ఈమె మగ్గం ఆధ్యాత్మిక వ్యక్తీకరణకు, సాహిత్య పరిరక్షణకు వారధి
ప్రపంచానికి దూరంగా.. ఒంటరి గదిలో.. ఒక్కో దారం అల్లుతూ.. అందమైన రూపాలు సృష్టించే నేత కార్మికుల్లో ఆమె ఒకరు. అయితే అందరిలా అందమైన డిజైన్లతో ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలని ఆమె అనుకోలేదు. తనకంటూ ప్రత్యేకత ఉండాలనే ఆలోచనో? లేదంటే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై ఉన్న ప్రేమో? కారణం ఏదైనా మన చరిత్రను, దేశ గొప్పతనాన్ని తన పనిలో నిక్షిప్తం చేయాలని అనుకుంది. అందుకే తన ప్రతి అల్లికతో ప్రపంచానికి భారతీయతను పరిచయం చేసేందుకు కష్టపడుతోంది. ఆమె పేరే జ్యోతి బోరా దత్తా. అస్సాంలో సారింగియా బాపూజీ పథ్‌కు చెందిన ఆమె.. వస్త్రాలపై జాతీయ గీతం, భారత రామాయణ ఘట్టాలు, భక్తిగీతాలు, కవితలను అల్లుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది.
అయితే దీనికి కొంత పూర్వ నేపథ్యం కూడా వుంది. తన భర్త ప్రతి రోజూ 16 వ శతాబ్దపు సాధువు మాధవ దేవ్ రాసిన కవితా సంకలనం ‘‘గుణమాల’’ ను ప్రతి రోజూ పారాయణ చేసేవాడు. అప్పుడు జ్యోతి బోరాదత్తా పక్కనే కూర్చునేవారు. ఈ సమయంలో దీనిని వస్త్రంలో నేయవచ్చా? అన్న ఆలోచన వచ్చేది. ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేసింది. మొత్తం గుణమాలను గమోచాగా నేసేసింది. చేతితో అస్సామీ సంప్రదాయంలో టవల్ ను నేసేసింది. ఇది పూర్తి కావడానికి 11 నెలల సమయం పట్టింది. ప్రతి పద్యమూ ఆ వస్త్రంపైనే నేసేసింది.
దీని తర్వాత 2022 లో జ్యోతిబోరా దత్తా అస్సామీ సాధువులైన శ్రీమంత్ శంకరదేవ్, మాధవ దేవ్, గోపాల్ అటా బోధనలను కూడా 4.8 మీటర్ల పొడవైన గమోచాపై నేసింది. దీని ద్వారా ఈ పని మరింత విస్తరించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈమె పేరు మార్మోగింది. ఆ డిజైన్‌లో బోర్గీత్ (భక్తి పాటలు), భాతిమాస్ మరియు ఇతర పవిత్ర రచనలు కూడా ఉన్నాయి, ఇది సాంప్రదాయ నేతగా కాకుండా ఆధ్యాత్మిక కళాకారిణిగా ఆమె ఖ్యాతిని మరింత పటిష్టం చేసింది.
అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ వైష్ణవ సంప్రదాయంలో పొందుపరిచిన నాటకం ‘‘రామ్ విజయ్’’. దత్తా దీనిని రెండు భాగాలుగా పొందుపరిచారు.2022లో పూర్తయిన మొదటి విభాగం, అద్భుతమైన 12.5 మీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు నేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది.రెండో భాగం 2020 లో పూర్తైంది. 7.5 మీటర్లు పొడవు ఉంది. ఆమె శ్లోకాలను చేర్చడమే కాకుండా, రాముడు, సీత, లక్ష్మణుడు మరియు ఋషుల బొమ్మలను కూడా వస్త్రంలో క్లిష్టంగా నేసింది.దీనిని జిల్లా అధికార యంత్రాంగం అయోధ్య రామ మందిరానికి అధికారికంగా అప్పగించారు కూడా.
2022లో, ఆమె భాగవత పురాణం నుండి మత గ్రంథాలను ఒకే నెలలో నేయడం ద్వారా మరొక మైలురాయిని సాధించింది. పైగా అత్యంత వేగంగా ఈ పని చేశారు.అతిపెద్ద వస్త్రంపై కేవలం 24 గంటల్లోనే నేసేసింది. దీనిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాలాకు బహుమతిగా అందించింది. అదే సంవత్సరం మరో పని కూడా సాధించింది. శంకర్‌దేవ్ కూర్చిన 18 అడుగుల 10 అంగుళాల కొలతలు కలిగిన 35 బోర్గీట్‌లతో కూడిన వస్త్రం, ఆరు నెలల్లోనే పూర్తి చేసింది.

దీని తర్వాత మరో ప్రాజెక్టును చేపట్టింది. తన వస్త్రాలలో దేశ భక్తి గీతాలను అల్లడం ప్రారంభించింది.ఆరు నెలల్లోనే, ఆమె భారత జాతీయ గీతం, అస్సాం రాష్ట్ర గీతం మరియు వందేమాతరాన్ని అస్సామీ మరియు హిందీ రెండింటిలోనూ నేసింది. దీంతో ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది.
అయితే.. ఇదంతా తాను చేసింది వ్యాపారానికి మాత్రం కాదని జ్యోతి బోరా తేల్చి చెప్పింది. లాభం కోసం కూడా కాదని ప్రకటించింది. తన భారతీయ సంస్కృతికి, గురువులకు, దేశానికి వీటిని అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది.
2023లో, ఆమె చేసిన కృషికి భారత దళిత సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డు వరించింది. అలాగే 76 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసా పత్రంతో సత్కరించింది.తన మగ్గం దగ్గర కూర్చుని, చేతిలో దారం పట్టుకుని, పక్కనే గ్రంథాలు తెరుచుకుని, జ్యోతి బోరా దత్తా కేవలం బట్ట నేయడం మాత్రమే కాదు, వారసత్వాన్ని కూడా నేస్తోంది.ఆమె మగ్గం ఆధ్యాత్మిక వ్యక్తీకరణ, సాహిత్య పరిరక్షణ మరియు జాతీయ వేడుకలకు ఒక మాధ్యమంగా మారింది.