భారత్ లో విచ్ఛిన్నకారుల ఆటలు సాగవ్ : సోషల్ మీడియా సంగంలో వక్తలు

భాగ్యనగర్ విభాగ్ స్థాయిలో సోషల్ మీడియా సంగం2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటి కాలాంశంలో ముఖ్య అతిథిగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి రాళ్లపల్లి భరత్ భూషణ్ హాజరవ్వగా, సమాచార భారతి జాయింట్ సెక్రెటరీ ఉప్పల ప్రదీప్ అధ్యక్షత వహించారు అలాగే సమాచార భారతి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాచార భారతి కార్య పద్ధతి గురించి, సోషల్ మీడియా సంగం ముఖ్య ఉద్దేశాలను ఉప్పల ప్రదీప్ వివరించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా సోషల్ మీడియా సంగమాన్ని సమాచార భారతి నిర్వహిస్తోందని తెలిపారు. ఇదో నెట్ వర్క్ బిల్డింగ్ అని వివరించారు. ఈ సందర్భంగా మన దేశానికి సంబంధించిన కంటెంట్ ను తెలుసుకొని, తమ తమ సోషల్ మీడియాలో విస్తృతంగా వాడుకోవాలన్నదే దీని వెనుక వున్న సంకల్పం అని వివరించారు.
ఇక.. ముఖ్య అతిథిగా హాజరైన భరత్ భూషణ్ మాట్లాడుతూ తప్పుడు సమాచారం, వక్రీకరణతో కూడిన సమాచారాన్ని కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ఇజ్రాయిల్ పార్లమెంట్ లో మాట్లాడారని, అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారన్నారు. మన దేశంలోని ప్రజలు చాలా సంతోషంగా వున్నారని, కానీ.. కొందరు దీనిని కూడా వక్రీకరించారన్నారు. మన చరిత్రను మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు. మన చరిత్ర, మన పరిణామక్రమాన్ని తెలుసుకొని, దేశాన్ని నిర్మించడమే అతి ముఖ్యమైన పని అని అన్నారు.
నేటి రోజుల్లో సెల్ ఫోన్లు చాలా మందిని తప్పుదోవ పట్టిస్తున్నాయని, కానీ.. అందులో సరైన సమాచారాన్ని షేర్ చేయడం, సరైన సమాచారం కోసం దానిని వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. మీడియా అనేది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి అని అభివర్ణించారు. ప్రభుత్వం చెప్పేది ప్రజలకు చేరవేయడం ఒక్కటే మీడియా పాత్ర కాదని, అసలు ప్రజలకు ఏం కావాలో కూడా తెలుసుకొని, ప్రభుత్వానికి నివేదించడం కూడా మీడియా పనే అని అన్నారు. అది ప్రభుత్వానికి నచ్చినా, నచ్చక పోయినా ప్రభుత్వానికి మాత్రం నివేదించాలన్నారు. కానీ.. అసలు ఈ విషయాన్ని కొన్ని సంవత్సరాలుగా మన దేశంలోని మీడియా మరిచిపోయిందని విమర్శించారు.మన చరిత్రనే మరిచిపోయేలా చేశారని, చరిత్రను మార్చాలని చూశారని, కానీ అది సాధ్యం కాలేదన్నారు. ఎందుకంటే ఈ మట్టికి అంత తపశ్శక్తి వుందన్నారు.
భారత్ అంటే పుణ్యభూమి అని, ఎక్కడైతే ప్రజలు పూర్తి విజ్ఞానవంతులై వుంటారో, అక్కడ ఇలాంటి ఆటలు సాగవన్నారు. చాలా విషయాలను వక్రీకరించి చూపించాలని చాలా ప్రయత్నాలు జరిగాయని, ఉగ్రవాద దాడుల్ని కాస్త.. హిందూ టెర్రర్ గా మసిపూసి మారేడు కాయ చేయాలని చూశారని, కానీ అలా జరగలేదని, అలా జరగకుండా కొందరు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. ఉగ్రదాడులకు కారణభూతుడైన కసబ్ ను పట్టుకొన్నామని, లేదంటే కొన్ని విషయాలను కొందరు భారత్ పై రుద్దేవారన్నారు. అందుకే చరిత్ర విషయంలో అందరూ అవగాహనతో వుండాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్రారంభ దశలో చాలా తక్కువ వ్యాప్తి వుండేదని, కానీ ఇప్పుడు దాని వ్యాప్తి విస్తరించిందన్నారు. చరిత్రను బాగా అధ్యయనం చేయాలని, ఇందుకు యువత ముందుకు రావాలన్నారు. దీని ద్వారా అసలు మన చరిత్రను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో యువత తెలుసుకోవాలని కోరారు.
