హిందువు అందర్నీ ప్రేమిస్తాడు : అవధేశానంద గిరి మహారాజ్ స్వామీజీ
లోక్‌సభలో హిందుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన తప్పుడు వ్యాఖ్యలను హిందూ సమాజం తీవ్రంగా తప్పుబడుతోంది. ఇదే వ్యాఖ్యలపై స్వామి అవధేశానంద గిరి మహారాజ్ స్వామిజి తీవ్రంగా స్పందించారు. హిందువు అనేవాడు ప్రపంచం మొత్తాన్ని ప్రేమిస్తాడని, ప్రతిదానిలో దేవుడ్ని చూస్తాడని అన్నారు. హిందువు అహింసావాది అని, సమన్వయం కలిగిన వ్యక్తి అని అభివర్ణించారు. ఇలాంటి లక్షణాలు హిందువులో ఇంకా అనేకం వున్నాయని, విశ్వాన్నంతటినీ తన కుటుంబంగా హిందువులు భావిస్తారని, అలాగే ప్రతి ఒక్కరి క్షేమం, సంతోషం, గౌరవాన్ని కోరుకోవడం అనేది హిందువులు నిరంతరం చేస్తారని, అది తమ ధర్మంగా భావిస్తారని తెలిపారు. అలాంటి హిందువులను హింసాత్మకులు అనడం లేదా ద్వేషాన్ని వ్యాపింపచేసేవాడిగా అభివర్ణించడం సబబు కాదన్నారు. ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా మొత్తం సమాజంతో పాటు హిందువులను చులకనగా చేసి మాట్లాడడమే అవుతుందని స్పష్టం చేశారు.
అందరినీ కలుపుకొని, అందరినీ గౌరవించే సమాజం హిందూ సమాజమని, అన్ని కులాలు, అన్ని మతాలకు, జీవులందరి పట్ల సమానత్వాన్ని హిందూ ధర్మం చూపిస్తుందని, రాహుల్ పదే పదే హిందువులు హింసాత్మకులు, వారు 24 గంటలూ హింసకు పాల్పడతారని అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విచారం కూడా వ్యక్తం చేస్తున్నాని తెలిపారు. సభలో ఇతర నాయకులు కూడా వున్నారని, కాబట్టి వారు ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని స్వామీజీ డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యల పట్ల సాధు సమాజం ఆక్రోశాన్ని వెలిబుచ్చుతోందని, రాహుల్ చాలా సున్నితమైన, దయగల భావాలున్న వారిపై దాడి చేశారన్నారు. రాహుల్ ఇలా చెప్పడం ద్వారా అతను మొత్తం హిందూ సమాజాన్ని కించరిచారని, ఈ మాటలు సరైనవి కావన్నారు. ఆయన వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పి, వారి మాటలను వెనక్కి తీసుకోవాలని అవధేశానంద గిరి స్వామీజీ డిమాండ్ చేశారు.