జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం : బస్తర్ నక్సల్స్ బాధిత కుటుంబాల ప్రెస్ మీట్
బస్తర్ లో నక్సలైట్ల బీభత్సానికి, అమానవీయ సంఘటనలకు బలై, తమ కుటుంబాలను కోల్పోయిన బాధితులంతా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ గోడును ఈ ప్రపంచానికి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష పార్టీలు బలపరచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఈ బాధితులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు ఆయనకు ఏ పార్లమెంటు సభ్యుడు కూడా మద్దతివ్వద్దని తాము ఎంపీలందర్నీ కోరుతున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బస్తర్ శాంతి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నక్సల్స్ బాధితులు మాట్లాడుతూ.. ‘‘నక్సల్ ఉద్యమానికి వ్యతిరేకంగా గిరిజన ప్రజలు చేసిన ఉద్యమాన్ని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నిషేధించారు. దీని కారణంగా బస్తర్ లో మావోయిజం వేగంగా విస్తరించింది. తమకు ప్రాణాంతకంగా మారింది. ఆ గాయాలు ఇప్పటికీ తమను వెంటాడుతూనే వున్నాయి. నక్సలైట్ల నుంచి వచ్చే దుష్ప్రభావాల వల్ల వచ్చిన ప్రభావాలు నేటికీ తమ కుటుంబాలను వెంటాడుతూనే వున్నాయి.’’ అని పేర్కొన్నారు.
సల్వాజుడుం ద్వారా నక్సలిజాన్ని పూర్తిగా బలహీనపరిచామని, పతనం అంచుకు తీసుకొచ్చామని, అయినా.. ఢిల్లీలోని కొంతమంది నక్సలైట్ల మద్దతుదారుల సలహా మేరకు సల్వాజుడుంను నిషేధించారని మండిపడ్డారు. ఈ సల్వాజుడుంను నిషేధించే ముందు అసలు తమ బాధలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, నక్సల్స్ వల్ల తమ కుటుంబాలు ఎంతలా నష్టపోయాయి? ఎంత బాధను అనుభవిస్తున్నాం? ఎంత మంది తమ కుటుంబీకులను కోల్పోయాం? ఇవేవీ అర్థం చేసుకోలేదని, అసలు బస్తర్ ప్రజలుగా తాము ఏమీ ఆశిస్తున్నామో కూడా ఎప్పుడూ అడగలేదని విరుచుకుపడ్డారు.
నక్సల్ బాధితుల్లో ఒకరైన సియారామ్ రాంటేకే మాట్లాడుతూ… ‘‘నా బాధ వర్ణనాతీతం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గనక ఆ తీర్పు ఇవ్వకపోతే, మా ఇంట్లో అసలు విషాదం జరిగేదే కాదు. నేను ఓ సాధారణ రైతును. మావోయిస్టులు నాపై మూడు సార్లు కాల్పుల జరిపారు. రాళ్లతో దాడికి దిగారు. తాను చనిపోయానని భావించి, వదిలేశారు. ఇప్పుడు నేను వికలాంగునిగా జీవించాల్సిన దుస్థితి వచ్చింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాలు ప్రతిపాదించాయని విన్నప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. తీవ్ర ఆగ్రహానికి గురయ్య. అలాగే తీవ్ర బాధేసింది కూడా.’’అని అన్నారు.
బస్తర్ కి చెందిన మరో నక్సల్ బాధితుడు కేదార్ నాథ్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘‘సల్వాజుడుంను రద్దు చేసిన తర్వాత నా సోదరుడ్ని కోల్పోయా. నక్సలైట్లు తన సోదరుడ్ని దారుణంగా హత్య చేశారు. నా సోదరుడి కడుపును చీల్చి, పేగులను బయటకు లాగారు. సల్వా జుడుంకు వ్యతిరేకంగా 2011లో తీర్పు వెలువడకపోతే, 2014 నాటికి మావోయిస్టులు తమ ప్రాంతం నుండి తుడిచిపెట్టుకుపోయేవారే. నా సోదరుడూ బతికి వుండేవాడు’’ అని కేదార్ నాథ్ అన్నారు.
ఇక… మరో నక్సల్స్ బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘ నక్సల్స్ హింసతోనే నా భర్తను కోల్పోయా. నా భర్త మోహన్ ఉయ్ కే ను నక్సల్స్ చంపేశారు. సల్వాజుడుంను నిషేధించిన తర్వాత మావోలు తన భర్తపై నక్సల్స్ తీవ్రంగా దాడి చేశారు. చంపేశారు. ఆ సమయంలో నాకు మూడు నెలల కుమార్తె వుంది. తన తండ్రిని నేను చూడలేకపోయానని ఎప్పుడూ బాధపడుతూనే వుంటుంది. నాకు న్యాయం జరగాలి’’ అని పేర్కొంది.
బస్తర్ శాంతి సమితి ప్రతినిధి జయరామ్ మాట్లాడుతూ.. ఈ రోజు నక్సల్స్ బాధితులు పుట్టెడు దు:ఖంతో ఢిల్లీకి వచ్చారని, తమ జీవితాలను నరకంగా మార్చేసి, బస్తర్ ప్రాంతాన్ని నరకంగా మార్చిన వారికి మద్దతు ఇవ్వొద్దని పార్లమెంట్ సభ్యులందర్నీ అభ్యర్థించడానికే ఇక్కడికి వచ్చామని స్పష్టం చేశారు. ఇదే విజ్ఞప్తితో అన్ని ఎంపీలకు లేఖలు కూడా రాసినట్లు సమితికి చెందిన మంగౌ రామ్ కావ్డే తెలిపారు.సల్వా జుడుం నిషేధం కారణంగా బస్తర్‌లో వేలాది కుటుంబాలు నష్టపోయాయని, మావోయిస్టు హింసాకాండను భరించాయని ఆయన వివరించారు. ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించడంతో తాము తీవ్రంగా బాధపడుతున్నామని, ఈ విషయాన్ని తెలిపేందుకే ఢిల్లీకి వచ్చామన్నారు.