ధర్మం అంటే జీవన శైలి అని, కానీ ఇప్పుడు దానిని మతం అంటున్నారని అన్నారు. ప్రపంచంలో అన్నింటి కంటే అత్యంత పురాతనమైన జీవన శైలి హిందూ జీవన శైలి అని అన్నారు.సోషల్ మీడియా సంగం లాంటి కార్యక్రమాలు అసలైన చరిత్రను తెలుసుకోవడానికి, అలాంటి వ్యక్తుల సమూహాలను కలుపుకోవడానికి ఉపకరిస్తుందని భరత్ భూషణ్ అన్నారు.
ఇక రెండో కాలాంశంలో రాష్ట్రీయ సేవికా సమితి తెలంగాణ ప్రాంత తరుణ ప్రముఖ్ డాక్టర్ కాంచన ముప్కాల్కర్, స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంత సహ సంయోజక్ సిద్దుల అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ ప్రబోధన్ పై కాంచన మాట్లాడారు. కుటుంబం ద్వారానే సంస్కృతి అలవడుతుందని, నేను నుంచి మనం వరకూ కుటుంబం తీసుకెళ్తుందని, తల్లి పాత్ర ఇందులో చాలా ప్రముఖమైందన్నారు. మనమంతా ఒక్కటే అన్న భావన రాబోయే తరాలకు చేరాలని, వారు కూడా ఇలాగే ఆలోచించాలన్నారు. అలాగే వ్యక్తి నిర్మాణంలో కుటుంబ సభ్యులందరి పాత్రా వుంటుందన్నారు. కానీ నేటి తరంలో చాలా మందికి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రేమ, మార్గదర్శనం లభించడం లేదని, అది దురదృష్టకరమని అన్నారు. వోకిజం, డిక్, లాంటి తప్పుడు అభిప్రాయాలు కూడా పెరిగిపోతున్నాయన్నారు.
సోషల్ మీడియా ద్వారా మంచి వుందని, చెడూ వుందన్నారు. కన్స్యూమరింగ్ కూడా పెరిగిందన్నారు. మన కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికి వ్యాపారాలు కూడా పనిచేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాను అత్యంత సకారాత్మకంగా వాడుకున్నట్లయితే.. మంచి విషయాలను ప్రచారం చేయవచ్చని, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవచ్చని సూచించారు. కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటే దేశం బాగుంటుందని, లేదంటే ఛిన్నాభిన్నం అవుతుందన్నారు. సోషల్ మీడియా కరోనా లాంటి సమయాల్లో అనేక మందిని కలిపిందని, చాలా కుటుంబాలు, బంధువులు వాట్సాప్ ద్వారా కలిశారని గుర్తు చేశారు.
ఇక.. సిద్దుల అశోక్ కుటుంబ వ్యవస్ధలో స్వదేశీ వస్తువుల వినియోగంపై మాట్లాడారు. గతంలో వేప పుల్లతో పండ్లు తోమేవారమని, కానీ ఇప్పుడు కోల్గేట్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. దీనికి తగ్గట్టుగా యాడ్స్ కూడా పెరిగిపోయాయన్నారు. పేస్టుల ద్వారా మన పళ్లు కూడా చెడిపోతున్నాయని, అందులో అంత కెమికల్స్ వున్నాయన్నారు. గతంలో డెంటిస్ట్ వైద్యులు ఎక్కువగా వుండేవారు కాదని, కానీ.. ఇప్పుడు వారి సంఖ్య పెరిగిపోయిందన్నారు. అలాగే సున్నిపిండి,తైలం స్థలంలో సబ్బులు వచ్చేశాయన్నారు. విదేశీ వ్యవస్థలు కావాలనే, ఒక కుట్రతో టీవీ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ మన మనస్సులపై ప్రభావాన్ని చూపించారన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే స్వదేశీ వస్తువు వినియోగం బాగా పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే Natural products ని స్థానికులు తయారు చేస్తున్నారని, వారందర్నీ ప్రోత్సహించాలని సూచించారు.
