అయోధ్యకు బాలరాముడొచ్చాడు..

అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామ మందిర ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. స్వామివారికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించి పోయింది. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు.

ప్రాణప్రతిష్ఠ సమయంలో గగనవీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ క్రతువుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌) సర్‌ సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొ న్నారు. ప్రాణప్రతిష్టకు ముందు పుజాసామాగ్రితో ఆలయంలోకి ప్రవేశిస్తోన్న వీడియోను మోదీ షేర్‌ చేశారు. ‘ఈ దివ్యవేడుకలో భాగమైనందుకు నాకు అంతులేని ఆనందంగా ఉంది’ అని ఉద్వేగానికి గురయ్యారు.

రామల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిరది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్‌ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు అకట్టుకున్నాయి.

అపురూప క్షణాలను వీక్షించిన ప్రముఖులు

ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *