బీహార్‌లో అయోధ్య తరహా రామాలయం
అయోధ్య రామాలయం.. ఈ మాట వినగానే ఇది శ్రీరామునికి సంబంధించిన ఘనమైన ఆలయం అని మనకు అనిపిస్తుంది. అయితే దీనికి మించిన ఆలయం బీహార్‌లో నిర్మితమవుతోంది. పైగా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కూడా సంతరించుకోనుంది. బీహార్‌లోని తూర్పు చంపారణ్ జిల్లాలో కేసరియా-చాకియా రహదారిపై నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ పనులు 2023, జూన్ 20 నుండి ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మహావీర్ టెంపుల్ ట్రస్టు కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ తెలిపారు. రెండవ దశలో 26 అడుగుల ఎత్తున ఉండే ప్లింత్‌ను నిర్మిస్తారు. దీన్ని పటిష్టం చేసేందుకు 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో కాంక్రీట్ పైకప్పును నిర్మిస్తారు. ఆ తర్వాత మూడు అంతస్తుల నిర్మాణం సాగనుంది. ఒక్కో అంతస్తు 18 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.
22 దేవాలయాల సముదాయమైన ఈ ఆలయంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా దృశ్యాలు కనిపించనున్నాయి. అలాగే ప్రధాన దేవతల ఆలయాలు నిర్మితం కానున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ఏడాదిన్నర, రెండేళ్లలో పూర్తి చేయాలని మహావీర్ టెంపుల్ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ రామాయణ దేవాలయ రెండో దశ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రధాన శిఖరం 270 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అయోధ్యలో రామ మందిరం కంటే అతిపెద్ద రామాలయంగా పేరు తెచ్చుకోనుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు.