విమానాలకు బెదిరింపులు చేస్తే వారంతా ‘‘నో ఫ్లైలిస్ట్’’ లో చేర్చుతాం : కేంద్రం
ఈ మధ్య విమానాలకు బాగా బెదిరింపులు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అలాంటి వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. వారిపట్ల కఠినంగా వుండేందుకు చట్టాలను సవరిస్తున్నామని పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారు విమానాల్లో ప్రయణించే వీల్లేకుండా వారిని ‘‘నో ఫ్లైలిస్ట్’’ జాబితాలో చేరుస్తామని ప్రకటించారు. ప్రయాణికుల రక్షణ విషయంలో రాజీపడమని స్పష్టం చేశారు. పౌర విమానయాన భద్రతకు ప్రమాదం కలిగించే చట్టవిరుద్ధ చర్ల అణచివేత చట్టం 1982 లో సవరణకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. తద్వారా విమానం గ్రౌండ్ లో వున్నప్పుడు చేసే ఇలాంటి తప్పులను కోర్టు ఉత్తర్వులు లేకుండానే అరెస్ట్ చేసే నేరాలుగా పరిగణించే అవకాశం వుందని వివరించారు. ఒక్క వారంలోనే దాదాపు 100 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగానే ఎక్కువ వస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.