గృహలక్ష్మి పథకం ద్వారా వచ్చే డబ్బులతో గ్రంథాలయాన్ని నిర్మించిన మల్లవ్వ

ఏ ప్రభుత్వమైనా మహిళల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూ వుంటుంది. వీటి ద్వారా వచ్చే డబ్బులతో మహిళలు తమ అవసరాలు తీర్చుకోవడమో, లేదా పిల్లల చదువులకో వినియోగిస్తుంటారు. మొత్తానికి తమ అవసరాల కోసమే వాడుకుంటారు. కానీ… కర్నాటకలోని బెళగావి మహిళ మాత్రం వినూత్నంగా ఆలోచించి… ‘‘పరోపకారార్థ మిదం శరీరం’’ అన్న సూక్తిని అక్షరాలా పాటించింది. కర్నాటకలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా గృహలక్ష్మి పథకం కింద ప్రతి నెలా 2 వేల రూపాయలను మహళల ఖాతాలో జమ చేస్తోంది. అయితే బెళగావి జిల్లా రాయబాగ తాలూకా మంటూరు గ్రామానికి చెందిన మల్లవ్వ భీమప్ప అనే మహిళ మాత్రం ప్రభుత్వం ఇస్తున్న గృహలక్ష్మి సొమ్ముతో ఊళ్లో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అక్కడి యువత భవిష్యత్తునే పూర్తిగా మార్చేస్తోంది.గ్రామపంచాయతీ సభ్యునిగా ఉంటూ పిల్లల పోటీ పరీక్షల సౌలభ్యం కోసం గృహ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన పదమూడు విడతల సొమ్మును, పంచాయతీ సభ్యత్వ గౌరవ వేతనంతో పాటు పిల్లల సహకారంతో ఖర్చు చేసి చిన్న లైబ్రరీ నిర్మించి అందరికీ రోల్ మోడల్‌గా నిల్చింది మల్లవ్వ భీమప్ప

ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పిల్లలు బాగా చదువుకోవాలని, ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, తమ తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని మల్లవ్వ భీమప్ప ఆకాంక్ష. అందుకే ఈ లైబ్రరీని నిర్మాణం చేసింది. తన 13 నెలల గృహలక్ష్మి పథకం చెల్లింపుల నుంచి 26 వేల రూపాయలతో లైబ్రరీని నిర్మించింది. ఈ లైబ్రరీలో సివిల్స్ కి సంబంధించిన పుస్తకాలు, గ్రూప్ 1 కి సంబంధించిన పుస్తకాలున్నాయి. కన్నడ, ఇంగ్లీషు భాషలోనూ వున్నాయి. బెళగావి, హుబ్లీ, ధార్వాడ్ వంటి నగరాల్లో వుండే కోచింగ్ సెంటర్లకి గ్రామీణ విద్యార్థులు ఆర్థిక కారణాల రీత్యా వెళ్లడం లేదు. దీంతో వారి ఇబ్బందులను తెలుసుకొని, మల్లవ్వ ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టడం, ఆ నగరాల్లోని హాస్టళ్లలో డబ్బులు కట్టడం లాంటి ఇబ్బందులు వున్నాయని, అందుకే గ్రామీణ విద్యార్థులకు సాయం చేయడానికే ఈ గ్రంథాలయం అని తెలిపారు. తనకు వచ్చిన ఆలోచనలను మొదట విద్యావంతులతో చర్చించారు. ఆ తర్వాత వారు కూడా ముందుకు రావడంతో సంకల్ప్ గ్రామ సేవా సంస్థ వారు ఈ గ్రంథాలయానికి పుస్తకాలను బహుమతిగా అందజేశారు.

 

పల్లెల్లో చాలా మంది విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువుకోవడం లేదని, చదువుకి దూరమవుతున్నారని మల్లవ్వ వాపోయారు. మరికొందరు చదువుకున్నా… కోచింగ్ సెంటర్ల ఫీజులు భరించలేక.. పోటీ పరీక్షలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలన్న తల్లిదండ్రుల కలలను నిజం చేయాలనే ఈ గ్రంథాలయాన్ని స్థాపించానని పేర్కొన్నారు.

 

మరోవైపు ఈ గ్రంథాలయాన్ని మల్లవ్వ అద్భుతంగా తీర్చిదిద్దారు. అన్ని వసతులూ ఇందులో వున్నాయి.ఒకరు చదువుతున్నంత సేపూ పుస్తకం కోసం మరో విద్యార్థి వేచి చూడాల్సిన అవసరం లేకుండా… ఓ పుస్తకం కాపీలే అధిక సంఖ్యలో తెప్పించారు. దీంతో విద్యార్థుల సమయం వృథా అవ్వదని మల్లవ్వ పేర్కొన్నరు. లైబ్రరీలో బుక్ కేబిన్లు, ఫ్యాన్లు, ఫర్నీచర్, విద్యుత్ కోసం బ్యాటరీ బ్యాకప్, స్వచ్ఛమైన తాగునీరు, శ్రద్ధగా చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని నెలకొల్పింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ లైబ్రరీ తెరిచి వుంటుంది. మొన్నటి వరకూ యువత బయట వుండేవారని, ఇప్పుడు యువత లైబ్రరీలో సమయం గడుపుతున్నారని మల్లవ్వ ఆనందం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *