చరిత్రతో చైతన్యం : అరవింద రావు
ప్రజలకు చరిత్రను తెలియజేస్తూ వారిని చైతన్యవంతులుగా చేయాలని, చరిత్ర గురించి తెలుసుకోకుంటే అది మనల్ని మింగేస్తుందని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పూర్వ డీజీపీ కె.అరవింద రావు హెచ్చరించారు. చరిత్రలో జరిగిన సంఘటనలను రచయితలే ప్రజల ముందు ఉంచగలరని, దీనికి సంబంధించి పరిశోధనాత్మక విశ్లేషణ చాలా అవసరం అన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం కొన సాగుతున్న హింసాకాండ నేపథ్యంలో.. రాబోయే రోజులలో హిందువులపై దాడులు జరగకుండా వుండాలంటే ఏం చేయాలో కూడా లోతైన పరిశోధనలు చేసి, రచయితలు వ్రాయాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయ నేతలకి అవగాహన తేవాలని, లేదంటే వారు తీసుకొనే కొన్ని నిర్ణయాల వల్ల ఓ వర్గం తమకు అన్యాయం జరిగిందని చెబుతూ.. మరింత రెచ్చిపోయే ప్రమాదం వుందని అరవిందరావు సూచించారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా జరిగిన ‘‘బంగ్లాదేశ్ హిందువుల అజ్ఞాత మారణకాండ’’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బంగ్లాదేశ్ హిందూ శరణార్థుల చేదు అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ హిందూ శరణార్థి ప్రభీర్ కుమార్ మండల్ మాట్లాడుతూ తాను బంగ్లాదేశ్‌లో పుట్టానని, కానీ.. పెరిగింది అంతా తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోనే అని తెలిపారు. 1994లో తనకు సంఫ్‌ు పరిచయం అయ్యిందని, ఆ వేదికగా తమ బాధలు చెప్పు కుంటున్నానని తెలిపారు.
1970లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా మారిందని, ఈ విభజన తర్వాత బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ మతోన్మాదులు దాడులు చేయడం ప్రారంభించారన్నారు. అలాగే మహిళలపై అత్యాచారాలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చేశారన్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవడానికే తాము ఇక్కడికి వచ్చామని, లేదంటే మతమార్పిళ్లు జరిగేవన్నారు.
ఆర్గనైజర్ పత్రిక సౌత్ ఇంచార్జి కుంటి సురేందర్ మాట్లాడుతూ.. శరణార్థులను ఇంటర్వ్యూ చేయడానికి తాము స్వయంగా కాగజ్‌నగర్‌కి వెళ్లామని తెలిపారు. శరణార్థుల గాథలు ఇప్పటి వరకు పుస్తకాల్లో చదవడమే వుండేదని, కానీ.. ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోగలిగామని చెప్పారు. వారి కళ్ల ముందే వారి కుటుంబీకులను ఎత్తుకెళ్లిన సందర్భాలూ వున్నాయని, వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచామని సురేందర్ తెలిపారు. అలాగే మరో కుటుంబం బంగ్లాదేశ్ నుంచి భారత్‌కి సరిహద్దు ద్వారా రావడానికి 45 గంటల సమయం పట్టిందని, రాత్రి పూట పొలాలగట్ల నుంచి వచ్చారన్నారు. ఈ సమయంలో ఒకరు చనిపోయారు కూడా అని తెలిపారు. ఇలాంటి భయంకర పరిస్థితులు వున్నాయని ఇవన్నీ పుస్తకంలో పొందుపరిచామని తెలిపారు.
‘‘బంగ్లాదేశ్ హిందువుల అజ్ఞాత మారణకాండ’’ పుస్తక అనువాదకురాలు, సంవిత్ ప్రకాశన్ సభ్యురాలు నడిరపల్లి పరిమళ మాట్లాడుతూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఎదుర్కొన్న సంఘటనలు జరిగిన సందర్భంలో ఆయా వ్యక్తులపై పడిన ప్రభావాలను ఈ పుస్తకం విశ్లేషించిందన్నారు.
సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ.. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతంలోని శరణార్థుల జీవిత గాథలను డాక్యుమెంట్ చేయడం జరిగిందని, ఈ పుస్తకాన్ని కన్నడం నుంచి తెలుగులోకి అనువాదం చేశారని తెలిపారు. ఈ పుస్తకానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముందు మాట రాశారన్నారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా సంవిత్ ప్రకాశన్ సంస్థ నుంచి చాలా పుస్తకాలు ప్రచురితం చేశామని పేర్కొన్నారు.
ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడిరపల్లి ఆయుష్ పుస్తకాన్ని గురించి మరిన్ని వివరాలు అందిస్తూ మొదటి 15 అధ్యాయాలు కన్నడం నుంచి తెలుగులోకి వచ్చాయన్నారు.