వీహెచ్ పీ ఆధ్వర్యంలో విజయవాడలో భగవద్గీత పోటీలు

విశ్వ హిందూ పరిషత్ సంస్కృత విభాగమైన ‘భారత సంస్కృత పరిషత్’ వారు ప్రాంత భగవద్గీత పోటీలను విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగంలోని శ్లోకాలతో ఈ పోటీ జరిగింది.భారత సంస్కృత పరిషత్తు గత 29 సంవత్సరాలుగా భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా పోటీలు జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులు, వయోజనులను ఆరు విభాగాలుగా విభజించి పోటీ నిర్వహించారు. ఈ పోటీలో భగవద్గీతా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని చక్కటి కంఠస్వరంతో భగవద్గీత శ్లోకాలను పఠించారు.

విశ్వహిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షుడు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు, అఖిలభారత సంస్కృత పరిషత్ కార్యకారిణి సదస్సు సభ్యులు చల్లా లక్ష్మీనారాయణ, ఉత్తరాంధ్ర ప్రాంత సంయోజక్ డాక్టర్ చెట్లపల్లి జగన్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణీతలుగా 15 మంది సంస్కృత పండితులు వ్యవహరించి విజేతలను ప్రకటించి బహుమతులు అందజేసారు.భగవద్గీతా పారాయణ పోటీని పురస్కరించుకుని సత్యనారాయణపురం పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. సుమారు 250 మంది మహిళలు, పురుషులు, యువతీ యువకులు పాల్గొన్నారు. వారు కాషాయ ధ్వజాలు చేతపట్టి జయ జయ గీత భగవద్గీత అనే నినాదాలతో శోభాయాత్ర చేసారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *