30 సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఎకోఫ్రెండ్లీ గణేషులే…
వినాయక చవితి వస్తోంది. దీంతో సహజంగానే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలనే తయారు చేయాలని బాగా ప్రచారం మొదలు పెడతారు. కొందరు దీక్షతో ఇదే వ్రతంలో వున్నారు. మరి కొందరు ఎప్పటి లాగే ప్లాస్టర్ విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే.. ఏకంగా 30 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాలోని మోరం గ్రామంలో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే వినియోగిస్తున్నారు. ఇదే వారి ప్రధాన వనరు. ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలైతే వున్నాయో.. ఆ కుటుంబాల సభ్యులందరూ నాలుగు నెలల ముందు నుంచే గణేష విగ్రహాల తయారీని ప్రారంభిస్తారు. ఇక బయటికి వెళ్లరు. ఇదే పనిలో వుంటారు. ఇక్కడ విగ్రహాలను కాగితం, స్వచ్ఛమైన పిండి, వెదురు కర్రలు వంటి పర్యావరణ అనుకూల పదార్థాలను మాత్రమే వినియోగించి, తయారు చేస్తారు. చాలా అందంగా వుండంతో పాటు పర్యావరణ సురక్షితంగా కూడా వుంటాయి. మట్టితో తయారు చేయడం కుదరదని, దానికి బదులు తాము కాగితాన్నే ఎంచుకున్నామని ఎల్లప్ప అనే విగ్రహ తయారీదారుడు తెలిపాడు. తానొక్కడినే కాదని, తమ కుటుంబీకులందమూ ఇదే వ్యాపారంలో వున్నామని, సంపాదన కూడా బాగానే వుందని తెలిపాడు.
అయితే.. మొదట్లో ఈ గ్రామంలో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడేవారు. డిమాండ్ బాగానే వుండేది. కానీ ప్రభుత్వం నిషేధించడంతో కళాకారులు కూడా చేయడం మానేశారు. మెళ్లి మెళ్లిగా వీరికి కూడా పర్యావరణంపై అవగాహన పెరిగి, మొత్తానికే మానేశారు. అయితే.. మట్టికి బదులు పేపర్ ను వాడుతున్నారు. మట్టిని వాడితే విగ్రహాల ఎత్తు పరిమితం అవుతుందని, కస్టమర్లు మాత్రం భారీ భారీ విగ్రహాలను ఇష్టపడుతుంటారని తెలిపారు. అయితే తాము కూడా పర్యావరణం గురించి ఆలోచించి, వారి డిమాండ్ ను పరిగణనలోకి తీసుకొని, కాగితం, స్వచ్ఛమైన పిండి, వెదురు లాంటి పదార్థాలను వాడుతూ, గణేష విగ్రహాలను తయారు చేస్తున్నామని తెలిపారు. కస్టమర్లు కోరుకున్న ఎత్తు, కోరుకున్న విధంగా తయారు చేస్తున్నామని, రకరకాల డిజైన్లు కూడా చేస్తామని తెలిపారు. తాము చేసే విగ్రహాలు కేవలం అరగంటలోనే నీటిలో పూర్తిగా కరిగిపోతాయని, జల జీవులకు, ప్రకృతికి కూడా ఎలాంటి హానీ కలగదని వివరించారు.
విగ్రహాల తయారీకి వేసవి కాలమే తమకు అనుకూలంగా వుంటుందని, ఒక్కో విగ్రహం తయారీకి కనీసం 10 రోజుల సమయం పడుతుందని విగ్రహ తయారీదారులు తెలిపారు. విగ్రహాలు సరిగ్గా ఆరాలి కాబట్టి, ఎండా కాలమే తమకు అనుకూలమని తెలిపారు. సాధారణంగా తాము జనవరిలో విగ్రహాల తయారీ ప్రక్రియను ప్రారంభించేస్తామని, ఎనిమిది నెలలు పూర్తిగా కష్టపడతామని వివరించారు. 30 ఏళ్లుగా తాము ఎకో ఫ్రెండ్లీ వినాయకులనే తయారు చేస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ప్రజలు కూడా చాలా మంది ముందే అడ్వాన్సులు ఇచ్చి, బుక్ చేసుకుంటున్నారని, వారికి కూడా పర్యావరణంపై అవగాహన పెరిగిందని విగ్రహ తయారీదారులు పేర్కొన్నారు.