నిలబడి ఒకరి ప్రశ్నకు మరొకరు జవాబిస్తూ పాడుకునే పాటలో పెద్దవారు సైతం గ్రహించే పాఠం వుంది. ఆ పాటే ఇదీ…

”ఎండలు కాసే దెందుకురా? మబ్బులు పట్టే టందుకురా
మబ్బులు పట్టే దెందుకురా? వానలు కురిసే టందుకురా
వానలు కురిసే దెందుకురా? చెరువులు నిండే టందుకురా
చెరువులు నిండే దెందుకురా? పంటలు పండేటందుకురా
పంటలు పండే దెందుకురా? ప్రజలు బతికేటందుకురా’’

అంటూ ఈ పాట సాగుతుంది. అయితే ఇటీవలి కాలంలో యథారాజ తథాప్రజా అనే సూక్తిని అనుసరించే కాబోలు, వానలు కురిసేదెందుకురా? అంటే చెరువులు నిండేటందుకురా అని జవాబు చెప్పడానికి బదులుగా పంటలు పండేటందుకురా అని చెప్పేస్తున్నారు. దానిని విన్న అయ్యవార్లు, పంతులమ్మలు వాటిని కనీసం సరిచేయడం లేదు. వర్షాలు బాగా కురిస్తేనే పంటలు సరిగా పండుతాయి. వర్షాలు సరిగా కురవకపోతే పంటలు పండటం తగ్గిపోతుంది అంటూ ప్రభుత్వాలు, ప్రణాళికావేత్తలు చెబుతూ వుంటే కుంటిసాకులు వీరికి తలకెక్కి వుంటాయి.

భగవంతుని కృప వల్ల వర్షాలు కురుస్తున్నవి. మానవ ప్రయత్నంలో ఆ వర్షపు నీటిని చెరువులలో, జలాశయాలలో భద్రపరుచుకుంటేనే పంటలు బాగా పండిచగలమని అవగాహన పెంచాలి. తమ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు సక్రమంగా చేపట్టటం లేదు. ఫలితంగా మనకు లభించే వర్షపు నీరు వరదపాలైపారి సముద్రంలో కలిసిపోతూ వుంది. నీటితో పంటలు తడిసే అవకాశం లభించక పంటలు ఎండిపోతున్నాయి.

పంట పండటం ఓ రకంగా చూస్తే, ప్రకృతి సహజ పరిణామం. భూమిలో విత్తనం పడితే, అది మొలకెత్తుతుంది. ఆ మొక్క క్రమంగా పుష్పిస్తుంది, ఫలిస్తుంది. జంతుకోటికి ఆకలిని తీర్చడానికి ఆలంబనమౌతున్నది. ప్రకృతలో సహజంగా జరిగే ఈ పరిణామానికి మానవుడు తన అనుభవాన్ని జోడించి ఏ సమయానికి ఏ విధంగా భూమికి సహకారం అందిచాలో, అలా అందించడం ద్వారా ఎక్కువ పంట పండే మార్గంలో భూమిని నడిపిస్తున్నాడు. భూమిని సారవంతం చేయడంలో దానిని గుల్లబార చేయడంలో, వ్యర్థమైన కలుపు మొక్కలను తొలగించడంలో భూమిని నీటితో తడపటంలో మానవుడు చేసే సహకారానికి భూమి ఎంతో సంతోషిస్తుంది. మానవుడు ఆశించిన దానికన్నా ఎక్కువగా ఫలసాయమిస్తుంది.

అయితే మానవుడు ఈ పనిచేసేటప్పుడు అతనిలో ప్రధానంగా వుండాల్సింది కర్తవ్య భావన.తాను కడుపునిండా తినడానికే గాక, తనను ఆశ్రయించుకొనిన వారికి, భూమాతను ఆశ్రయించుకొన్న జంతుజాలానికీ కూడా ఆహారం తన చేతుల మీదుగా సమకూర్చబడలనే కర్తవ్యభావన. కాని దురదృష్టమేమిటంటే ‘‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’’ అని కృష్ణుడు స్వయంగా ఉపదేశించిన వాక్యాలను మనం పెడచెవిన పెడుతున్నాం. భూమాతతో వ్యాపారం చేస్తున్నాం. ప్రభుత్వంలో వున్న వారు తాము నాటకాలాడుతూ, రైతులకు కూడా నాటకాలాడటం నేర్పిస్తున్నారు. తాము ఎంతో చేస్తున్నామని, ఇంకా ఎంతో చేయగోరుతున్నామని అయితే ఎవరెవరో అడ్డుపడి, తమ ప్రయత్నాలను సరిగా సాగనివ్వడం లేదని నిందించడం వారు అలవర్చుకున్నారు. ప్రభుత్వంలో వుండేవారి నుంచి ఈ అవలక్షణం ఒంటబట్టించుకున్న సామాన్య ప్రజలు రైతులు కూడా భూమిపట్ల, ప్రకృతి పట్ల తమ కర్తవ్యాలను పూర్తిగా నిర్వహించకుండా, తాము ఎంతో చేయగోరుతున్నామని, భూమికి సత్తువ చేకూర్చడం కోసం ఏవేవో ఎరువులు వేయదలుచుకొన్నామని, దానికోసం భారీగా అప్పులు కూడా చేస్తున్నామని, కాబట్టి భూమాత తమపై దయచూపించాలని వారు ఆశిస్తూ వుంటారు. ప్రభుత్వాలు, రాజకీయ నేతలు చెప్పే మాయ మాటలకు అమాయక ప్రజలు మోసపోవచ్చును. కానీ భూమాతను మోసగించడం ఎవరి వల్లా అయ్యేపనికాదు.

