భగత్ సింగ్ దేశ భక్తి
1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ లో రౌలట్ చట్టానికి నిరసన తెలపడం కోసం సమావేశమైన వేలాది ప్రజల మీద జనరల్ డయ్యర్ మర ఫిరంగులతో కాల్పులు జరిపించాడు. దాదాపు 360మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఆ సంఘటనతో దేశమంతా గగ్గోలెత్తింది.
ఆ మరునాడు భగత్ సింగ్ పాఠశాలకు ఉదయమే వెళ్ళాడు. భగత్ సింగ్ చిన్న చెల్లెలు అమృత తన సోదరుని మనస్థితిని ఇలా వర్ణించి చెప్పింది -‘‘అతను స్కూలుకు వెళ్లలేదని తెలిసింది. అతను సరాసరి జలియన్ వాలాబాగ్‌కు వెళ్ళాడు. ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ దిగులుపడి ఉన్నారు. ముఖం వేలాడేసుకుని ఎంతోసేపటికి ఇంటికి వచ్చాడు. అన్నా ఇంత ఆలస్యం అయిందేమిటి? అని అడిగాను. జవాబు చెప్పాడు. ఏమి తెచ్చానో చూడు అంటూ జేబులో నుంచి ఎర్రగా కనిపిస్తున్న ఒక సీసాను బయటకు తీశాడు. చూశావా ఇందులో జలియన్ వాలాబాగ్ లోని మట్టి ఉంది. నెత్తురుతో తడిసిన మట్టి ఇది. తెల్లవాళ్లు నిరాయుధులైన మన దేశీయులను హతమార్చారు. ఎంతమంది చనిపోయి ఉంటారో ఏమో అన్నాడు.
ఆ రోజున అన్న ఆహారం ముట్టలేదు. తోటలో నుండి చాలా పూలు తెచ్చి ఆ సీసాను అలంకరిం చాడు. దానికి ప్రణమిల్లాడు. లోలోపల ఏదో గొణుక్కున్నాడు. ఆ సీసాకు భక్తి కుసుమాలు సమర్పిస్తుండేవాడు. ఆ హుతాత్ముల రక్తంతో ఆయనకు సన్నిహిత సంబంధం ఏర్పడిరది. అందుకే తాను కూడా విప్లవ కారులకు నాయకుడై ఆత్మబలిదానం చేశాడు.