‘‘భూమి మీద దేవుడు’’… పూర్తి ఉచితంగా వైద్య సేవలతో ప్రజల మన్ననలు
ఈ కాలంలో వైద్యం అంటేనే ఖరీదు. పేద వారికైతే ఆమడ దూరం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందుతున్నా.. అంతంతే. దీంతో చాలా మంది వైద్యానికి దూరమవుతున్నారు. కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. కానీ… కర్నాటకలోని దావణగెరేకి చెందిన ఎస్.ఎం. యేలి (87) అనే వైద్యుడు మాత్రం ఇప్పటికీ ఉచితంగానే వైద్యాన్ని అందిస్తూ.. నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆయన్ను ‘‘ఈ భూమిపై వున్న దేవుడు’’ అని అందరూ పిలుచుకుంటారు. కూలీ కార్మికులు, నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాల వారు, ఇలా ఒక్కరేమీ.. అందరికీ ఈయన ఉచితంగానే వైద్యం అందిస్తారు.
1969 లో యేలీ తన వైద్య వృత్తి ప్రస్థానాన్ని ప్రారంభించారు. దావణగెరెలోని వైద్య కళాశాలలో పనిచేశారు. లెక్చరర్ నుంచి విభాగాధిపతి (HOD) స్థాయి వరకూ ఎదిగారు. పదవీ విరమణ తర్వాత కూడా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకవేళ కాస్తో కూస్తో తీసుకున్నా.. 10 రూపాయల లోపే తీసుకుంటారు.
తన ఇంటి పక్కనే ఓ చిన్న గదిలో ఆస్పత్రి ప్రారంభించారు. జ్వరాలు, గాయాలు మోదలు గుండె సమస్య, శ్వాసకోశ వ్యాధుల వరకూ అన్నింటినీ ఉచితంగానే చూస్తారు. రోగులు మరీ బలవంతపెడితే ఫీజు తీసుకుంటే 10 రూపాయ లోపే. ఈయన కోసం రోగులు దావణగెరె నుంచి మాత్రమే కాకుండా బెంగళూరు, చిత్రదుర్గ, రాణేబెన్నూర్, హరిహర్, హరపనహళ్లి, హావేరి వంటి నగరాలు, పట్టణాల నుంచి కూడా తరలి వస్తారు.
‘‘దేవుడు ఎక్కడో లేడు. రోగిలోనే వుంటాడు. రోగిలోనే నేను దేవుడ్ని చూస్తాను. కాబట్టి డబ్బు ఎందుకు తీసుకోవాలి? డబ్బులు తీసుకోను. నాకు పెన్షన్ వస్తుంది. అది సరిపోతుంది. నా జీవన శైలి అత్యంత సాధారణమే. నా కుమారుడు కూడా వైద్యుడే. కోడలు కూడా వైద్యురాలే. నాకు రోగుల నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు.’’ అని అంటారు. చివరి వరకూ రోగులకు ఇలా సేవ చేయాలనే అనుకుంటున్నా’’ అని తెలిపారు.
ఓ రోగి మాట్లాడుతూ ‘‘50 సంవత్సరాలుగా వస్తున్నా. చాలా పాత పేషెంట్ ని నేను. మేము ఫీజు చెల్లించాలని చూసినా.. సున్నితంగా తిరస్కరిస్తారు. ఆ డబ్బులతోనే మందులు కొనుక్కోమని సలహా ఇస్తారు. ఇన్ని సంవత్సరాలు గడచినా.. ఈ వైద్యుడి దగ్గరికే మా కుటుంబం మొత్తం వస్తుంది. ఆ తర్వాతే మరే వైద్యుడినైనా సంప్రదిస్తాం’’ అని తెలిపింది.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో వుంటారు. ప్రతి రోజూ డజన్ల కొద్దీ రోగులు వస్తారు. చాలా మంది కృతజ్ఞతాపూర్వకంగా డబ్బుకు బదులు పండ్లు, కూరగాయలు, ఇంట్లో చేసిన ఆహారాన్ని తీసుకువస్తారు. అయినా.. ఆ వైద్యుడు ఎవ్వర్నీ ఏమీ అడగరు.
ఇలా ఉచిత వైద్య సేవలు చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. ఆయన అంకితం చెప్పలేనిది. ఈతరం వైద్య విద్యార్థులు వైద్య నీతిని, సామాజిక నీతిని ఈయన నుంచి తీసుకోవాలి. వైద్యులందరికీ ఆదర్శప్రాయుడు.