భూమాతకు లభించవలసిన దోహదం లభిస్తే, తప్పక భూమాత ఊహాతీతంగా ఫలసాయాన్నిస్తుంది. తద్వారా రైతులకు సిరిసంపదలను అందిస్తుంది. పాడి పంటలు ఒకదానికి మరొకటి పోషణనిస్తాయని మన దేశంలో రైతులందరికీ తెలుసు. కానీ ఇంగ్లీషు చదువులు చదివి, స్పెషలిస్టుల పట్ల విశ్వాసం, ఆరాధనా భావమూ పెంచుకుంటున్న ప్రజానీకం తామూ స్పెషలిస్టులు అయిపోవాలని, ఒకే రకం పంటను విరివిగా పండించాలని అనుకుంటున్నారు. పాడికి పంటకు మధ్య వుండే అవినాభావ సంబంధాన్ని అసలు గుర్తించడం లేదు.

జీవ వైవిధ్యాన్ని నిలిపి వుంచుకోవడంలోనే ఈ సృష్టికి పోషణ వున్నదని గ్రహించాలి. మన హ్రస్వ దృష్టికి ఏదైతే లాభదాయకంగా కనిపిస్తూ వున్నవో, వాటిని మాత్రమే వుండనిచ్చి, మిగిలిన వాటినన్నింటినీ నిర్మూింపజేయగోరటం ప్రకృతికి వ్యతిరేకంగా వ్యవహరించడమే. నిర్మూలించడానికి సాధ్యంకాని రీతిలో కత్రిమమైన వస్తువులను తయారు చేసి, వ్యర్థమైన స్థితిలో వాటిని గుట్టలు గుట్టలుగా పోగుపడనివ్వటమూ, వాటి నుంచి వెలువడే విష పదార్థాల, విషకిరణాల ప్రభావంతో నీరు, గాలి, భూమి కలుషితమయ్యే స్థితిని తెచ్చిపెట్టుకోవటం కూడా ప్రకృతిని దూషించడమే. ప్రకృతిని జయించాలనే అసంబద్ధమైన ఆశయాన్ని ఏర్పర్చుకొన్న మానవుడు ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రకృతి తనతో సహకరించడం లేదని వాపోతూ వుండటం ఒక విడ్డూరం, ఒక వంచనాభరితమైన నాటకం.

ఈ నాటకం సాగదు. అని కఠోర సత్యాన్ని మనం అందరం గుర్తించాలి. ప్రభుత్వాలలో, ప్రణాళికా సంఘాలలో వుంేడవారు ఎంతటి తెలివితేటలు గలవారైనా, వివిధ రంగాలకు తాము చేసే కేటాయింపులను అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ ఎంతగా మార్పులు చేసినా ప్రజలకు కావల్సిన ఆహారాన్ని అందించడం వారిచేతిలో పనికాదు.అది మట్టితో, గోసంతతి మల మూత్రాలతో నిత్య సంబంధంలో వుండే ప్రకృతి మాత సంతానంగా సామాన్య జీవితం గిపే ప్రజలే చేయగలరు. తినేవారు ఎక్కువై, పెట్టేవారు తక్కువైనప్పుడు అందరి ఆశలూ తీరవు. కాబట్టి ప్రకృతి నుంచి మన అవసరాలు తీరేవిధంగా ఫలసాయం లభించాలంటే భూమతకు జరగవలసిన సేవలు తప్పక జరగవలసిందే. భూమాతకు అనివార్యంగా జరగాల్సిన సేవలలో గోమాతకు జరగవలసిన సేవలూ ఇమిడి వున్నాయి. గోమాత అన్న శబ్దంలో భూమాత అనే అర్థమూ వుంది. గోమాతను సేవించి, గోవుకు ఆనందం కలిగించే వ్యక్తి భూమినీ సేవిస్తాడు, భూమాతకూ ఆనందం కలిగిస్తాడు. గోవును రక్షించే వ్యక్తి భూమిని కూడా రకరకాల వినాశనాల నుంచి విపత్తుల నుంచి రక్షించేవాడవుతాడు.

భగవంతుని కృప – నూరు శాతం మనకు లభించాలి. అది చక్కగా వినియోగించుకొని ఫలవంతం చేసుకోవాలి. అన్నట్లయితే మానవ ప్రయత్నం కర్తవ్య పాలన అనివార్యమనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అందులో మనం నిజాయితీగా వ్యవహరించి, మన లబ్ధిపొందడమే గాక, మన తోటి మానవులకు, జంతుకోటికి కూడా సుఖ సంతోషాలను పంచిపెట్టే విషయంలో కృత సంకల్పులం కావాలి.

– జాగృతి గోసంరక్షణోద్యమ ప్రత్యేక సంచిక నుంచి

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *