బంకిచంద్ర చటర్జీ
జూన్ 26 బంకిచంద్ర జయంతి
స్వాతంత్య్రోద్యమంలో కోట్లాది భారతీయులను ఉర్రూతలూగించిన ‘‘వందేమాతరం’’ గీత రచయిత బంకించంద్ర చటర్జీ. ‘‘ఆనందమఠం’’ అనే నవలలో మాతృభూమిని దుర్గాదేవితో పోలుస్తూ ఈ స్తోత్రాన్ని వ్రాశారు. ఆయన బెంగాలీ భాషలో ఇంకా అనేక నవలలు, కథలు, కథానికలు రచించారు.
బంకించంద్ర జూన్ 26, 1838న బెంగాలు రాష్ట్రంలోని ‘‘నైహతి’’ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ‘‘యాదవ చంద్ర చటర్జీ, దుర్గాదేవి. యాదవ చంద్ర చటర్జీ మిడ్నాపూర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. బంకిం చంద్ర విద్యాభ్యాసం హుగ్లీ మరియు కలకత్తాలో జరిగింది. 1857లో కలకత్తా ప్రెసిడెన్సి కాలేజి నుంచి డిగ్రీ పొందారు. తండ్రివలేనే బంకించంద్ర కూడా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. 1891లో డిప్యూటీ మొజిస్టేటుగా పదవీ విరమణ చేశారు. వారి ఉద్యోగ సమయంలో ఎప్పడు బ్రిటిష్ అధికారులకు తలవంచలేదు. బెంగాలీ భాషలో మొదటి నవల ‘‘దుర్గేష్ నందిని’’ 1865లో బంకించంద్ర రచించారు. ‘‘బంగదర్శన్’’ అనే మాస పత్రికను ఏప్రిల్ 1872లో ఆయన ప్రారంభించారు.
1882 సంవత్సరంలో సాధువులు బ్రిటిష్ వారితో పోరడటం ఇతివృత్తంగా ‘‘ఆనందమఠం’’ నవల రచించారు. వందేమాతర గీతం నవలలోనే ఉంది. భగవద్గీతకు భాష్యం వ్రాశారు. అయితే ఆయన మరణించిన తరువాత 8సంవత్సరాలకు ప్రచురించబడింది. వారి రచనలు అన్నీ హిందూ ధర్మం ఆధారంగా కొనసాగించారు. హిందూవులు పాశ్చాత్య పోకడలను అనుసరించడం ఆయన వ్యతిరేకించారు. హిందూ ధర్మంలో అవసరమైన సంస్కరణలు చేస్తేనే జాతి సర్వతోముఖ వికాసం సాధ్యమని అభిప్రాయపడ్డారు. 1894 ఏప్రిల్ 8న శ్రీబంకించంద్ర చటర్జీ పరమపదించారు.