ఇక.. మూడో కాలాంశంలో విశ్వమాంగళ్య సభ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి గాయత్రి లామ్టే, భాగ్యనగర్ సంఘటనా మంత్రి గాయత్రీ లోహకరే హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రి లామ్టే మాట్లాడుతూ విశ్వమాంగల్యసభ 2010 లో నాగపూర్ కేంద్రంగా ప్రారంభమైందన్నారు. మహిళల సంఘటన కోసం పనిచేస్తోందన్నారు. 15 ఏళ్లలో 33 రాష్ట్రాల్లో విశ్వ మాంగల్య సభ పనిచేస్తోందన్నారు. ఇప్పుడు 15 మంది ప్రచారికలు, 2500 మంది గృహస్థ కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రతి ఇళ్లూ సంస్కారవంతమైందిగా తయారు అవ్వాలని, దీనికి తల్లి కేంద్రం కావాలన్న సంకల్పంతో విశ్వ మాంగల్య సభ పనిచేస్తోందన్నారు. తాము సమస్యల వెంటపడటం లేదని, దానికి అవసరమయ్యే పరిష్కార మార్గాలను వెతికే పనిలో వున్నామని తెలిపారు. కుటుంబానికి కేంద్రం తల్లే అని, ‘‘మాతృ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’’ అన్న ధ్యేయంతో పనిచేస్తున్నామని తెలిపారు.
ఇక చివరి కాలాంశంలో తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో వున్న సమస్యలపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ యవనికపై అనేక మార్పులు వస్తున్నాయని, ఏకధ్రువ ప్రపంచం నుంచి ఇప్పుడు బహుముఖ ప్రపంచం వైపు మళ్లుతోందన్నారు. ఇప్పుడు ఐదో శ్రేణి యుద్ధం నడుస్తోందన్నారు. అంటే మొదట శ్రేణి కత్తులతో, రెండో శ్రేణిలో తుపాకులు, ఫిరంగులు, మూడో శ్రేణిలో లాంగ్ రేంజ్ మిస్సైల్స్, నాలుగో శ్రేణిలో మిస్సైల్ తో పాటు గగనతలం, ఆటంబాంబులతో యుద్ధాలు చేశారని, ఇక ప్రస్తుతం ఐదో శ్రేణిలో ఆయుధాలతో కాకుండా సమాచారంతో యుద్ధం నడుస్తోందని వివరించారు. తప్పుడు సమాచారాన్ని సమాజంలోకి పంపడం ద్వారా, ఆ సమాజాన్ని ప్రమాదకర స్థితిలోకి నెట్టేస్తారన్నారు. భ్రమల కారణంగా తనపై తనే యుద్ధం చేసుకుంటాడని, దీంతో ఆ వ్యక్తి ప్రమాదంలోకి వెళ్లిపోతున్నారని అన్నారు. తప్పుడు సమాచారాలు, వక్రీకరణ, మాయాభ్రమిత సమాచారంతో ఓ దేశాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. డీప్ స్టేట్ ఈ కుట్రలకు తెర లేపిందని, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భ్రమలకు గురిచేసే, మోసపూరిత సమాచారాన్ని చేరవేస్తున్నారన్నారు.
దీనికి కొన్ని ఉదాహరణలను ఉటంకించారు. ఎక్కడైనా ఉగ్రదాడి జరిగితే, ఆ ఉగ్రవాదిని దోషిగా కాకుండా, అతడే బాధితుడు అన్న కోణంలో చూపిస్తున్నారన్నారు. అలాగే మావోయిస్టుల విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. అలాగే మతం విషయంలోనూ అదే జరుగుతోందని, అనారోగ్యంగా వున్న వారిని చర్చిలకు తీసుకెళ్లడం, పిచ్చివారికి సేవ చేసే కేంద్రాలుగా చర్చిలను సినిమాల మాధ్యమంగా చూపిస్తున్నారన్నారు. అంటే సేవ అంటే మదర్ థెరిస్సా, సేవ అంటే చర్చి అనేలా భ్రమలకు గురి చేస్తున్నారన్నారు.సేవ పేరుతో మతం మార్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. స్వామి రామానంద తీర్థ, సోదరి నివేదిత, ఇస్కాన్, డొక్కా సీతమ్మ లాంటి వారు సేవ చేశారని వారిని చూపించరన్నారు. అలాగే హిందుత్వాన్ని అతి భయానకరంగా, విలన్లుగా చూపిస్తున్నారని, హిందువులను గూండాలుగా చూపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.అంటే హిందువులు క్రూరులు అన్నంతలా చూపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *