వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన డైరెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, భూగర్భ జలాలు తగ్గడం, బోరు బావుల్లో నీరు ఇంకిపోవడంతో ఉద్యాన పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను అధిగమించేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సూచించిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించాలని, వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. జూన్ నెల వరకు జిల్లాల్లో ఉద్యాన పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి వున్న పామాయిల్ తోటల్లో తేమ బాగా వుండేట్లు రైతులను చైతన్యవంతం చేయాలన్నారు.