తోటకూర
తోటకూర తినటం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. శరీరంలో ఉన్న అతివేడిని తగ్గించి శరీరంలో సమశీతోష్ణస్థితిని నిలిపి ఉంచుతుంది. ఋషిపంచమి వంటి పుణ్య దినాల్లో, వ్రతాల్లో దానం చేయతగ్గ పవిత్రశాకం.
తోటకూరలో అనేక రకాలు ఉన్నాయి. పెరుగుతోటకూర, కొయ్యతోటకూర, చిలుకతోట కూర, ఎర్రతోటకూర, ముళ్లతోటకూర మెదలైనవి. కొయ్యతోటకూర బాగా వేడిచేస్తుంది. కాబట్టే దీనిని బాలింతలకు, నంజు వ్యాధి కలవారికి విరివిగా వాడాలి. వాతత్వం కలవారికి ఈ కూర మేలు చేస్తుంది. ఉష్ణశరీరం కలవారికి గుండెలో నొప్పి, కొయ్యతోటకూరని మండు వేసవిలో కూడా పెంచుకొవచ్చు. ముళ్లతోటకూర ఆకులని పప్పు కూరగా వండి పెడితే బాలింతలకు పాలు పడతాయి. ఈ మొక్కల్ని తెచ్చి ఎండిరచి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని బట్టలసోడాకు బదులుగా చాకలివారు వాడతారు. దీనికి కారణం ముళ్లతోట కూరలో క్షారపదార్థం విస్తరించి ఉందని తెలుస్తుంది. సోడాపెట్టి ఉతికిన బట్టలు కంటే ముళ్లతోట కూర బూడిద పెట్టి ఉతికే బట్టలు చాలా రోజులు మన్నుతాయి. అలాగే సోడా పెట్టిన వాటికంటే ఇవి శుభ్రంగా ఉంటాయి. చిలకతోట కూర పెరళ్ళలో బాగా ఎదుగుతుంది. పెరుగుతోట కూర ఆకులు నూరిన ముద్దకడితే గాయాలు మానుతాయి. మలబద్ధకాన్ని తొలగించడంలో ఆకుకూరలలో తోటకూర సాటిలేనిది. అన్నిరకాల తోటకూరలో ఇనుము ఉంది అని శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది.
– ఉషాలావణ్య పప్పు