నిద్రలేవడం ఒక సంస్కారం

కుటుంబప్రబోధన్‌

నిద్ర మన జీవితానికి చాలా అవసరం, మనం చేస్తున్న శారీరక, మానసిక శ్రమవల్ల శరీరం అలసట చెంది మన ఇంద్రియాలు ఏకాంతం కోరుకుంటాయి. అప్పుడు మన స్వప్నావస్థలో ఆనందం అనుభవిస్తాం. సరియైన సమయంలో నిద్రించడంవలన దేహానికి మనస్సుకు సుఖం కలుగుతుంది. పసిప్రాయంలో పిల్లలకు నిద్రే ఆరోగ్యం. వయసు ఎదిగే కొద్దీ చదువుకునే పిల్లలు 8 గంటల పాటు; వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో ఉన్నవారు 6-7 గంటలపాటు; వృద్ధులు మరికొంచెం ఎక్కువ నిద్రపోవాలి. ఇదో ఆరోగ్య సూత్రము.

క్రమం తప్పని ఆహార, విహార, పానీయ, నిద్రా, విశ్రాంతులే సంరక్షణ నిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం 70 ఏళ్లలోపు వాళ్లు పగలు పడుకోకూడ దంటారు (అనారోగ్యం ఉంటే తప్ప). రాత్రిపూట ఉద్యోగం చేసేవారు పగలు నిద్రపోవడం సహజం, దాన్ని ఆపలేం. నిద్ర పోవడం కర్తవ్యం మర్చి పోయేందుకు కాదు. సమయానికి నిద్రలేచి కర్తవ్యం గుర్తుచేసుకోవడం కోసం అని తెలుసు కోవాలి. నిద్రపోవడానికి ఒక గంట ముందు మన ఫోన్‌, టి.వి. అన్నీ దూరం పెట్టాలి. మనం చేస్తున్న సత్కర్మల తాలూకు చక్కటి స్వప్పం మనం నిద్రలో అనుభూతి చెందాలి. పడుకునేముందు ‘రామ స్కందం హనుమంతం’ అంటూ చెడు స్వప్నాలు రాకూదని మనం ప్రార్థిస్తాం. నిద్రలేవడం కూడా ఒక సంస్కారం. నిద్రలేస్తూనే ‘మళ్లీ తెల్లారిందా’ అనే విసుగుతో కాకుండా నవ్వుతూ, ప్రకృతి ఒడిలో మళ్లీ మనం కర్తవ్య పథంలో సాగేందుకు లేస్తున్నాం అనే ఆలోచనతో నిద్రలేవాలి. అందుకే ‘కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం’ అన్న శ్లోకం చదువుతూ రెండు అర చేతులను చూచుకొని మనసులో సంకల్పం చేసుకోవాలి. ఇది కేవలం ధార్మిక ప్రక్రియ కాదు. ఇది వైజ్ఞానికం కూడ.

మన దేహం ఒక విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ ఉత్పాదన, విసర్జన జరుగుతూనే ఉండాలి. మన కన్నుల ద్వారా విద్యుత్‌ ప్రసారం జరుగుతుంది. మన కన్నులు కూడా ఒక కేంద్రం. నిద్రావస్థలో ఈ విద్యుత్‌ విసర్జనకు అవకాశంలేదు. కనుక ఉదయం మేలుకోగానే మరొకరిని చూడకుండా మన చేతులనే చూడడం వల్ల దేహంలో ఉన్న విద్యుత్తు, కన్నుల నుండి విసర్జించబడే విద్యుత్తు ఒకటిగా చేరి అధిక విద్యుత్తు నిష్క్రియమవుతుంది. మరొకరికి హాని జరగదు.

రాత్రంతా విశ్రాంతిగొన్న కళ్లను చేతి మొదలు, మధ్య, చివరి భాగాలలో ప్రసరిం చడం వల్ల కంటి గ్రుడ్డు సులభ వ్యాయమంతో మళ్లీ క్రియాన్విత మవుతుంది. రాత్రంతా నిద్రలో ఉండి మనం మాట్లాడం. కనుక మనం ఉచ్చరించే శ్లోకంలోని ‘క’ అనే వ్యంజనాక్షరం వల్ల మన ధ్వని పేటికకు కూడా వ్యాయామం జరుగుతుంది. సంపత్తుకు లక్ష్మిని, ఆ లక్ష్మిని సంపాదించేందుకు కావలసిన సరస్వతిని, ఆ సరస్వతిని సంపా దించిన తరువాత చదువును కార్యరూపంలో ఉంచేందుకు కర్మలు చేసేందుకు, కర్తవ్యసాధనకు గోవిందుణ్ణి స్మరిస్తాం. ఉదయం లేచి ‘ఎవరి ముఖం చూశామో! ఏ ముహర్తాన లేచామో!’ అనే మాటలు మన నోటివెంట రాకుండా ఈ శ్లోకం ఉచ్చరించాలి. రెండు చేతులు రుద్దుకొని మొహానికి అద్దుకోవాలి.

మంచం మీద కూర్చుని ‘‘సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే’’ అని చదివి భూమిని స్పర్శించి నమస్కరించాలి. మనకు పంట, ఫలాలను అందించి మనం జీవించడానికి సహకరిస్తున్న అమ్మ ఈ భూమాత. కాని రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కాళ్లతో తొక్కుతాం. నన్నుక్షమించు తల్లీ! అని నమస్కరిస్తూ భూమి మీద కాలుపెట్టాలి.

మన పక్కను సరిచేసుకోవాలి. దుప్పటి మడతపెట్టాలి. వృద్ధులకు ఈ విషయంలో పిల్లలు సహకరించాలి. ఒక అరగంటసేపు మొబైల్‌ జోలికి వెళ్లకుడదు. నిద్రలేవగానే తులసి మొక్కను, సూర్యోదయాన్ని, గోవును చూడమన్నారు. గోపురం, దీపం, సుమంళిని చూడమన్నారు. సూర్యోదయం ముందే లేవాలి. రాత్రి నిద్ర పోయేముందు ఆ రోజు చేసిన మంచిపనులను స్మరించుకోవడం, జరిగిన చెడును మర్చిపోవడం, ఉదయం నిద్రలేవగానే ఆరోజు చేయాల్సిన పనుల ప్రణాళిక వేసుకోవడం, జీవిత కాలంలో ఒకరోజు గడిచి పోయినా ఘనంగా గడిపామని, ప్రతి రోజూ ఒక పవిత్ర ప్రయత్నం సఫలమయ్యేందుకు ఉద్దేశిం చిందని భావించాలి. ఎదురయ్యే ప్రతి ఉదయం మనల్ని చైతన్య వంతులుగా ఉంచుతుంది.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *