ఇస్కాన్ చిన్మయ దాస్ పై దేశద్రోహం మోపిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ లో హిందువులపై అకృత్యాలు ఏదో ఒక రూపంలో ఇంకా జరుగుతున్నాయి. తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. చిట్టగాంగ్ లో వున్న ఇస్కాన్ గ్రూప్ కి చెందిన ప్రముఖులు చిన్మోయ్ దాస్ పై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టింది.చిన్మోయ్ దాస్ బ్రహ్మచారితో పాటు మరో 19 మందిపై కూడా కేసు నమోదైంది. అక్టోబర్ 25 న చిట్టగాంగ్ లో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని చిన్మోయ్ దాస్ పై అభియోగాలు మోపింది. ఈ ప్రదర్శనలో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై ఇస్కాన్ జెండాను ఎగరేశారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే దీనిపై చిన్మోయ్ దాస్ స్పందించారు.
ర్యాలీ రోజున కొందరు చంద్రుడు నక్షత్రాలున్న జెండాపై కాషాయ జెండా ఎగరేశారని, అయితే చంద్రుడు, నక్షత్రం జెండా బంగ్లాదేశ్ జాతీయ జెండా కాదని స్పష్టం చేశారు.జెండా ఎవరు ఎగరేశారో మాత్రం తనకు తెలియదన్నారు. మరోవైపు తనపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను అవామీ లీగ్ మద్దతుదారుడినని, ఇండియన్ ఇంటెలిజెన్స్, రా సంస్థ సహకారంతో బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ ట్రస్ట్ కార్యదర్శిగా చిన్మోయ్ దాస్ కొనసాగుతున్నారు. అక్కడ హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే వున్నారు.