అదే రాముడికి నిజమైన పూజ
– డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, ఆర్‌ఎస్‌ఎస్
అయోధ్యలో ప్రాణపత్రిష్ఠ సందర్భంగా ప్రత్యేక వ్యాసం
మన భారతదేశపు శతబ్దిన్నర చరిత్ర విదేశీ దురాక్రమణదారులతో సాగించిన నిరంతర సంఘర్షణతో నిండి ఉంది. ప్రారంభంలో కొద్ది మంది, అప్పుడపుడు ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం (సికందర్ దాడి) ఈ దేశంపై దాడి చేసే వారు. కానీ ఆ తరువాత ఇస్లాం పేరున పశ్చిమం నుండి సాగిన దాడులు ఇక్కడి సమాజాన్ని తీవ్రంగా నష్టపరచడమేకాక వేర్పాటువాద ధోరణిని కూడా తీసుకువచ్చాయి. సమాజంలో నిరాశ, నిస్పృహ, పరాజయ భావాలను నింపడానికి విదేశీ దురా క్రమణదారులు ఇక్కడి ధార్మిక స్థలాలు, మందిరా లపై దాడిచేసి, వాటిని ధ్వంసం చేశారు. ఇలా ఒక్కసారికాదు, అనేకసార్లు చేశారు. ఈ విధంగా భారతీయ సమాజాన్ని బలహీనపరచి దీర్ఘకాలం ఇక్కడ రాజ్యం చేయాలన్నది వారి ప్రయత్నం.
అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని కూడా ఇదే ఉద్దేశ్యంతో, లక్ష్యంతో ధ్వంసం చేశారు. దురాక్రమణ కారుల ఈ లక్ష్యం కేవలం ఒక మందిరానికే పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలన్నది వారి అసలు ఉద్దేశ్యం.
ఈ దేశానికి చెందిన రాజులు ఎప్పుడూ, ఏ దేశంపైన దురాక్రమణ చేయలేదు. కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాలకు చెందిన రాజులు మాత్రం అటువంటి దాడులు, దురాక్రమణలకు పాల్పడ్డారు. అయినా ఏ పాలకుడూ భారత్‌పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోయాడు. భారతీయ సమాజం ఎప్పుడూ ఈ దురాక్రమణ దారుల ముందు తలవంచలేదు. వీరిని ఎదుర్కు నేందుకు నిరంతరం పోరాటం చేస్తూనేఉంది. రామజన్మభూమిలో మందిర నిర్మాణ సంకల్పం హిందువుల మనస్సుల నుండి ఎప్పుడూ తొలగిపోలేదు.
1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు హిందువులు, ముస్లిములు కలిసే ఆ పని చేశారు. అప్పటివరకూ ఇద్దరూ ఆలోచనలు పంచుకునేవారు. అప్పుడు గోవధ నిషేధం, రామజన్మభూమి గురించి రెండు వర్గాల మధ్య ఒక అంగీకారం కుదిరే పరిస్థితి ఏర్పడిఉంది. తన ప్రమాణపత్రంలో గోవధ నిషేధం అమలుగురించి కూడా బహదూర్ షా జాఫర్ పేర్కొన్నాడు. అందువల్లనే సమాజం మొత్తం ఒకటిగా నిలచి పోరాడిరది. భారతీయులందరూ వీరోచితంగా పోరాడినా దురదృష్టవశాత్తూ ఆ యుద్ధం విఫలమైంది. దానితో బ్రిటిష్ పాలన కొనసాగింది. అయితే రామజన్మభూమి ముక్తి పోరాటం మాత్రం ఆగలేదు. బ్రిటిష్ వాళ్ళు మొదటి నుండి అనుసరిస్తూ వచ్చిన ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని ఆ తరువాత మరింతగా అమలు చేశారు.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సోమనాథ మందిర జీర్ణోద్ధరణ జరగడంతో ఇటువంటి దేవాలయాల గురించి చర్చ మళ్ళీ ప్రారంభమయింది. రామజన్మభూమి ముక్తి గురించి అందరి ఆమోదం, అంగీకారం సాధించే అవకాశం అప్పుడు వచ్చినా రాజకీయాలు మరోదారి పట్టాయి. విచ్ఛిన్నవాదం, ప్రాంతీయవాదం వంటివి రాజకీయాల ముసుగులో పెచ్చరిల్లాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయమై హిందువుల మనోభావాలను పట్టించుకోకపోగా వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రజలు చేసిన ప్రయత్నాలను కూడా ముందుకు సాగనివ్వ లేదు. ఈ విషయమై స్వాతంత్య్రానికి ముందు నుండి సాగుతూవచ్చిన న్యాయపోరాటాన్ని కొనసాగించారు. రామజన్మభూమి విముక్తి కోసం ప్రజా ఉద్యమం 1980 తరువాత ఊపందుకుంది. అప్పటి నుండి మూడు దశాబ్దాలపాటు సాగింది.
1949లో జన్మభూమిలో
భగవాన్ శ్రీరామచంద్రుని విగ్రహం వెలిసింది. 1986లో కోర్టు ఆదేశం మేరకు ఆలయపు తాళాలు తెరిచారు. 2010లో అలహాబాద్ హైకోర్ట్ స్పష్ట మైన తీర్పునిచ్చింది. చివరికి హిందుసమాజపు 30 సంవత్స రాల సుదీర్ఘమైన న్యాయపోరాటం తరువాత 2019 నవంబర్ 9న అన్ని సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీం కోర్ట్ సముచితమైన, సంతులిత మైన తీర్పును ప్రకటించింది. రెండు పక్షాల మనోభావాలు, సాక్ష్యాధారాలను కోర్ట్ పరిగణలోకి తీసుకుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి అన్ని పక్షాల వాదనలను కూడా కోర్ట్ పూర్తిగా విన్న తరువాత తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి మందిర నిర్మాణం కోసం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. 2020 ఆగస్ట్ 5 మందిర భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు పుష్య మాస శుక్లపక్ష ద్వాదశి, యుగాబ్ది 5125, 2024 జనవరి 22న శ్రీ రాంలలా విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి.
ధార్మిక దృష్టితో చూస్తే శ్రీరాముడు ఈ దేశంలో అధిక సంఖ్యాకులకు ఆరాధ్య దేవుడు. ఆయన జీవితం ఆదర్శప్రాయమని, అనుసరణీయమని నేటికీ సమాజంలో అందరూ భావిస్తున్నారు. అయోధ్య అంటే ‘యుద్ధం లేనిది’, ‘సంఘర్షణలేని స్థానం’ అని అర్ధం. సమాజంలోని ప్రతిఒక్కరి మనస్సులలో అటువంటి అయోధ్య నిర్మాణం కావాలి. అది మనందరి కర్తవ్యం.
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జాతి గౌరవ పునర్ జాగరణకు గుర్తు. ఇది శ్రీ రాముని జీవితం ఇచ్చే సందేశాన్ని ఆధునిక సమాజం కూడా స్వీకరించిందనడానికి గుర్తు. శ్రీరామ మందిరంలో పత్రం, ఫలం, పుష్పంతో పూజతోపాటు రామ దర్శనంతో మనస్సులో ఆయనను ఉంచుకుని ఆదర్శ వంతమైన ఆచరణను అలవరచుకుని శ్రీరాముని పూజ చేయాలి. ఎందుకంటే ‘శివో భూత్వా శివం భజేత్, రామో భూత్వా రామం భజేత్’ (శివుడేతానై శివుని పూజించు, రాముడేతానై రాముడిని పూజించు)అనేదే నిజమైన పూజా అవుతుంది.
భారతీయ సాంస్కృతిక దృష్టి ప్రకారం-
మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్
ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సః పణ్డితాః
(పర స్త్రీని మాతృభావనతో చూడాలి. పరుల సొమ్మును మట్టిగా ఎంచాలి. సర్వ జీవులలో ఆత్మను చూడాలి అని పండితులు చెపుతారు) ఈ విధంగా మనం శ్రీరాముని మార్గంలో నడవాలి.
సత్యనిష్ట, బలపరాక్రమాలతోపాటు క్షమ, వినయం, అందరినీ సమాదరించే ధోరణి, కారుణ్యం, కర్తవ్యపాలనలో పట్టుదల వంటి శ్రీరామ చంద్రుని గుణాలను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అలవరచుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ తెచ్చుకోవాలి. ఇటువంటి క్రమశిక్షణ ద్వారానే రామలక్ష్మణులు 14ఏళ్ల అరణ్యవాసాన్ని పూర్తిచేయడమేకాక శక్తిశాలి రావణునితో పొరాడి విజయం సాధించారు. శ్రీరాముని జీవితంలో కనిపించే న్యాయబుద్ధి, కరుణ, సద్భావం, నిస్పక్షపాత ధోరణి, సామాజిక గుణాలను తిరిగి ఈ సమాజంలో పాదుకొల్పాలి. శోషణ లేని, సమాన న్యాయం లభించే సమాజాన్ని, శక్తితోపాటు కరుణ నిండిన ఒక సమాజాన్ని నిర్మించడమే శ్రీరాముని నిజమైన పూజ అవుతుంది.
అహంకారం, స్వార్థం, భేదభావాల మూలంగా ప్రపంచం వినాశం వైపు పరుగులు తీస్తోంది. ఎన్నో ఆపదలను కొనితెచ్చుకుంటోంది. సద్భావన, ఏకత, ప్రగతి, శాంతి వంటి మార్గాన్ని చూపిన జగదభిరాముని ఆదర్శం సర్వకళ్యాణకారి, ‘సర్వేషాం అవిరోధి’ (ఎవరితోనూ విరోధం లేని) అయిన సమాజ నిర్మాణపు ప్రారంభానికి దారి చూపాలి. ఆ మహా ప్రయత్నానికి శ్రీ రాంలాలా ప్రాణప్రతిష్ట నాంది కావాలి. మనమంతా ఆ ప్రయత్నంలో, ఆ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని ముందుకు నడుద్దాం.