‘‘ప్లాస్టిక్’’ విముక్తులమవుదాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం

 (జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా..)
ఈరోజుల్లో ప్లాస్టిక్ అనేది నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది కానీ ప్లాస్టిక్ వినియోగం తర్వాత దాన్ని ఏవిధంగా డంప్ చేయాలో చాలామందికి తెలియదు. మన దేశంలో ప్లాస్టిక్ చెత్త నిజానికి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. స్వచ్చత పై 90 శాతం మందికి అవగాహన లేదు. మన దేహంలో ట్యూమర్ అనేది ఏవిధంగా క్యాన్సర్ కి కారణం అవుతుందో, ఈ ప్లాస్టిక్ చెత్త అనేది సైతం భూమికి మరియు పర్యావరణానికి క్యాన్సర్ అని చెప్పొచ్చు. మనకు ఆహారాన్ని అందించే మట్టి ఒకరకంగా మరణానికి చేరువవుతోంది. ఈ మట్టి ఆధారంగా జీవించే పశుపక్ష్యాదులు, మానవులు సైతం అందుకే క్యాన్సర్ తో మరణించే కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
అయితే ప్లాస్టిక్ నుండి వేరుపడే చిన్నపాటి రేణువులు ఈరోజు భూమి పై ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, మనం గుర్తించడం లేదు కానీ మనం తినే బియ్యంలో సైతం ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి‌. ఒకప్పుడు రైతులు గోనెసంచిల్లో (jute bags) ధాన్యాలు నింపేవారు, భధ్రపర్చుకునేవారు ఇంకా వ్యాపారులు సైతం అలాగే రవాణా చేసేవారు. అవి పర్యావరణ హితమైనవి, జనపనార చెట్టు నుండి వచ్చే నార నుండి వాటిని తయారుచేస్తారు కాబట్టి జనపనార సంచులు అంటారు. అయితే ఈరోజుల్లో వాటి స్థానంలో ప్లాస్టిక్ బస్తాలు వచ్చాయి, రైతుల పొలాల నుండి కస్టమర్ ఇంటి వరకు ధాన్యం అనేది ఈ ప్లాస్టిక్ బ్యాగుల ద్వారా రవాణా అవుతోంది. మనం సాధారణంగా విషయాలను సూక్ష్మంగా చూడుము కానీ ప్లాస్టిక్ బ్యాగ్ ని మనం కత్తెరతో కట్ చేస్తున్నా లేదా ఏదైనా కత్తితో పొడిచి దాన్ని చీల్చుతున్న సమయంలో సూక్ష్మాతి రూపంలో ప్లాస్టిక్ రేణువులు ధాన్యంలో కలిసిపోతాయి, కానీ దానికి ముందే ఎన్నో రేణువులు ఆల్రెడీ ఆ ధాన్యంలో కలిసిపోయి ఉంటాయి, అవి మన కంటికి కనపడవు కాబట్టి మనకు అంతా స్వచ్ఛంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఈ ప్లాస్టిక్ రేణువులు ఇప్పుడు భూమి పై ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా సముద్రంలో ఎక్కువగా ఇవి పేరుకుపోయాయి. చేపల్లో ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి, వాటిని తినడం ద్వారా కూడా మానవ శరీరాల్లోకి ప్లాస్టిక్ రేణువులు వచ్చి చేరుతున్నాయి. మన త్రాగే నీరులో సైతం ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి.
ఈ రోజుల్లో మనకు పాలతో సహా చాలా ఆహార పదార్ధాలు ప్లాస్టిక్ సంచీల్లో మన ఇంటికి వస్తున్నాయి. ఇందులో మరింత ప్రమాదకరమైనది ఏంటంటే వేడి వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో, ప్లాస్టిక్ కవర్ లలో ప్యాక్ చేసి డెలివరీ చేస్తున్నారు, చాలామందికి కనీస సోయి లేకుండా అలాగే తినేస్తున్నారు. ప్లాస్టిక్ అనేది వేడికి చాలా సులభంగా కరుగుతుంది, అలా ఆహార పదార్థాల్లో ప్లాస్టిక్ అవశేషాలు కలిసిపోతాయి, అది ఒకరకంగా విషం లాగా మారినట్టే. ఇంకొందరు అయితే వంటింట్లో ప్లాస్టిక్ గరిటెలు వాడతారు. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డుల పై కూరగాయలు తురుముతారు, దాని వల్ల ఎన్నో మైక్రో ప్లాస్టిక్స్ ఆహారంలో కలిసిపోతాయి.
plastic2
అయితే ఈ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కలిగే నష్టాల పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఎందుకంటే గత రెండు దశాబ్దాల కాలంగా ఈ ప్లాస్టిక్ వినియోగం పెరిగింది, నాటి నుండి ప్లాస్టిక్ రేణువులను మనమందరం మన శరీరంలో పంపుతూనే ఉన్నాయి అయినా చాలా మంది ఆరోగ్యంగానే ఉన్నారు కదా అనే ప్రశ్న వస్తుంది, కానీ ప్లాస్టిక్ అనేది ఒక మృత పదార్థం (dead item), మరియు అది మట్టిలో కలిసిపోవడానికి కనీసం వేయి సంవత్సరాల సమయం పడుతుంది, మన శరీరం భూమితో పోల్చుకుంటే అత్యంత సున్నితమైనది, కాబట్టి శరీరంలోకి ఈ మృత పదార్ధాన్ని పంపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందాం. అలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముందు పర్యావరణ హితమైన జీవన శైలిని మనం అలవాటు చేస్కోవాలి. వీలైనంతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, మరీ ముఖ్యంగా ఆహారం మరియు ప్లాస్టిక్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ కలపకూడదు.
ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు ఇవి చవక కానీ ఏదైనా విందు భోజనాలు ఏర్పాటు చేసే సమయంలో వీటి స్థానంలో వీలైనంతగా ప్రకృతి సహితమైన ఐటమ్స్ వినియోగించడం మేలు, కొంత ఖర్చు అవుతుంది కానీ దాని వెనుక మన వ్యక్తిత్వం అనేది మన అతిథులకు తెలుస్తుంది, వారి శ్రేయస్సు ముందు మనం చీప్ గా వ్యవహరించడం లేదు అనే సందేశం పంపాలి. మనల్ని చూసి ఇతరులు నేర్చుకుంటారు. ఆహారం ఇంకా ప్లాస్టిక్ ని కలిపే వారు చీప్ వ్యక్తులు అనేది అందరూ తెలుసుకోవాలి. మనం ఏ విషయాన్ని అయినా సూక్ష్మంగా గ్రహించే కనీస తెలివి కలిగి ఉండాలి, మనం సూక్ష్మంగా కొంత ఆలోచన చేయగలిగితే మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఎక్కడెక్కడ మన ఆహారంలో కలుస్తున్నాయి అనేది మనం అర్ధం చేస్కొవచ్చు. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు, ప్లాస్టిక్ ఏ జీవి ఆరోగ్యానికైనా హానికారం, కాబట్టి దాని వాడకాన్ని వీలైనంతగా తగ్గిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *